మమతపై నిషేధం

ABN , First Publish Date - 2021-04-13T07:42:54+05:30 IST

పశ్చిమ బెంగాల్‌ రణాంగణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ ఒకరోజు పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఎలక్షన్‌ కమిషన్‌ నిషేధం

మమతపై నిషేధం

24 గంటల పాటు ప్రచారం చేయరాదు

కోడ్‌ ఉల్లంఘించినందుకే.. స్పష్టం చేసిన ఈసీ 

అప్రజాస్వామికం.. నిరసించిన దీదీ.. నేడు ధర్నా 

టీఎంసీ దళితులను అవమానించింది.. మోదీ ధ్వజం

మరింత హింసకు బీజేపీ కుట్ర.. మమత ఎదురుదాడి

నలుగుర్ని కాదు.. 8 మందిని కాల్చాల్సింది: బీజేపీ నేత


న్యూఢిల్లీ, కోల్‌కతా, ఏప్రిల్‌ 12: పశ్చిమ బెంగాల్‌ రణాంగణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ ఒకరోజు పాటు ప్రచారంలో పాల్గొనరాదని ఎలక్షన్‌ కమిషన్‌ నిషేధం విధించింది. ముస్లింలు గుండగుత్తగా తృణమూల్‌ అభ్యర్థులకే ఓటేయాలని పిలుపివ్వడం, కేంద్ర బలగాలను  ఘెరావ్‌ చేయండని, వాటిపై  తిరగబడమని ప్రజలను రెచ్చగొట్టడం, మొదలైన చర్యల ద్వారా ఆమె ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ఫిర్యాదు చేసింది. వీటిపై సమాధానమివ్వాలంటూ ఈసీ ఆమెకు కిందటివారం రెండు నోటీసులిచ్చింది. తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకోవడంతో సంతృప్తి చెందని ఈసీ 24గంటల పాటు ప్రచారంలో పాల్గొనరాదని, సోషల్‌ మీడియా ద్వారా కూడా ప్రచారం జరపరాదని ఆంక్ష పెట్టింది. ఈ నిషేధం మంగళవారం రాత్రి 8 గంటల దాకా అమల్లో ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం మధ్యాహ్నం నుంచి కోల్‌కతాలోని గాంధీ విగ్ర హం వద్ద ధర్నా చేస్తున్నట్లు మమత ప్రకటించారు. 


రూటు మార్చిన మోదీ

దళితులంతా బీజేపీకి ఓటేస్తుండడం వల్ల బీజేపీ విజయం సాధించబోతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అభిప్రాయం వ్యక్తం చేయడంతో కమలం పార్టీ తన ప్రచార వ్యూహాన్ని ఆ దిశగా మారుస్తోంది. దళితులంతా బిచ్చగాళ్లలా మారి బీజేపీ విసిరే తాయిలాలకు ఆకర్షితులవుతున్నారంటూ సుజాతా మండల్‌ ఖాన్‌ అనే తృణమూల్‌ నేత చేసిన వ్యాఖ్యల్ని ప్రచారాస్త్రంగా మార్చేశారు ప్రధాని మోదీ! ‘‘దళితులు బిచ్చగాళ్లా? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాలాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆత్మ క్షోభించదా? మమత ప్రోద్బలం లేకుండానే సుజాతా ఖాన్‌ ఆ వ్యాఖ్యలు చేశారంటే నమ్మగలమా? తృణమూల్‌ దళితుల్ని అవమానించింది’’ అని ఆయన విమర్శించారు. కాగా.. బెంగాల్‌లో మరింత హింసకు బీజేపీ కుట్ర చేస్తోందని మమత ఆరోపించారు. మరోవైపు నలుగుర్ని కాల్చి చంపడం వల్ల షోకాజ్‌ నోటీసు ఇచ్చారని, 8 మందిని కాల్చి ఉంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేదని బీజేపీ నేత రాహుల్‌ సిన్హా అనడం వివాదాస్పదమైంది.

Updated Date - 2021-04-13T07:42:54+05:30 IST