యోగాసనాలే ఆమెకు ఆసరా!
ABN , First Publish Date - 2021-08-30T05:30:00+05:30 IST
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ పోయాయి. ఇక నడకేలేదనుకున్న ఆమె కృత్రిమ కాళ్లతో నిలబడింది. ఇప్పుడు..! ఉద్దండులను మరిపించేలా ఆసనాలు వేస్తోంది...
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ పోయాయి. ఇక నడకేలేదనుకున్న ఆమె కృత్రిమ కాళ్లతో నిలబడింది. ఇప్పుడు..! ఉద్దండులను మరిపించేలా ఆసనాలు వేస్తోంది. ఎందరికో యోగా పాఠాలు చెబుతోంది. కోల్‌కతాకు చెందిన 35 ఏళ్ల టీచర్ అర్పితా రాయ్ ప్రతికూలతలకు తలవంచని నైజమిది...
ఏప్రిల్ మాసం... 2006 సంవత్సరం. ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే... వెనకాల కూర్చొంది అర్పిత. పశ్చిమ బెంగాల్‌లోని తన గ్రామం బారక్‌పూర్ నుంచి కోల్‌కతాకి ప్రయాణం. 30 కిలోమీటర్ల దూరం. బైక్ రయ్యిన దూసుకుపోతోంది. అక్కడ ఏమేం కొనాలో లోలోపలే జాబితా తయారు చేసుకొంటోంది అర్పిత. ఇంతలో పెద్ద కుదుపు. రెప్పపాటులో జీవితం తలకిందులైంది. ఎదురుగా వస్తున్న భారీ లారీని బైక్ ఢీకొట్టింది. అర్పిత కింద పడింది. లారీ చక్రాలు ఆమె కాళ్లపై నుంచి వెళ్లాయి. పెద్దగా అరుపులు... తన వైపు పరిగెత్తుకొస్తున్న జనం. ‘‘ఎంత ప్రయత్నిస్తున్నా కదలలేకపోతున్నా. భరించలేని నొప్పి. రక్తం ధార కడుతోంది. కానీ నెత్తురు ఎక్కడి నుంచి వస్తుందో తెలియని అయోమయం. చుట్టుముట్టిన వారిలో ఎవరో అంటే తెలిసింది... గాయం కాళ్లకు అని. అదృష్టమేమంటే రోడ్డుకు అవతలి వైపే ఆసుపత్రి ఉంది. వెంటనే నన్ను అక్కడికి తీసుకువెళ్లారు’’ అంటూ చెప్పుకొచ్చింది అర్పిత.
డబ్బు లేక...
ఆసుపత్రిలో అర్పితకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు వైద్యులు. అయితే గాయం తీవ్రమైనది కావడంతో కోల్‌కతాలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. ‘‘అక్కడికి వెళితే రెండు కాళ్లకూ సర్జరీ చేయాలన్నారు. అయితే సమయానికి డబ్బు లేక సర్జరీ పన్నెండు రోజులు ఆలస్యమైంది. ఈ లోగా పూడ్చుకోలేని నష్టం జరిగిపోయింది. నరాలు చచ్చుబడిపోయాయి. కాళ్లు తొలగించాల్సి వచ్చింది. డబ్బు ఉండుంటే నా కాళ్లను కాపాడుకోగలిగేదాన్ని. నాలుగు నెలలు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాక కాళ్లు లేకుండా బయటకు వచ్చాను. ఇది నన్ను విపరీతంగా బాధించింది. కానీ మరుక్షణం ఒక్కటే అనుకున్నాను... ‘ఒకవేళ ఇలా కాకపోయి ఉంటే... అలా జరిగుంటే..’ లాంటివి ఆలోచిస్తూ కూర్చోదలుచుకోలేదు. నన్ను నేను ఓదార్చుకుని, నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను’’ అంటూ అర్పిత ఆ రోజులను గుర్తు చేసుకుంది.
ఆత్మవిశ్వాసమే అండగా...
అర్పితకు ఇరవయ్యేళ్ల వయసులో ఈ ఘటన జరిగింది. సరదాగా కాలేజీకి వెళ్లే ఆ అమ్మాయి జీవితం అంధకారమైంది. ఇలాంటి పరిస్థితుల్లో వేరెవరైనా అయితే కుంగిపోతారు. కానీ అర్పిత రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. అదే ఆమె భవితకు పునాది అయింది. తన తల్లితండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని నిర్ణయించుకుంది. తనలోని శక్తినంతటినీ కూడగట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికి ఆ దుర్ఘటన జరిగి పదిహేనేళ్లు గడిచాయి. కృత్రిమ కాళ్ల సాయంతో ఆమె నిలబడడమే కాదు... వేగంగా నడవగలదు... ప్రొఫెషనల్‌లా యోగా కూడా చేయగలదు. ఎలా?
తనకు తానే స్ఫూర్తి...
కాళ్లు లేవన్న చేదు నిజాన్ని దిగమింగి... అమర్చుకున్న అవయవాలే ఇక తనకు ఆధారమని గ్రహించింది అర్పిత. ‘‘అనుకున్నంత సులువు కాదు కృత్రిమ కాళ్లతో తిరిగి నడవడం. నడక నేర్చుకొనే క్రమంలో ప్రమాద సమయంలో కన్నా ఎక్కువ బాధ అనుభవించాను. అన్నయ్య సంపాదన మీదే ఇల్లు గడవాలి. అప్పటికే నా చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు పెట్టాడు. బంధువులు అందరూ ఇంటికి నేను భారంగా మారానని అనేవారు. వీటన్నిటి నుంచి బయటపడాలంటే నాకు ఒక ఉద్యోగం కావాలి. దాని కోసం నేను కష్టపడాలి. రోజూ ఒక గంట నిలబడగలిగితే పోశ్చర్ సరి అవుతుందని సర్జరీ సమయంలో డాక్టర్లు చెప్పారు. ఆ దిశగా సాధన మొదలుపెట్టాను. ఎవరో నా శరీరాన్ని కోస్తున్నంతగా భరించలేని నొప్పి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మన పంథా మార్చుకోవాలి. వాటికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలి. ఈ సత్యాన్ని గ్రహించాను. కొన్ని నెలలకు నొప్పిని జయించాను. నడవడం ప్రారంభించాను’’ అంటూ అర్పిత భావోద్వేగంతో చెబుతుంది.
కాల్ సెంటర్‌లో ఉద్యోగం...
ప్రమాదం జరిగిన ఏడాదికి కాల్ సెంటర్‌లో చేరింది. ఆఫీ్‌సలో మొదటి రోజు.. తన కాళ్లపై తాను నిలబడిన రోజది. అన్నయ్య కష్టానికి ఉపశమనం కలిగించిన ఆ క్షణం ఉద్వేగానికి లోనైంది. రెండున్నర సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం వదిలేసింది. చుట్టూ ఉన్నవారు వికలాంగురాలని జాలి చూపుతున్నారు. అది ఆమెకు నచ్చలేదు.
ఎందరికో స్ఫూర్తి...
ప్రస్తుతం ఆమె దగ్గర పాతిక మంది యోగాలో శిక్షణ తీసుకొంటున్నారు. తన ఆసనాల ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తుంటుంది. అవి చూసిన ప్రతి ఒక్కరూ అర్పితను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ‘‘ఆ రోజు ప్రమాదంలో చావును తృటిలో తప్పించుకున్నాను. ఇప్పుడు కృత్రిమ కాళ్లతోనైనా సరే లేచి తిరగగలుగుతున్నాను. నా జీవితాన్ని నేను జీవించగలుగుతున్నాను. ఇది అదృష్టమనే చెప్పాలి’’ అంటున్న అర్పిత పయనం తరతరాలకూ స్ఫూర్తి మంత్రం.
ఐదేళ్ల సాధన తర్వాత...
‘‘ఎన్ని గాయాలను తట్టుకున్నా మనసులో ఏదో అలజడి. ఆరంభంలో నా వైకల్యం గురించి చెప్పుకోవడానికి తటపటాయించేదాన్ని. ఎవరికీ తెలియకూడదనుకొనేదాన్ని. కానీ దానివల్ల ఏం చేయాలన్నా లోలోపల భయం కలిగేది. దీన్ని అధిగమించడానికి వ్యాయామాలు, యోగ ప్రారంభించాను. బరువు తగ్గాను. ‘‘మోకాళ్ల దగ్గర పూర్తి నియంత్రణ ఉంటే తప్ప కృత్రిమ కాళ్లతో ఆసనాలు వేయలేం. అందుకే సులువైన ఆసనాలతో మొదలు పెట్టి నిదానంగా క్లిష్టమైన వాటిని ప్రయత్నించా. దాదాపు ఐదేళ్ల సాధన తరువాత నైపుణ్యం సంపాదించాను. 2019 వచ్చేసరికి ఎంతటి ఆసనమైనా చిటికెలో వేయగలిగాను. ఇప్పుడు యోగాలో శిక్షణ కూడా ఇస్తున్నా’’ అంటుంది అర్పిత.