వేదవేద్యుడు విఘ్నేశ్వరుడు
ABN , First Publish Date - 2021-09-10T06:23:48+05:30 IST
ప్రతికూలమైన కాలాన్ని ‘విఘ్నం’ అంటారు. కాలాన్ని శాసించే పరమాత్మ గణపతి. కాబట్టి కాలప్రవాహంలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వేలుపుగా... విఘ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఉన్నత విద్య లభిస్తుంది...
‘విఘ్న సంహారకా’ అని శరణు వేడగానే గజానన స్వరూపంతో కళ్ళముందు కదిలే దైవం, సకల విఘ్నాలనూ తొలగించే మహా దేవుడు వినాయకుడు. ఏ భావంతో కొలిచినా... ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రూపంలో ఆయన సాక్షాత్కరిస్తాడు. సమూహాత్మకమైన సమస్త విశ్వానికీ అధిపతి కనుక ఆయన గణపతి. ఆయనకు మించి మరొక నాయకుడు లేడు కాబట్టి ఆయన మాత్రమే గణనాయకుడు.
ప్రతికూలమైన కాలాన్ని ‘విఘ్నం’ అంటారు. కాలాన్ని శాసించే పరమాత్మ గణపతి. కాబట్టి కాలప్రవాహంలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వేలుపుగా... విఘ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఉన్నత విద్య లభిస్తుంది. సంపద అమితంగా చేకూరుతుంది. సద్గుణసంపన్నులైన సంతానం కలుగుతుంది. పునరావృతరహితమైన మోక్షం కలుగుతుంది. జీవితం ఆనందప్రదంగా సాగుతుంది. ఇది గణపతి పూజా ఫలం. గణపతి ఉపాసన విశిష్టమైనది. ఆయన వెంటనే అనుగ్రహించే దైవం. ఎవరు ఏ దేవతను ఉపాసించినా, పూజించినా.. మొదట వేదవేద్యుడైన గణపతిని పూజించవలసిందేనని భారతీయ ఆర్ష గ్రంథాలన్నీ చెబుతున్నాయి.
- అంతరాయ తిమిరోపశాంతయే
- శాంతపావనమచింత్య వైభవం
- తం నరం పవుషి, కుంజరం ముఖే
- మన్మహే కిమపి తుందిలం మహాః
‘‘పుష్టికరమైన ఆ దేహం శాంతమై, పావనమై, ఊహకు అందని వైభవంతో ప్రకాశిస్తోంది. విఘ్నాలనే తిమిరాలను నాశనం చేసి వెలుగును ఇచ్చే ఆ తేజం... నర శరీరంతో, గజముఖంతో దీపిస్తోంది. ఆ తేజానికి నమస్కరిస్తున్నాను’’ అని భావం. అనిర్వచనీయమైన పరబ్రహ్మమే గణపతి. ‘సిద్ధి’, ‘బుద్ధి’ అనేవి గణపతికి ఉన్న శక్తులు. వాటికి సంకేతంగా ‘సిద్ధి, బుద్ధి సహిత గణాధిపతి’గా ఆయనను పూజిస్తారు. సిద్ధి, బుద్ధులను గణపతి పత్నులుగా వర్ణిస్తారు.
యుగయుగాల వేలుపు...
భాద్రపద శుద్ధ చవితి నాడు... పార్వతీ పరమేశ్వరుల తనయునిగా గణేశుడు అవతరించాడన్నది విశ్వాసం. కానీ కృతయుగంలో వినాయకుడు, త్రేతాయుగంలో మయూరేశ్వరుడు, ద్వాపరయుగంలో గజాననుడు, కలియుగంలో ధూమకేతువు అనే పేర్లతో ఆయన ఆవిర్భవించి... ఎందరో అసురులను సంహరించి ధర్మసంస్థాపన చేశాడనీ ‘గణేశ పురాణం’ పేర్కొంటోంది.
యే ప్రకృత్యాదయో జడా జీవశ్చ గణ్యంతే సంఖ్యాయన్తే
తేషా మీశః స్వామీ పాలకో గణేశః
ప్రకృతిలోని చరాచరాత్మక సృష్టిని ఉన్నది ఉన్నట్టు లెక్కిస్తే... దాన్నంతటినీ ఎవరు పరిపాలిస్తున్నారో ఆ పరమేశ్వరుడినే గణపతి లేదా గణేశుడు (గణ+ఈశః) అన్నారు. ఏ రూపమూ లేని ఆ పరబ్రహ్మ తన భక్తుల కోసం అనేక విధాల రూపధారణ చేశాడు. అవి అనంతమైనవి. కొందరు ముప్ఫై రెండు, మరి కొందరు పదహారు, ఇంకొందరు పన్నెండు... ఇలా ఎన్నో విధాలుగా చెప్పారు. ఇంకెందరో మరెన్నో రూపాలనూ, నామాలనూ చెప్పారు. అవన్నీ గణపతి విశ్వరూపంలోని అంశలే.
వేద మంత్రాలకు అధిపతి
గణపతి తత్త్వాన్ని వేదాలు విస్తృతంగా వివరించాయి. ముఖ్యంగా ఋగ్వేదంలో పొందుపరిచి ఉన్న మూలమంత్ర భాగం ఒక్కటి చాలు... ఆ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి.
- ఓం! గణానాంత్వా గణపతిగుం
- హవామహే
- కవిం కవీనా ముపమశ్రవస్తమమ్
- జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
- ఆనశ్శృణ్వన్నూతిభిస్సీదసాదనమ్
గణపతిని ‘బ్రహ్మణస్పతి’గా ఋగ్వేదం సంబోధించింది. ‘బ్రహ్మణాలు’ అంటే వేదమంత్రాలు. పరిపూర్ణమైన కర్మలను వివరించే వేదమంత్రాలన్నిటికీ మంత్రపతిగా, కర్మాధ్యక్షుడిగా ఉండేవాడు కాబట్టి ఆయన బ్రహ్మణస్పతి. వేదంలో గణపతిని పరబ్రహ్మగా సూచిస్తూ చెప్పిన పదం ఇది. ‘కవి’ అంటే వేదమంత్రం. సత్యదర్శనం చేసిన వేద మంత్రాలకు ఆయన అధిపతి. కవులకు కవి గణపతి. అలాగే ‘ఉపమస్రవస్తమం’ అంటే ‘మిక్కిలి కీర్తి కలిగినవాడు’ అని అర్థం. సమస్త శ్రేయస్సులకూ ఆయనే మూలం, లక్ష్యం. ఈ మంత్ర శబ్దానికి ఎందరో, ఎన్నో విధాలుగా భాష్యం చెప్పారు. అన్న సమృద్ధి కలవాడనేది ఒక భాష్యం. ‘అన్నం’ అంటే అనుభవయోగ్యమైన సంపద. శరీరానికి పుష్టిని ఇచ్చేది అన్నం. కంటికి దృశ్యం, చెవికి శబ్దం, నాలుకకు రుచి... ఇలా అన్ని ఇంద్రియాలకూ వాటిని అందించే శక్తులే అన్నములు. ఈ ఐశ్వర్యాలను ఇచ్చేవాడు గణపతి. ఇక ‘జ్యేష్ట రాజు’ అనే శబ్దానికి ‘ఉత్కృష్టమైన వాటిలో మహోత్కృష్టంగా’ ప్రకాశించేవాడు అని అర్థం. అందుకే గణపతి అగ్రపూజను అందుకుంటున్నాడు. ‘‘వేదవేద్యుడవైన ఓ గణపతీ! నిన్ను ఆహ్వానిస్తున్నాను. మా స్తుతులను విని, పాలన హేతువులైన శక్తులతో యజ్ఞమందిరానికి వచ్చి ఆసీనుడవుకా!’ అంటూ గణపతి తత్త్వాన్ని ఈ వేదమంత్రం ఆమూలాగ్రంగా వివరించింది. ప్రత్యేకించి ఈ మంత్రంలోని ‘గణములు’ (సమూహాలు) రూప ప్రపంచాన్నీ, కవి, ‘బ్రహ్మణములు’ శబ్ద ప్రపంచాన్నీ సూచిస్తాయి. రూప ప్రపంచానికీ, శబ్ద ప్రపంచానికీ అధిపతి అయిన గణపతి మాహత్మ్యాన్నీ, రక్షణ సామర్థ్యాన్నీ ఈ మంత్రం స్పష్టం చేసింది. వేదవేద్యమై, ఆదిమూలమైన పరతత్త్వం గణపతిగా వేదాలలో, ఉపనిషత్తులలో, మంత్ర, తంత్ర శాస్త్రాలలో, పురాణాలలో విభిన్న ఉపాసనమూర్తులుగా సాక్షాత్కరిస్తోంది. గణపతి రూపాలనూ, నామాలనూ వివరించడం అలవికాని పని.
యోగశాస్త్రంలో మూలాధార క్షేత్ర స్థితుడిగా గణపతిని పేర్కొన్నారు. పరమాత్మ గణపతి. లక్షణకారిణి అయిన శక్తి లక్ష్మి. పరమాత్మ, లక్షణశక్తి అవిభాజ్యం కాబట్టి శక్తిసహితుడైన గణపతి... లక్ష్మీ గణపతి.
‘గ’ అనే వర్ణం సర్వశ్రేష్టత్వాన్ని తెలియజేస్తుంది. గణపతికి ప్రీతికరమైన ఈ బీజాక్షరం పరమ శక్తిమంతమైనదిగా వాసికెక్కింది.
కరుణా సముద్రుడు, సకలాభీష్టప్రదుడు, సచ్చిదానంద స్వరూపుడైన గణపతి భక్తులు సమర్పించే గరిక పూజలకు సంతోషిస్తాడు. కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు పెడితే ఆనందిస్తాడు. వయోబేధం లేకుండా భారతీయులందరూ భక్తి శ్రద్ధలతో పూజించుకొనే గణపతిది సమ్మోహన రూపం. ఆ రూపంలో ఉండే వైశిష్ట్యాన్ని మన ప్రాచీన గ్రంథాలు ఎంతగానో ప్రస్తుతించాయి. వేదవేద్యుడైన ఆ గణపతి కటాక్షవీక్షణాలు అందరిపైనా ప్రసరించాలని ప్రార్థించాలి.
ఓం గం గణపతయే నమః
- ఎ. సీతారామారావు
8978799864