పెళ్లికి కాదు...చదువుకు పథకాలు పెట్టండి!

ABN , First Publish Date - 2021-07-22T05:30:00+05:30 IST

అమ్మాయిల చదువు కోసం మేమంతా కలిసి ఇన్నాళ్ళూ చేసిందంతా ఒక ఎత్తయితే, ఇకమీదట చేయాల్సింది మరొక ఎత్తు. కరోనా ధాటికి పల్లెలు, తండాలు సైతం అల్లాడాయి.

పెళ్లికి కాదు...చదువుకు పథకాలు పెట్టండి!

ఆమె కరోనా కష్టకాలంలో వైద్య సౌకర్యంలేని రెండు వందల పల్లెలకు పెద్ద దిక్కు అయ్యారు.  తన బృందంతో కలిసి రోడ్డుమార్గం లేని తండాలకు తరలివెళ్లి, సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఆ గ్రామాలను ‘థర్డ్‌వేవ్‌’పై అప్రమత్తం చేయడంలో నిమగ్నమయ్యారు. ఆమే ‘గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు  డాక్టర్‌ విజయ రుక్మిణీరావు.సుదీర్ఘకాలంగా మహిళాభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్న ఆమె కరోనా సమయంలో తాము అందించిన సేవల గురించీ, గ్రామీణ బాలికలు, మహిళల జీవితాల్లో గమనించిన మార్పుల గురించి నవ్యతో పంచుకున్నారు. 


‘‘మ్మాయిల చదువు కోసం మేమంతా కలిసి ఇన్నాళ్ళూ చేసిందంతా ఒక ఎత్తయితే, ఇకమీదట చేయాల్సింది మరొక ఎత్తు. కరోనా ధాటికి పల్లెలు, తండాలు సైతం అల్లాడాయి. నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలోని ఆరు మండలాల్లో ‘గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌’ సంస్థ తరపున ఇరవై రెండేళ్లుగా బాలికలు, మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నాం. ఈ విపత్కాలంలో 205 గ్రామాల్లో సహాయ చర్యలు చేపట్టాం. అక్కడ వైద్య సదుపాయాల సంగతి దేవుడెరుగు... రోడ్డు, రవాణా సౌకర్యానికి నోచుకోని పల్లెలు అవి. ఆ ప్రాంతాల్లో... సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ బారినపడిన 583మందికి  ఉచితంగా మందులతో పాటు నిత్యావసర సరుకులను అందించాం. అవసరం మేరకు కొందరికి ఆక్సీమీటర్లు, నెబులైజర్లు పంపిణీ చేశాం. ‘శక్తిషిఫా హెల్త్‌ ఫౌండేషన్‌’కు చెందిన డాక్టర్‌ రెహనాతో పాటు యూకేలో ఉంటున్న నా మిత్రులైన నలుగురు వైద్యులతో కలిసి కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేశాం. కొన్ని వందలమందికి ఉచితంగా ఆన్‌లైన్‌లో చికిత్స అందించాం. కరోనా కాలంలో వైద్య సౌకర్యానికి నోచుకోని చాలా గ్రామాలకు, తండాలకు, అలాగే కొన్ని వందలమంది వలస కార్మికులకు ‘గ్రామ్య హెల్ప్‌లైన్‌’ అండగా నిలిచింది, సహాయ, సహకారాలు అందించింది.


వాలంటీర్లే సైనికులై...

ఈ కష్ట సమయంలో మా వాలంటీర్లు పదిమంది సరిహద్దుల్లో సైనికుల్లా మారారు. రాత్రీ పగలూ తేడా లేకుండా... ఎక్కడ సమస్య ఉందని తెలిసే అక్కడ వాలిపోయేవాళ్లు. ఒకరోజు అచ్చమ్మకుంట తండాలోని ఒకామెకు శ్వాస సరిగ్గా అందడంలేదని మా హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ వచ్చింది. ఆమెకు అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించాలని వైద్యుడు సూచించారు. అంతే! మా వాలంటీరు రాము రోడ్డు మార్గం కూడా లేని ఆ తండాకు... మోటార్‌ బైక్‌ మీద ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను తీసుకువెళ్ళాడు.. పీపీఇ కిట్‌ ధరించి, వీడియోకాల్‌ ద్వారా... డాక్టరు రెహనా పర్యవేక్షణలో ఆ కొవిడ్‌ రోగికి ఆక్సిజన్‌ అందించి, ప్రాణాలు నిలిపాడు. అలా మా వాలంటీర్లు సరైన సమయంలో పలువురికి సహాయం చేయడం వల్ల చాలా జీవితాలు నిలబడ్డాయని గర్వంగా చెప్పగలను.


మరో ఆరుగురిని అత్యవసర పరిస్థితిలో దేవరకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించాం. తర్వాత వారంతా కోలుకున్నారు. కొన్ని ఊళ్లలో... కొవిడ్‌ సోకిన వారిని ఇరుగుపొరుగు కుటుంబాలు వెలివేసినట్లు చూడడం గమనించాం. కరోనా మీద అపోహలే దీనికి కారణం. కనుక వాళ్లలోని భయాలు తొలగించేందుకు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాం. స్థానిక యువకులతో కలిసి ప్రతి గ్రామంలో కరోనా జాగ్రత్తలపై ప్రచారం చేశాం. దీంతో జనంలో అవగాహన పెరిగింది. వివక్ష చాలావరకు తగ్గింది. ఒక ఇంట్లో పెద్దలు ఎవరికైనా కొవిడ్‌ వస్తే, పక్కింటి వాళ్లు ఆ కుటుంబంలోని పిల్లల బాధ్యతను తీసుకోవడం లాంటి పరస్పర సహాయసహకారాలు అందించుకోవడం మేము చూసిన పెద్ద మార్పు. 


మహిళలపై దాడుల నివారణ కోసం...

తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహకారంతో నల్గొండలో మూడేళ్లుగా ‘సఖీ సహాయ కేంద్రం’ నడుపుతున్నాం. బాధితులైన ఆడపిల్లలకు, మహిళలకు ఈ కేంద్రం అన్ని విధాలా బాసటగా నిలుస్తోంది.. ఇప్పటివరకు 1,500 కేసులు మా దగ్గర నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ కాలంలో మహిళలపై హింస పెరిగిన మాట వాస్తవమే! కానీ కేసులు మాత్రం పెద్దగా నమోదు కాలేదు. అందుకు కారణం కూడా లాక్‌డౌనే అనుకుంటున్నా. ఉపాధి కోసం వలస వెళ్ళిన చాలామంది సొంత ఊర్లకు తిరిగి వచ్చారు. పల్లెల్లో పనులు లేవు. దాంతో రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇదే సమయంలో... పనుల్లేక ఖాళీగా ఉన్న మగవాళ్లు చాలామంది తాగుడు, జూదం వంటి వ్యసనాల్లో కూరుకుపోయి జేబులు ఖాళీ చేసుకున్నారు.


అలాంటి వాళ్లు  ఇంట్లో బియ్యం నిండుకున్నాయనో, కూరగాయలు తెమ్మనో అడిగిన భార్యమీద చేయిచేసుకోవడం. లేదంటే, కట్నం తీసుకురమ్మని వేధించడం... ఇలాంటి కేసులు కొన్ని మా దృష్టికి వచ్చాయి. మేము పనిచేస్తున్న గ్రామాల్లో ప్రతి ఇంటికీ ప్రధాన విలన్‌ మద్యమే! చాలా కుటుంబాల్లో పురుషులు పీకలదాకా తాగి వచ్చి... భార్యను ఇష్టం వచ్చినట్టు కొట్టడం సర్వసాధారణం. పనులు లేని కాలంలో అవి ఇంకా పెరిగాయి. మద్యాన్ని నియంత్రించకుండా ఈ హింసను నిలువరించడం అసాధ్యం. ఈ సంగతి మహిళా సంఘాల తరపున మేమంతా ఎప్పటి నుంచో చెబుతున్నాం. అయినా, వినేదెవరు? కనీసం ప్రతి జిల్లాకు ఒక డీ-అడిక్షన్‌ కేంద్రాన్నయినా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే నిరుపేద, ఒంటరి మహిళలకు ఏడాది పొడుగునా ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని కోరుతున్నాం.


ఎంతోమంది చదువుకు దూరం....

అమ్మాయిల అభ్యున్నతికి కరోనా అడుగడుగునా అవరోధాలను సృష్టించింది.. రెండేళ్లుగా బడులు లేవు. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే స్థోమత అందరికీ ఉండదు. ఒక పేద, మధ్యతరగతి ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉంటారు. కానీ స్మార్ట్‌ ఫోన్‌ ఒక్కటే ఉంటుంది. అప్పుడు ఆ ఫోన్‌ అబ్బాయికే ఇస్తారు కదా! అలా పేదింటి అమ్మాయిలు చాలామంది చదువుకు దూరమవుతున్నారు. ఇదే అదునుగా కొందరు బాల్య వివాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో పదిహేను పెళ్లిళ్లను ప్రత్యక్షంగా మేమే అడ్డుకున్నాం. ‘ఆడపిల్లకు చదువుకన్నా పెళ్లి ముఖ్యం’ అని కుటుంబమే కాదు, ప్రభుత్వాలూ విశ్వసిస్తున్నాయి. కనుకే ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్‌’ లాంటి పథకాల ద్వారా అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అదే ఒక అమ్మాయి చదువుకోవడానికి మాత్రం అవకాశాలు కల్పించరు. దేశంలోనే తొలి మహిళా పాలిటెక్నిక్‌ అయిన నాంపల్లిలోని ‘కమలానెహ్రూ కళాశాల’ను నిధుల కొరతతో మూసేస్తున్నారు. ఈ ‘పెళ్లి పథకాల’డబ్బును కాలేజీల నిర్వహణకు ఖర్చుపెడితే, అమ్మాయిలు బాగా చదువుకొని, సమాజాభివృద్ధిలో భాగస్వాములవుతారు. 


పథకాలు కావలసింది ఆడపిల్ల చదువుకి కదా! 

కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల  బాలికలు నిర్లక్ష్యానికి, నిరాదరణకూ లోనవుతున్నారు. అమ్మాయిలు ఏదన్నా కావాలని అడిగితే పెద్దవాళ్లు కసురుకుంటారు. అదే సమయంలో ఎవరైనా అబ్బాయి పరిచయమై, కాస్తంత ప్రేమగా మాట్లాడితే వాళ్లను నమ్మేస్తున్నారు. ఆ వ్యక్తితో జీవితం పంచుకోవాలనే ఆశతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతున్నారు. అలాంటి కేసులు ఈ మధ్య బాగా పెరిగాయి. ఇప్పుడు ఆడపిల్లల్ని పనుల్లో పెట్టడమూ ఎక్కువగా చూస్తున్నాం. దానివల్ల చదువుకు దూరమయ్యేవాళ్ల సంఖ్య రానురాను మరింత పెరగవచ్చు. ఇక,. ఇంటిపట్టునే ఉంటున్న అమ్మాయిల మీద కూడా లైంగిక హింస తక్కువేమీ కాదు. కన్నతండ్రే కూతుళ్ల మీద అకృత్యానికి పాల్పడిన కేసులు మూడు మా వద్దకు వచ్చాయి. అంత దయనీయంగా మారింది అమ్మాయిల పరిస్థితి. మాలాంటి వాళ్ళు మరింత బలంగా పనిచేయాల్సిన సమయం ఇది.’’


కె. వెంకటేష్‌,  ఫొటోలు: లవకుమార్‌


వారే కొండంత బలం!

‘‘కరోనా థర్డ్‌ వేవ్‌పై పల్లెలను, తండాలను అప్రమత్తం చేస్తున్నాం. ఆ క్రమంలో  ‘రైతు స్వరాజ్య వేదిక’తో కలిసి క్షేత్రస్థాయి కార్యాచరణ రూపొందించాం. గ్రామ సర్పంచ్‌లు, స్థానిక అంగన్వాడీ, ‘ఆశా’ వర్కర్లు, ఎఎన్‌ఎంలతో కలిసి మా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతున్నారు. కరోనా నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. టీకా ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. దేవరకొండలో ఇరవై ఏళ్ల కిందట ఉచిత పాఠశాల నెలకొల్పాం. మేము చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ఆ స్కూలు పూర్వవిద్యార్థులు తోడ్పాటు అందిస్తున్నారు. వారే మాకు కొండంత బలం.’’

Updated Date - 2021-07-22T05:30:00+05:30 IST