అందరు పేరెంట్స్‌లాగే నేనూ: సన్నీలియోన్

ABN , First Publish Date - 2021-07-04T19:28:05+05:30 IST

సన్నీలియోన్‌ పోర్న్‌స్టారే కావొచ్చు. ఆమె ఆత్మాభిమానానికి కించిత్తు భంగం కలిగినా తట్టుకోలేదు. ఇతరులకు గౌరవ మర్యాదలు ఇస్తుంది. మనుషుల్ని ప్రేమిస్తుంది.

అందరు పేరెంట్స్‌లాగే నేనూ: సన్నీలియోన్

సన్నీలియోన్‌ పోర్న్‌స్టారే కావొచ్చు. ఆమె ఆత్మాభిమానానికి కించిత్తు భంగం కలిగినా తట్టుకోలేదు. ఇతరులకు గౌరవ మర్యాదలు ఇస్తుంది. మనుషుల్ని ప్రేమిస్తుంది. బంధాలను కాపాడుకుంటుంది. ఇప్పుడు తనకున్న ముగ్గురు పిల్లలను కూడా అలాగే పెంచాలనుకుంటోంది. గతం తాలూకు ప్రభావం వారిమీద పడకుండా... మంచి పౌరులుగా పెంచితే చాలు అంటున్న సన్నీ చెబుతున్న పేరెంటింగ్‌ అనుభవాలే ఇవి..  


పిల్లల విషయంలో అందరు తల్లిదండ్రుల్లాగే మాకూ భయం పట్టుకుంది. ఇంట్లో పిల్లలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏం ముట్టుకున్నారు? నిరంతరం ఇదే ఆందోళన. నేనైతే  బయటికి  వెళ్లినప్పుడు పిల్లలు మాస్కులు సరిగా పెట్టుకున్నారా లేదా? క్షణక్షణం పరిశీలిస్తుంటాను. నాకు తెలియకుండానే నాలో ఆందోళన మొదలవుతుంది. నా ఫ్రెండ్స్‌ కూడా తమ పిల్లల పట్ల ఇదే భయంతో మెలుగుతున్నారు.


నా భర్త డేనియల్‌ పిల్లలంటే ప్రాణం పెడతాడు. ఇంట్లోకి వాళ్లొచ్చాకే తెలిసింది... అతను అంత సున్నిత మనస్కుడని. అంటే - పిల్లలు కూడా ఇతరుల ప్రేమానురాగాలను అద్దంలో చూపినట్లు చూపుతారన్నమాట. తక్కువ సమయంలోనే మా ఇంట్లోకి ముగ్గురు పిల్లలు రావడం మా అదృష్టం. అప్పట్లో (2017) ఆడపిల్ల నిషాను దత్తత తీసుకున్నాం. దాంతో మా లోకమే మారిపోయింది. ఆ తరువాత సరోగసీ (గర్భదానం) పద్ధతిలో ఇద్దరు మగ పిల్లలు (నోహ, యాషెర్‌) తోడయ్యారు.  వాళ్లు ఇంటికి వచ్చిన రోజు నిషా ఆనందం చెప్పలేనంత! అంత సంబరపడుతుందని ఊహించలేదు. ఇప్పుడు దేవుడు మాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మేము పిల్లల కోసం కలలు కనేవాళ్లం. ఆ కల నిజమైందిప్పుడు. నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా పిల్లలే కదా!.


ఒకప్పుడు నేను పోర్న్‌స్టార్‌ను. అది నా వృత్తి. నేను ఎక్కడా ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోను. గతం గురించి ఎప్పుడూ ఆలోచించను. పిల్లల పెంపకంపైన ఆ ప్రభావాన్ని పడనీయను. సమాజంలో మంచి మనుషులుగా తీర్చిదిద్దాలన్నదే నా కోరిక. పెద్దయ్యాక వాళ్లు డాక్టర్లు అవుతారా? ఇంజినీర్లా? లాయర్లా? వ్యోమగాములా? లేదంటే ఏకంగా అమెరికా ప్రెసిడెంట్‌ అవుతారా? అది వాళ్లిష్టం. ఆ అవకాశం వారికే వదిలేస్తాం. స్వేచ్ఛగా, హాయిగా, మనుషులుగా పెంచిపెద్ద చేయడమే మా బాధ్యత. నా కోరికలకు వాళ్లు కొనసాగింపు కానేకాదు.


కరోనా వచ్చినప్పటి నుంచీ పిల్లలను అతి జాగ్రత్తగా పెంచాల్సి వస్తోంది. నాకిప్పటికీ ఆ భయం పోలేదు. మొన్నామధ్య నాతోపాటు పిల్లలను షూటింగ్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే వాళ్లను సహాయకుల పర్యవేక్షణలో వ్యానిటీ వ్యాన్‌లోనే ఉంచాను. షూటింగ్‌స్పాట్‌కు మాత్రం పిల్లలను తీసుకెళ్లలేదు. విరామం దొరికినప్పుడల్లా వచ్చి పిల్లలతో ఆడుకుంటుంటాను. ఎంత బడలికగా ఉన్నా... ఆ పిల్లల ముఖాల్లో చిరునవ్వు చూస్తూనే ఎక్కడలేని హుషారు వస్తుంది. పిల్లల కోసం ఏం చేయాలో... ప్రతి రోజూ ఉదయాన్నే ఒక లిస్టు రాసుకుంటాను. ఒక్కొక్కటే చేస్తూ వస్తాను. ఏదీ పెండింగ్‌లో పెట్టను. ఈసారి పిల్లలు నాతోనే ఎక్కువగా ఉన్నారు. కరోనా సమయంలో కూడా ప్రయాణాలు పెరిగిపోయాయి ఎందుకో!. ఎక్కడికెళ్లినా సురక్షిత ప్రదేశంలోనే ఉంచుతున్నా.


 అందరికంటే నేను భిన్నమైన వ్యక్తిని కాదు. ఒక సాధారణ ఇంట్లో పిల్లల తల్లికి ఎన్ని కష్టాలు ఉంటాయో అన్నీ ఉన్నాయి నాకు. పెద్దమ్మాయిని దగ్గరుండి చదివిస్తాను, ఆహారం తినిపిస్తాను. హడావుడిగానే ఉంటుంది జీవితం. ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగని ఇంటికే పరిమితం అయితే రోజులు గడవవు కదా! తప్పదు. కష్టపడాల్సిందే. పిల్లల భవిష్యత్తు కోసం అందరు తల్లిదండ్రులు కష్టపడినట్లే మేమూ కష్టపడుతున్నాం. పిల్లల కోసం మా కంటే ఎన్నో త్యాగాలు చేసే కుటుంబాలు చాలానే ఉన్నాయి.

Updated Date - 2021-07-04T19:28:05+05:30 IST