పాత ప్లాటినాపై... పదివేల కిలోమీటర్లు!

ABN , First Publish Date - 2021-08-18T05:30:00+05:30 IST

పాత ప్లాటినా బండి.. దాని మీద వంట సామాన్లు, మాస్కులు, కొన్ని డ్రెస్‌లతో ఒక పెద్ద బ్యాగ్‌. వీటితో ఓ మామూలు మధ్యతరగతి అబ్బాయి భారత్‌ను చుట్టేశాడు. 28 రోజుల్లో 10 వేల కిలో మీటర్లు

పాత ప్లాటినాపై...  పదివేల కిలోమీటర్లు!

పాత ప్లాటినా బండి.. దాని మీద వంట సామాన్లు, మాస్కులు, కొన్ని డ్రెస్‌లతో ఒక పెద్ద బ్యాగ్‌. వీటితో ఓ మామూలు మధ్యతరగతి అబ్బాయి భారత్‌ను చుట్టేశాడు. 28 రోజుల్లో 10 వేల కిలో మీటర్లు ప్రయాణించాడు. దేశంలోని దేవాలయాలన్నింటినీ చూడాలనే సంకల్పం... భారీ వర్షాల్లోనూ అతడిని ముందుకు నడిపించింది. యాభైకి పైగా ప్రధాన ఆలయాలు... మరికొన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగొచ్చిన విజయవాడ కుర్రాడు మోగిలియార్‌ బాలకృష్ణ జర్నీ ఇది... 


విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన మోగిలియార్‌ బాలకృష్ణ యూట్యూబ్‌ను ఫాలో అవుతూ ఉంటాడు. విలువైన పెద ్దపెద్ద బైకుల మీద ఖర్చుకు వెనకాడకుండా తిరుగుతున్న ఎంతోమంది రైడర్లను, వారి సాహసాలను చూసి ఆశ్చర్యపోయేవాడు. ఎప్పటికైనా తాను కూడా రైడర్‌ కావాలని కలలు కన్నాడు. కానీ అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అంత ఆర్థిక స్తోమత తనకు లేదని తెలుసు. అందుకే అతడు హైఎండ్‌ బైక్‌ల జోలికి పోలేదు. మధ్యలో విరామాలకు విలాసాలు జోడించలేదు. చేతిలో ఉన్న పాత ప్లాటినా బండిపైనే వెళదామని నిర్ణయించుకున్నాడు. ఓ పెద్ద సంచీలో కుక్కర్‌, బియ్యం, నాలుగు రకాల పచ్చళ్లు, దుస్తులు, మాస్క్‌లు, శానిటైజర్లు పెట్టుకున్నాడు. ఇంట్లో వాళ్లు వద్దన్నారు. ‘అది రిస్క్‌తో కూడుకున్నది. ప్రయాణం విరమించుకో’మని నచ్చజెప్పారు. అయినా అతడు వినలేదు. 


మొదటి మజిలీ శ్రీశైలం...  

సాధారణ బైక్‌పై వేల కిలోమీటర్ల ప్రయాణం అంటే సామాన్యం కాదు. అదో పెద్ద సాహసమనే చెప్పాలి. అయితే ఏ మాత్రం వెనకడుగు వేయలేదు బాలకృష్ణ. ముందుగా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్నాడు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా విజయవాడ నుంచి ప్రయాణం ప్రారంభించాడు. మొదట శ్రీశైల క్షేత్రం చేరుకున్నాడు. జూలై 3న మల్లన్నను దర్శించుకున్నాడు. ఇక అక్కడి నుంచి వేగం పెంచాడు. ఒక పక్క భారీ వర్షాలు... చిత్తడి రోడ్లు... ఇవేవీ లెక్క చేయలేదు అతడు. ఏపీ నుంచి కర్ణాటక, అక్కడి నుంచి గోవా, మహారాష్ట్ర, రాజస్తాన్‌, పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ, కశ్మీర్‌, లద్దాఖ్‌... ఇలా సాగింది అతడి ప్రయాణం. ఆయా ప్రాంతాల్లోని యాభైకి పైగా ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించాడు. వీటిల్లో ఐదు శక్తి పీఠాలు, నాలుగు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలనూ సందర్శించాడు. 


ఆటుపోట్లు ఎన్నో... 

‘‘ఈ పర్యటనలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు రైడింగ్‌ చాలా కష్టమైపోయేది. లద్దాఖ్‌ వాటర్‌ఫాల్స్‌ వద్ద ప్రయాణం చాలా ప్రమాదకరంగా సాగింది. కొండ ప్రాంతం కావడం, రోడ్లు రాళ్లు తేలి ఉండడంతో కాస్త సంకోచించాను. అయితే ఏది ఏమైనా ముందుకే వెళ్లాలన్న సంకల్పం నాది. శ్రీనగర్‌లో రాత్రిపూట వాతావరణం భయపెట్టింది. కట్రాలోని వైష్ణో దేవి ఆలయం దగ్గర బైక్‌ని అనుమతించలేదు. దీంతో 28 కిలోమీటర్లు నడుచుకొంటూ వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాను. మహాబలేశ్వరంలోనూ అదే పరిస్థితి. అక్కడికి చేరే సరికి భారీ వర్షాలు. రోడ్లన్నీ బురదమయం. ఆ బురదలోనే వెళ్లి కృష్ణా నది జన్మస్థలాన్ని సందర్శించాను. దాంతో బైక్‌ను వెంటనే సర్వీసింగ్‌ చేయించాల్సి వచ్చింది’’ అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. 


ఖర్చు... రూ.60 వేలు... 

అక్కడి నుంచి అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం, ఢిల్లీలో ఇండియా గేట్‌, ఎర్రకోట చూశాడు బాలకృష్ణ. గోవా, జమ్ముల్లో కరోనా పరీక్షలు చేస్తే గానీ అనుమతించలేదు. దాని కోసం చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. ‘‘విశేషమేమంటే... ప్రపంచంలో కెల్లా ఎత్తయిన మోటరబుల్‌ పాత్‌ కార్‌దుంగ్లాకు కూడా బైక్‌పైనే వెళ్లాను. ఈ యాత్ర కోసం నేను ఖర్చు చేసింది రూ.60 వేలు. ఇందులో ఒక్క పెట్రోల్‌కే రూ.25 వేలు వెచ్చించాల్సి వచ్చింది.  తిరుగు ప్రయాణం కూడా బైక్‌పైనే సాగించాల్సి ఉంది. కానీ ఎడతెగని భారీ వర్షాలతో వాతావరణం ఏమాత్రం సహకరించరించలేదు. దీంతో రైలులో విజయవాడ చేరుకున్నాడు. 


మిడిల్‌క్లాస్‌ రైడర్లం...  

బాలకృష్ణ డిగ్రీ చదువుకున్నాడు. తల్లితండ్రులు టిఫిన్‌ బండి నడిపిస్తారు. వారికి అదే జీవనోపాధి. మొదటి నుంచి బాలకృష్ణకు దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ చుట్టి రావాలనే కోరిక. ఆ కోరికే అతడికి ప్రేరణనిచ్చింది. ‘‘నాకు హిందీ రాదు. అంతంత దూరాలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో, లగేజీలో ఏమేం ఉండాలో కూడా తెలియదు. చేతిలో డబ్బు కూడా కొంచమే ఉంది. పొదుపుగా వాడుకొంటేనే జర్నీ పూర్తి చేయగలను. ఈ యాత్ర నేను చేయగలనా అని బయలుదేరే ముందు నాలో చిన్న సందేహం. అయితే దేవుడిపై భారం వేసి యాత్రకు శ్రీకారం చుట్టాను. భాష రాక కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డాను. దారిలో ప్రజలు, పోలీసులు సహాయ సహకారాలు అందించారు. ప్రొఫెషనల్‌ రైడర్లు అభినందించారు’’ అంటూ సంతోషం వ్యక్తి చేశాడు అతడు. 





మేం మిడిల్‌ క్లాస్‌ రైడర్లం... 

చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి ఎక్కువ. దైవబలంతోనే ఈ సాహసానికి శ్రీకారం చుట్టాను. హిందీ రాదు, పెద్ద బైక్‌ కూడా కాదు, చేతిలో డబ్బు కూడా కొంచెమే ఉంది. మొదట ఈ యాత్ర నేను చేయగలనా అనే సందేహం కలిగింది. కానీ, దేవుడి మీద భారం వేసి ముందుకు కదిలాను. 10వేల కిలోమీటర్లు తిరిగి వచ్చానంటే నాకే నమ్మశక్యంగా లేదు. భాష రాక కొన్నిచోట్ల ఇబ్బందులు పడ్డాను. కానీ, ఎంతోమంది నాకు సహాయం చేశారు. త్వరలో ‘మిడిల్‌ క్లాస్‌ రైడర్లు’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ ఒకటి ప్రారంభిస్తాను. అది నాలాంటి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి, సాహసాలు చేసేవారి విజయ గాథలను పరిచయం చేస్తాను. దానివల్ల మరింత మంది స్ఫూర్తి పొందుతారు. 

వేలాల నవదుర్గారావు


Updated Date - 2021-08-18T05:30:00+05:30 IST