కరోనాపై పోరులో... మేము సైతం
ABN , First Publish Date - 2021-05-27T05:30:00+05:30 IST
సమాజంలో వివక్ష, అవహేళనలు ట్రాన్స్‌ఉమెన్‌కు కొత్తేమీ కాదు. కానీ అదే సమాజానికి సేవ చేయడం తమ బాధ్యతగా భావించారు ముగ్గురు ట్రాన్స్‌మహిళలు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న ఆ ముగ్గురిలో ఇద్దరు డాక్టర్లు...
సమాజంలో వివక్ష, అవహేళనలు ట్రాన్స్‌ఉమెన్‌కు కొత్తేమీ కాదు. కానీ అదే సమాజానికి సేవ చేయడం తమ బాధ్యతగా భావించారు ముగ్గురు ట్రాన్స్‌మహిళలు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న ఆ ముగ్గురిలో ఇద్దరు డాక్టర్లు... ప్రాచీ రాథోడ్, రూత్ జాన్‌పాల్ కాగా, మరొకరు సిస్టర్ తేజస్విని. జీవితంలో కొత్త అడుగులతో ముందుకు సాగుతూ... పాత ముద్రలు చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి అంతరంగం ఇది...
ఇదంతా సమాజం మీద ప్రేమతోనే...
కొవిడ్ రోగులకు సేవలు చేయడం, వారి ముక్కు, నోరు నుంచి వచ్చే ద్రవాలను శుభ్రం చేయడం నర్సుగా నర్సుగా నా విధి. ‘‘అమ్మో! కొవిడ్ పేషెంట్’’ అనుకోను. కానీ ఈ సమాజం మమ్మల్ని సాటి మనుషులుగా చూడడం లేదు. ట్రాన్స్‌జెండర్లు అనగానే ఒకలాంటి అభిప్రాయం కలిగి ఉండడం సబబేనా? కొందరు ట్రాన్స్ మహిళలు భుక్తికి దారిలేక సెక్స్ వర్కర్లుగా ఉండొచ్చు. కానీ అందరినీ అదే గాటకు కట్టేస్తారా? నేనొక ట్రాన్స్ మహిళను. నన్ను ఈ సమాజం తనలో ఇముడ్చుకోవడానికి సిద్ధంగా లేదు. కానీ ఈ ఆపత్సమయంలో నన్ను మనిషిగా గుర్తించని ఈ సమాజం కోసం ఒక సైనికురాలుగా మారాను. కొవిడ్ రోగులకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాను.
చావు అంచులదాకా వెళ్ళాను!
డా. ప్రాచీ రాథోడ్, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టు
నేను హైదరాబాద్‌లోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పని చేస్తున్నా. నా స్పెషలైజేషన్ ఎమర్జెన్సీ మెడిసిన్. ఏడాదిన్నరగా నా డ్యూటీ కొవిడ్ వార్డులోనే. ఒక్కోసారి పన్నెండు గంటల సేపు పిపిఇ కిట్ ధరించి పని చెయ్యాల్సి ఉంటుంది. రోగుల తాకిడి అంత ఎక్కువగా ఉంటోంది. రోగులు నన్ను వైద్యురాలిగానే చూస్తారు తప్ప నేను మగా, ఆడా, ట్రాన్స్‌ఉమనా అనేది అంతగా పట్టించుకోరు. ఈ కొవిడ్ కాలంలో ఎన్నో ప్రాణాలను నిలబెట్టగలిగాను. చెయ్యి దాటిపోయిన కేసులు కూడా ఉన్నాయి. ఒక పాతికేళ్ళ కుర్రాడు కొవిడ్‌తో మా ఆసుపత్రిలో చేరాడు. అతన్ని కాపాడడానికి ఆరు రోజుల పాటు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ బాధ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాను. రెండు నెలల క్రితం నాకు కొవిడ్ వచ్చింది. అంతకుముందే నిమోనియా ఉండడంతో బాగా ఇబ్బంది పడ్డాను. ఒక మాటలో చెప్పాలంటే చావు అంచుల వరకూ వెళ్ళి వచ్చాను. కోలుకున్న 15 రోజుల తరువాత మళ్ళీ డ్యూటీలో చేరాను. రోగులు కోలుకొని ఆనందంగా ఇంటికి వెళుతూ ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. కొందరు రోగులు డిశ్చార్జి అయ్యాక నాకు తరచూ ఫోన్లు చేస్తూ ఉంటారు. వారి ఇళ్ళలో జరిగే వేడుకలకు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు.
మాది ఎగువ మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి నేను చదువులో ఫస్ట్. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. గాంధీ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాను. కానీ ఎంబిబిఎస్ ఫస్టియర్‌లోనన్ను ఒక ప్రొఫెసర్ లొంగదీసుకోడానికి ప్రయత్నించాడు. నేను ప్రతిఘటించడంతో తన ప్రాక్టికల్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ చేశాడు. నేను యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేస్తే... నా కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించారు. నేను మంచి మార్కులతో పాసవడంతో తప్పు ఎవరిదనేది తెలిసింది. ఆ తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్‌లో డిప్లమా చేశాను. ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ ప్రారంభించాను. అంతకు కొద్ది రోజుల ముందే నా ఐడెంటిటీతో బతకాలని నిర్ణయించుకున్నాను. నేను ట్రాన్స్ మహిళగా మారాక సమాజం నుంచి అవమానాలు, అవహేళనలు ఎదురైన సంఘటనలు చాలా తక్కువ. ఆసుపత్రి సిబ్బంది, తోటి వైద్యులు నన్ను డాక్టర్‌గానే చూస్తారు. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశాను. ఒక బోటిక్ కూడా పెట్టాను. దాన్ని మా అన్నయ్య చూస్తున్నాడు.
ప్రస్తుతం నా దృష్టంతా కొవిడ్ రోగులకు సేవలు అందించడం మీదే. ఇలాంటి విపత్కాలంలో వైద్యురాలిగా సేవ చేసే అవకాశం దొరికినందుకు గర్వపడుతున్నాను. డెర్మటాలజీ, కాస్మొటాలజీ కోర్సులు చేయాలన్నది నా కోరిక. దాని కోసం పీజీ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నా.
సొంతంగా ప్రాక్టీస్ పెట్టి... ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి వైద్య సేవలు ఉచితంగా అందించాలన్నదే నా జీవిత లక్ష్యం. అలాగని కేవలం ట్రాన్స్ కమ్యూనిటీ వైద్యురాలుగానే మిగిలిపోవాలనుకోవడం లేదు. అన్ని వర్గాలకూ సేవలు అందించి, వారి నుంచి గౌరవం పొందాలనుకుంటున్నా.
ఇదంతా ఈ సమాజం పట్ల నాకున్న ప్రేమతోనే!
తేజస్విని గారపాటి, హెడ్ నర్స్
ఆసుపత్రిలో నేను ఎప్పుడూ వివక్ష ఎదుర్కోలేదు. హెడ్‌నర్సుగా పదోన్నతి కూడా పొందాను. ఏడాది పాటు కొవిడ్ వార్డులో... కరోనా రోగులకు దగ్గరగా విధులు నిర్వర్తించాను. రోగులకు ఎన్నో సందర్భాల్లో ధైర్యం చెప్పాను. ఈ బాధ్యత నాకు భారంగా అనిపించలేదు. కానీ ఇప్పుడు వైరస్ తీవ్రత కారణంగా ఎంతోమంది కళ్ళముందే మరణిస్తున్నారు. ఏమీ చెయ్యలేకపోతున్నానని బాధ కలుగుతోంది.
మా సొంత ఊరు కృష్ణా జిల్లా మైలవరం దగ్గరలో ఉన్న కొత్తగూడెం. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మ ఆశా వర్కర్. నాన్న రైతు కూలీ. టెన్త్, ఇంటర్ సెలవుల్లో మా ఇంటి దగ్గరలోని ఒక క్లినిక్‌లో నర్సుగా పని చేశాను. రోగుల బాగోగులు చూసుకోవడంలో నాకు తెలియని ఆనందం దొరికింది. నర్సు కావాలని అప్పుడే అనుకున్నాను. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్సుతో డిప్లమా చేశాను. విజయవాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాను. అప్పుడే సర్జరీ చేయించుకొని ట్రాన్స్ మహిళగా మారాను. నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారనుకున్నా. కానీ ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నాకు అండగా నిలిచారు. మొదట్లో మా ఇంట్లో వాళ్ళు నన్ను కొంత దూరం పెట్టినా... ఇప్పుడు పెద్ద కూతురులా చూస్తున్నారు. ఆసుపత్రిలో రోగులు ఎవరూ నన్ను అవహేళన చేయలేదు. తోటి సిస్టర్స్ కూడా ఎంతో ప్రేమతో ఉంటారు.
అయితే, నేను ట్రాన్స్ మహిళగా మారక ముందు ఎన్నో అవమానాలు పడాల్సి వచ్చింది. కానీ, ఇదివరకటితో పోలిస్తే ట్రాన్స్‌మహిళలపై వేధింపులు కొంత వరకూ తగ్గాయి. ట్రాన్స్ మహిళల్లో అంకితభావంతో పని చేసే నర్సులు, వైద్య సిబ్బంది ఉన్నారు. వారికి ప్రభుత్వాసుపత్రుల్లో అవకాశం కల్పించాలి. ప్రస్తుతం వైఆర్‌జీ కేర్ ఆస్పత్రిలో నర్సింగ్ అసిస్టెంట్‌గా కరోనా రోగులకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాను.
2 వేల మందికి ఉచిత చికిత్స చేశాను
డాక్టర్ రూత్ జాన్‌పాల్, వైఆర్‌జీ కేర్ ఆస్పత్రి
మా సొంత ఊరు ఖమ్మం. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. అమ్మ, అన్నయ్య, నేను... ఇదీ మా కుటుంబం. మా అమ్మ దినసరి కూలీ. ఈ మధ్య వరకూ మా ఇంట్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. చదువులో ఎప్పుడూ నేను ఫస్ట్. నన్ను డాక్టర్ చెయ్యాలని మా అన్నయ్య డిగ్రీతోనే చదువు ఆపేశాడు. మా అమ్మ కష్టం మాటల్లో చెప్పలేను. టెన్త్‌లో మంచి మార్కులతో ఫీజు లేకుండా ఇంటర్, ఫ్రీ సీటులో ఎంబిబిఎస్ పూర్తి చేశాను.
డాక్టర్ కావాలనే కోరికతో పాటే... ఆడ పిల్లగా ఉండాలనే ఆశ నాలో పెరుగుతూ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి చెబితే వాళ్ళు కుంగిపోయారు. రెండేళ్ళ కిందట సర్జరీ చేయించుకొని రూత్ జాన్‌పాల్‌గా మారాను. ఒక వైపు హాస్టల్ ఖర్చుల కోసం చేసిన బ్యాంకు రుణాలు, మరోవైపు పీజీలో జనరల్ మెడిసిన్ చదవాలనే కల, ఇంకోవైపు కుటుంబంతో సన్నగిల్లిన సంబంధాలు... వీటిని తట్టుకోవడం కష్టమయింది. రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు దరఖాస్తు చేసుకున్నా ‘‘కొందరు పేషెంట్లు మిమ్మల్ని ఆమోదించకపోవచ్చు. సిబ్బంది చులకన చెయ్యొచ్చు. తోటి వైద్యులు మీతో పని చెయ్యడానికి ఇబ్బంది పడొచ్చు. కాబట్టి తీసుకోలేం’’ అన్నారు. ఈలోగా కరోనా కష్టకాలం రావడంతో వైద్యురాలుగా నా వంతు సాయం సమాజానికి అందించడం కోసం ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సేవలు అందించడం మొదలుపెట్టాను.
నేను వైద్యురాలినైనా చాలా సందర్భాల్లో సమాజం నా పట్ల నిర్దయగానే వ్యవహరించింది. కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో కొందరు మిత్రులు నాకు అండగా నిలిచారు. అనేక ఇబ్బందుల మధ్య కిందటి ఏడాది నీట్ పీజీ పరీక్ష రాశాను. సీటు రాలేదు. మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. నా స్నేహితురాలు అంజలి సాయంతో కొన్ని గ్రామాల్లో, తండాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాను. నన్ను డాక్టర్‌గానే కాదు, ట్రాన్స్ మహిళా డాక్టరుగానూ సమాజం గుర్తించాలి. అదే నేను కోరుకొనేది.