ఆడపిల్లల చదువు కోసం ఆటో యాత్ర
ABN , First Publish Date - 2021-05-26T09:39:59+05:30 IST
ఐదుగురు పట్టభద్రులు. మంచి మిత్రులు. హరియాణాలోని అశోకా విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నారు. చదువు విలువ తెలిసినవారు. కనుకనే లాక్‌డౌన్‌తో బడులకు దూరమైన అట్టడుగు వర్గాల ఆడపిల్లలకు విద్యనందించే ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు. అందుకు వారు
ఐదుగురు పట్టభద్రులు. మంచి మిత్రులు. హరియాణాలోని అశోకా విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నారు. చదువు విలువ తెలిసినవారు. కనుకనే లాక్‌డౌన్‌తో బడులకు దూరమైన అట్టడుగు వర్గాల ఆడపిల్లలకు విద్యనందించే ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు. అందుకు వారు ఎంచుకున్న మార్గం... బెంగళూరు నుంచి ముంబయికి ఆటోరిక్షాలో ప్రయాణం! అవును..! 1,700 కిలోమిటర్ల ఈ జర్నీ విశేషాలు ఐదుగురిలో ఒకేఒక్క అమ్మాయి ప్రీతా దత్త మాటల్లోనే...
‘‘ఆటో ఫర్ ఇంపాక్ట్’... మా మిషన్‌కు మేము పెట్టుకున్న పేరు. ‘ప్రాజెక్ట్ నాన్హి కలి’ సౌజన్యంతో బెంగళూరు నుంచి ముంబయికి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి అవగాహన కల్పించే కార్యక్రమం ఇది. తద్వారా నిధులు సేకరించి, స్థోమత లేని బడి ఈడు ఆడ పిల్లలకు సాయం చేయాలన్నదే మా సంకల్పం. నా మిత్రులు, నాతోపాటు అశోకా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివిన అన్షుల్‌రాయ్‌శర్మ, పాల్ కురియన్, వెంకటేశ్ థప్పన్, విదుర్ సింగ్ ఈ మిషన్‌లో సభ్యులు.
కరోనాతో కొత్త ఆలోచన...
మాకు ఈ ఆలోచన రావడానికి కారణం... కరోనా! ఈ మహమ్మారి వల్ల దినసరి కూలీల బతుకులు రోడ్డున పడ్డాయి. వలస కార్మికుల వెతలు అంతులేనివి. వీటన్నిటి మధ్యా అట్టడుగు వర్గాల ఆడపిల్లలు బడులు లేక చదువుకు దూరమయ్యారు. పాఠశాలలు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నా, పేద కుటుంబాల్లో చాలామందికి అందుకు అవసరమైన ఇంటర్‌నెట్, గాడ్జెట్స్ వంటి సదుపాయాలు లేవు. వేలకు వేలు వాటి కోసం ఖర్చు చేయగల శక్తి వారి తల్లితండ్రులకూ లేదు. మేమూ అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాము. చదువు లేకపోతే బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో తెలుసు. అందుకే డబ్బు లేదన్న కారణంగా పేదింటి ఆడపిల్లలు చదువుకోలేకపోవడం మమ్మల్ని ఆవేదనకు గురి చేసింది. దాని పరిష్కారానికి ఏంచేయాలనుకుంటున్నప్పుడు మాకు తట్టిందే ఈ ఆటో యాత్ర.
రెండూ ఉన్నాయి...
ఆటోనే ఎందుకంటే... రొటీన్‌కు కాస్త భిన్నంగా, నలుగురి దృష్టీ మాపై పడాలనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకున్నాం. పైగా అందరూ ఎప్పుడో అప్పుడు ఆటోలో ప్రయాణం చేసినవారే. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి వారికి చేరువ అయ్యేందుకు, రోడ్డు మార్గంలో ఏ మూలకైనా సాఫీగా సాగిపోయేందుకు ఇది మంచి సాధనం కదా! సామాజిక సేవంటే యువతలో పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. మేమూ ఇంతకు ముందెన్నడూ ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ, లాక్‌డౌన్‌తో నెలలకు నెలలు ఇంట్లోనే కూర్చొని, నాలుగు గోడల మధ్య సమయం వృథా చేయడం కంటే వేరొకరికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తే బాగుంటుందనిపించింది. ఇష్టమైన మిత్రులతో కలిసి అలా విహారానికి వెళ్లినట్టు ఉంటుంది... సమాజానికి మా వల్ల కొంతైనా మేలు జరుగుతుంది.
తొమ్మిది నెలలుగా...
ఓ మంచి కార్యక్రమం కోసం మా ప్రయత్నం గత ఏడాది ఆగస్టులో ఆరంభమైంది. ఎలా సంప్రతించాలి? ఎవరిని కలవాలి? ఇవేవీ మాకు తెలియదు. అయితే ఒక రోడ్డు మ్యాప్ వేసుకున్నాం. కావల్సిన నిధుల సేకరణ కోసం దాదాపు ఐదారు వందల మెయిల్స్ వివిధ కంపెనీలకు పంపించాం. ఎవరూ స్పందించలేదు. వాట్సప్ సందేశాలు ఇచ్చాం. ఫోన్లు చేశాం. ఫలితం దక్కలేదు. చివరకు టీవీఎస్ కంపెనీవారు ఆటో ఇచ్చారు. మరికొందరు వ్యక్తిగతంగా సహకరించారు. చివరకు మా జర్నీ ప్రారంభమైంది. వెళ్లిన ప్రతిచోటా బాగా ఆదరించారు. ఒకావిడ మమ్మల్ని తన సొంత బిడ్డల్లా ఆహ్వానించింది. ప్రేమగా వండిపెట్టింది. పక్కన ఆమె పదమూడేళ్ల కుమార్తె హోమ్‌వర్క్ చేసుకొంటూ, దుకాణంలో తల్లితండ్రులకు సహకరిస్తోంది. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు కళ్లు చెమర్చాయి. అలాగే మా ఆటో, దానిపై రంగులు, అందులో మమ్మల్ని చూసి అసలిదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి, ఉత్సుకత ప్రతిచోటా కనిపించింది. అదే మేము కోరుకున్నది కూడా!
డ్రైవింగ్ నేర్చుకున్నారు...
విచిత్రమేమంటే మాకెవరికీ ఆటో డ్రైవింగ్ రాదు. అన్షుల్, విదుర్ ఆటోడ్రైవర్ల వద్దకు వెళ్లి నేర్పమంటే, వాళ్లు కుదరదన్నారు. ఆఖరికి ఎలాగో ఒప్పించి వాళ్ల దగ్గర శిక్షణ తీసుకున్నారు. మొదట్లో ఎవరూ మా అభ్యర్థనలకు స్పందించకపోయినా, తరువాత ఈ ప్రాజెక్ట్‌ను అర్థం చేసుకున్నారు. స్పాన్సర్లు వచ్చారు. క్రమంగా నిధులు సమకూరాయి. ప్రస్తుతానికి రూ.30లక్షలు పోగయ్యాయి. ఈ డబ్బుతో 450 మంది బడి మానేసిన ఆడపిల్లలకు చదువు చెప్పించవచ్చు. త్వరలోనే అది కూడా నెరవేరుస్తాం. మళ్లీ సెకండ్‌వేవ్ విజృంభిస్తుండంతో మా ఆటోకు బ్రేక్ పడింది. గోవా వెళ్లిన తరువాత మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించారు. దీంతో అక్కడే ఆగాల్సి వచ్చింది. ఇప్పటికి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాం. కానీ పరిస్థితులు చక్కబడగానే మా జర్నీ కొనసాగిస్తాం. అంతేకాదు... మా సేవా కార్యక్రమాలను మరింత ఉద్ధతంగా చేపట్టడానికి ఇది స్ఫూర్తినిచ్చింది.
ఏదిఏమైనా ఇల్లు వదిలి ఇన్ని నెలలు ఉన్నామన్న భావనే రానివ్వని తల్లులందరికీ పేరు పేరునా వందనం. ఈ ప్రయాణంలో మేము మూటగట్టుకున్న ఆప్యాయతలు, అనురాగాలను వెలకట్టలేం. సంపాదించిన అనుభవం... ఎన్నో జీవిత పాఠాల సారం.