నడిచే ఆత్మవిశ్వాసం

ABN , First Publish Date - 2021-01-31T16:16:26+05:30 IST

బాడీ బిల్డింగ్‌ పోటీల వేదిక... పైగా మహిళల పోటీ కావడంతో వీక్షకులు భారీగానే వచ్చారు

నడిచే ఆత్మవిశ్వాసం

బాడీ బిల్డింగ్‌ పోటీల వేదిక... పైగా మహిళల పోటీ కావడంతో వీక్షకులు భారీగానే వచ్చారు. చైనాకు చెందిన ముప్ఫై ఆరేళ్ల గూయి యునా నడుస్తూ వచ్చేసరికి అందరూ లేచినిలుచున్నారు. కండలు తిరిగిన ఆమె శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతకన్నా ఎక్కువ విస్తుపోయేలా చేసింది ఆమె ఒంటికాలు. ఒక కాలుతో కండల పోటీల్లో పాల్గొందంటే ఎంత సాహసం. ఇటీవల యునాకు సంబంధించిన పదిహేను సెకన్ల వీడియోని సోషల్‌ మీడియాలో ఎవరో పోస్ట్‌ చేశారు. అది వైరల్‌గా మారి మూడు లక్షల వ్యూస్‌ను సాధించింది.


ఏడేళ్లప్పుడు...

అప్పుడు గూయి యునాకి ఏడేళ్ల వయసు. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చింది. ఇంకా లోపలికి కూడా వెళ్లలేదు. వెనక నుంచి ఓ వాహనం వచ్చి ఆమెను ఢీకొంది. ఒక కాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఆ పసి హృదయానికి ఆలంబనగా నిలిచింది ఆమె తల్లి. పిల్ల బతకడమే ఎక్కువని భావించలేదు తను. వాళ్ల గ్రామంలో ఉన్న దివ్యాంగుల సౌసైటీకి తీసుకువెళ్లింది. సభ్యత్వం ఇప్పించింది.


పిల్ల చురుకుదనం చూసి వాళ్లు క్రీడల్లో చేర్చారు. ఒంటి కాలితో లాంగ్‌ జంప్‌, హై జంప్‌ చేయడం నేర్చుకుంది. అక్కడితో తల్లి ఊరుకోలేదు పోటీలకు పంపించింది. జాతీయ జట్టుకూ ఎంపికైంది. 2004 గ్రీస్‌ పారాలింపిక్‌ క్రీడల్లో పాల్గొని లాంగ్‌ జంప్‌లో ఏడో స్థానంలో చేరింది. 2008 బీజింగ్‌ పారాలింపిక్‌ క్రీడల్లో టార్చ్‌ బేరర్‌గా పాల్గొంది. ఆ తరవాత విలువిద్య నేర్చుకుంది. 2017లో ఆర్చరీ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుని ఏదైనా ఉద్యోగంలో చేరాలని అనుకుంది. కానీ ప్రతి చోటా ఆశాభంగమే. 


మీలాంటి వాళ్లకు మాదగ్గర ఉద్యోగాలు లేవంటూ సున్నితంగా తోసిపుచ్చారు చాలా మంది. ‘ఒక కాలు లేకపోతే ఏమైంది, నేనూ మీలాంటి మనిషినే అంటే ఎవ్వరూ వినేవాళ్లు కాదంటు’ంది యునా. ఆఖరుకి ఓ కంపెనీలో కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్‌గా చేరింది. క్రమ క్రమంగా పైకి ఎదుగుతూ ఆ కంపెనీ భాగస్వామిగా మారింది. దివ్యాంగులకు సహాయకారిగా తన కంపెనీని మార్చింది. 


క్రీడాకారిణిగా పెరగడం వల్ల జీవితంలో మరెన్నో సాధించాలనే తపన ఆమెలో గట్టిగా ఉంది. అందుకే బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొంది. ప్రస్తుతం గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. పారాషూటింగ్‌ చేయాలన్నది ఆమె తదుపరి లక్ష్యం. ‘ఏదో ఓచోట ఆగిపోవాలని అనుకోవడం లేదు నన్ను చూసైనా ఇంకొంత మంది దివ్యాంగులు తమ లోని భయాల్ని తొలిగించుకుని బయటికి వస్తారనే ఇవన్నీ చేస్తున్నా’ అనే గూయి యునా అందరికీ స్పూర్థిదాయకం.

Updated Date - 2021-01-31T16:16:26+05:30 IST