పిల్ల నచ్చిందా..!

ABN , First Publish Date - 2021-01-20T06:30:16+05:30 IST

సుబ్రహ్మణ్యం కేఫ్‌లో వెయిట్‌ చేస్తుంటాడు. ఇంతలో తను వస్తుంది. ఆమెను చూసి కళ్లు తిప్పుకోలేకపోతాడు సుబ్బు. క్షణంలో తేరుకుని కూర్చోమని ఆమెకు సీటు ఆఫర్‌ చేస్తాడు.

పిల్ల నచ్చిందా..!

సుబ్రహ్మణ్యం కేఫ్‌లో వెయిట్‌ చేస్తుంటాడు. ఇంతలో తను వస్తుంది. ఆమెను చూసి కళ్లు తిప్పుకోలేకపోతాడు సుబ్బు. క్షణంలో తేరుకుని కూర్చోమని ఆమెకు సీటు ఆఫర్‌ చేస్తాడు. ‘మీ డ్రెస్‌ చాలా బాగుందండి’ అని సుబ్బు అంటే... ‘అందుకే కొనుక్కున్నా’ అంటుంది తను. ‘మీరు వేసుకున్నారు కాబట్టే బాగుంది. ఇలాంటి డైలాగులన్నీ ఐదో తరగతిలోనే వాడేశాం’ పంచ్‌కు పంచ్‌ వేస్తాడు సుబ్బు. ‘అమ్మాయిలను ఏడిపించడం మీ మగాళ్లకు అలవాటేగా! అయినా మీరు ఐదో క్లాస్‌లోనే స్టార్ట్‌ చేశారంటే..’ సందేహంగా చూస్తుంది. ‘ఏడిపించడానికి... ఆట పట్టించడానికి చాలా తేడా ఉంది’... బదులిస్తాడు అతడు. ‘సరే... ముందు ఆ కాఫీ తీసుకోండి’ అనగానే... ‘సిగరెట్‌ ఉందా’ అడుగుతుంది తను! షాకవుతాడు సుబ్బు. 


‘మీరు స్మోక్‌ చేస్తారా?’... 

‘ఏ... అబ్బాయిలే చెయ్యచ్చా? అమ్మాయిలు చేయకూడదా?’ 

‘మీకు అబ్బాయిల మీద బాగా కోపం ఉన్నట్టుంది’

‘యా... ఐ హేట్‌ దిస్‌. అంతా అబ్బాయిలకు నచ్చినట్టే జరగాలంటారు. అమ్మాయిలకు నచ్చిన డ్రెస్‌ వేసుకొనే స్వేచ్ఛ కూడా లేదు’

‘అంటే మీరు ఫెమినిస్టనమాట’ 

‘యా... వాట్స్‌ ద ప్రాబ్లమ్‌ ఇన్‌ దట్‌?’ 

‘నేను బీటెక్‌ చదివి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడానికి ఉద్యోగం చేస్తున్నా. నువ్వు ఎంటెక్‌ చదివి కూడా ఏ పనీ లేకుండా... అబ్బాయిలను తిడుతూ తిరుగుతున్నావు. ఫెమినిజమ్‌ అంటే ఇది కాదు’

‘ఇన్ని మాట్లాడుతున్నావు... మరి నేను రావడం చూసి చొంగ కార్చుకున్నావెందుకు?’ 

‘నీ ఆలోచనా విధానం ఇంత దారుణంగా ఉందని తెలిస్తే నువ్వున్న పరిసరాలకు పది కిలోమీటర్ల దూరం మెయిన్‌టెయిన్‌ చేసేవాడిని’ 

‘నువ్వు ఎన్ని మాట్లాడినా అందరిలాంటివాడివే’ 

‘అవునమ్మా... నేనూ అందరిలాంటివాడినే. అందమైన అమ్మాయి కనిపిస్తే చూడడంలో తప్పేమీ లేదు. ఎకార్డింగ్‌ టు సమరం... అలా చూడకపోతేనే ఏదో లోపం ఉన్నట్టు. అసలు నీకు ఈ పెళ్లిచూపులు ఇష్టం లేనట్టుంది’

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నారు. నాకు కొన్ని షరతులున్నాయి. అన్నీ సగం సగం పంచుకోవాలి. ఇంటి రెంట్‌ సగం సగం... ఎవరి టీవీలు వారివి. ఎవరి కిచెన్‌ సామాన్లు వారివి’

‘కాపురమైనా కలిసి చేస్తామా? దానికీ ఏమైనా అమౌంట్‌ పే చెయ్యాలా? నీకు పెళ్లి చూపులు కాదు. పిచ్చాసుపత్రే కరెక్ట్‌’ అని సుబ్బు అనడంతో కోపం వచ్చి తను లేచి వెళ్లిపోతుంది. ఇంకో అమ్మాయిని కలుస్తాడు పెళ్లి చూపుల్లో! తనకు సుబ్బు చెప్పినవన్నీ ఓకే కానీ... అమెరికాలో సెటిలవుతాడనుకుని సంబంధానికి వస్తుంది తను. అయితే అతడు మాత్రం ఇక్కడే ఉంటానంటాడు. దీంతో అప్‌సెట్‌ అయ్యి వెళ్లిపోతుంది ఈ అమ్మాయి కూడా! ఇలా నాలుగైదు చూస్తాడు. అతడికి ఎవరూ నచ్చరు. అతడు ఎవరికీ నచ్చడు. చివరకు కోరుకున్న అమ్మాయి సుబ్బుకు దొరికిందా? తెలియాలంటే ‘టిపికల్‌ గర్ల్స్‌ ఎట్‌ పెళ్లిచూపులు’ లఘుచిత్రం చూడాల్సిందే. సాయికుమార్‌ చక్కని దర్శకత్వ ప్రతిభ కనపబర్చాడు. విభిన్న మనస్తత్వాలు ఉన్న అమ్మాయిలుగా అన్ని పాత్రలూ వైష్ణవి పోషించింది. సుబ్బుగా శ్రీహన్‌ మెప్పించాడు. 

Updated Date - 2021-01-20T06:30:16+05:30 IST