సాహసమే పెట్టుబడి
ABN , First Publish Date - 2021-01-27T07:54:20+05:30 IST
చిన్నప్పటి నుంచి ఒక కల... ఫార్ములా వన్ రేసర్ కావాలని! తోటి పిల్లలు పుస్తకాల సంచీ భుజానేసుకుని బడికి పరుగెడుతుంటే... అతడు రేస్ కార్లతో సావాసం మొదలుపెట్టాడు.
చిన్నప్పటి నుంచి ఒక కల... ఫార్ములా వన్ రేసర్ కావాలని!
తోటి పిల్లలు పుస్తకాల సంచీ భుజానేసుకుని బడికి పరుగెడుతుంటే... అతడు రేస్ కార్లతో సావాసం మొదలుపెట్టాడు.
యశ్ ఆరాధ్యకు ఏ కలా చిన్నది కాదు... అలాగని పెద్దదీ కాదు.
అందుకే పద్దెనిమిదేళ్ల వయసులోనే ‘ఫార్ములా 4’ రేసర్‌గా దుమ్ములేపుతున్నాడు. ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి రాష్ర్టీయ బాల్ పురస్కార్’ అందుకుని... ‘ఫార్ములా వన్’ వైపు దూసుకుపోతున్నాడు.
యశ్ ఆరాధ్య... అతడి ఒంటి పేరు. సాహసం... అతడి ఇంటి పేరు. నేటితరమంతా క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి క్రీడల వెంట పడుతుంటే... బెంగళూరు కుర్రాడు యశ్ మాత్రం రేస్ కార్లపై మోజు పెంచుకున్నాడు. అందులో అనుక్షణం ప్రాణాలకే ప్రమాదముందని తెలిసినా వెనకడుగు వేయనన్నాడు. ఆ సాహస నిర్ణయమే అతడిని ఇప్పుడు దేశ విదేశాల రేసుల్లో విజేతగా నిలబెడుతోంది. గోకార్టింగ్‌తో మొదలైన యశ్ రేసింగ్ ప్రయాణం బ్రేక్‌లు లేకుండా సాగిపోతోంది.
ఆ ఇష్టం ఈనాటిది కాదు...
‘‘నాకప్పుడు ఆరేళ్లు. ఆ వయసులోనే కార్లు, వాటి పేర్లు తెలుసుకొనేవాడిని. తరువాత వాటి ఇంజిన్, ఇతర భాగాల పనితీరు గురించిన వివరాలు సేకరించడం మొదలుపెట్టా. మేము ఏ నగరానికి వెళ్లాలన్నా విమానం ఎక్కేవాళ్లం. అయితే ఒకసారి ముంబయికి కారులో బయలుదేరాం. ఒంపుల రోడ్లు, పెద్ద పెద్ద గహలు, వాహనాల వరుసలు... ఓహ్ అద్భుతమనిపించింది! రహదారిపై రయ్యిన దూసుకుపోవడం నాకు మొదటిసారేమో... ఆ రోజు నా ఆనందం, అనుభూతి, ఉత్సుకత మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా రకరకాల కార్లు బాగా ఆకట్టుకున్నాయి. నా మనసు నాన్న సుజిత్ గమనించారు’’ అంటూ గుర్తు చేసుకున్నాడు యశ్.
మేగజైన్‌లో చూసి...
కారులో ముంబయి వెళ్లి వచ్చినప్పటి నుంచి యశ్ మనసు రేసింగ్‌లపైకి మళ్లింది. అదీ ఎలాగో తెలుసా..! ‘‘రేస్ కార్లు నడపాలని కలలు కంటున్న రోజుల్లో మోటర్ స్పోర్ట్ మేగజైన్ ఒకటి నా కంట పడింది. పేజీలు తిప్పుతుంటే ‘సహారా ఫోర్స్ ఇండియా ఎఫ్1 టీమ్’ అనే శీర్షిక దగ్గర చూపు ఆగిపోయింది. వెంటనే అది తీసుకెళ్లి నాన్నకు చూపించాను. ‘నేను కూడా ఫార్ములా వన్ రేసర్ కావాలనుకొంటున్నాను’ అని నాన్నతో అంటే ఆయన ఆశ్చర్యపోయారు’’ అంటూ యశ్ చెప్పుకొచ్చాడు. ఏడేళ్ల పిల్లాడు ఫార్ములా వన్ రేసర్‌ను అవుతానంటే ఏ తల్లితండ్రులకైనా తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది కదా! యశ్ తల్లితండ్రులదీ అదే పరిస్థితి. అయితే అంతలోనే తమ ముద్దుల కొడుకు ఇష్టాన్ని గ్రహించారు.
లెజెండ్రీ గురువు...
రేసర్ కావాలన్న యశ్ కోరికను తల్లితండ్రులు కాదనలేదు కానీ, అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘రేస్‌లు, అందులో ఉపయోగించే కార్లు, వాటిని నడిపే డ్రైవర్లు... అన్నింటిపై నాకు ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవడానికి పరీక్ష కాని పరీక్ష ఒకటి పెట్టారు. అడిగిన వాటన్నింటికీ నా మెదడులో ఉన్నంత వరకు టకటకా సమాధానాలు చెప్పేశాను. దీంతో ఇక నా కలకు రూపం ఇవ్వడం తప్ప మరో మార్గం కనిపించలేదు వారికి. వెంటనే నాన్న జేకే టైర్స్ హెడ్ సంజయ్‌శర్మను కలిశారు. వెళ్లగానే ఆయన చెప్పిన మాట... రేసింగ్‌కు నా వయసు మరీ చిన్నదని. కనీసం ఎనిమిదేళ్లయినా ఉంటే కానీ చేర్చుకోవడం కుదరదన్నారు. అయితే నాలో ఆసక్తి గమనించి రేసింగ్ మెంటార్ అక్బర్ ఇబ్రహీం వద్దకు పంపించారు. అంతర్జాతీయ సర్క్యూట్‌లో పోటీపడ్డ మొట్టమొదటి భారత దిగ్గజ రేసర్ ఆయన. 2012 నుంచి ఇబ్రహీం నాకు గురువుగా మారారు’’ అంటున్న యశ్‌ను ప్రతి రేస్‌కూ సన్నద్ధం చేసేది ఆయనే!
గోకార్టింగ్‌తో శ్రీకారం...
గురువు అక్బర్ ఇబ్రహీం పర్యవేక్షణలో యశ్ రేస్ కార్లపై అవగాహన పెంచుకున్నాడు. గోకార్టింగ్‌తో అతడి రేసింగ్ జర్నీ మొదలైంది. 2013లో ‘జేకే టైర్స్ ఎఫ్‌ఎంఎస్‌సీఐ రోటాక్స్ మాక్స్ నేషనల్ కార్టింగ్ చాంపియన్‌షిప్’లో పాల్గొన్నాడు. అందులో వైస్ చాంపియన్ అవార్డు దక్కించుకున్నాడు. అదే అతడికి తొలి రేస్. ‘‘ఆ అవార్డు అందుకున్నప్పుడు పట్టలేని ఆనందం నాలో! అంతచిన్న పిల్లాడిని వేదికపై చూసినవారంతా మురిసిపోయారు. అభినందనలతో ముంచెత్తారు. నన్ను చూసి మా నాన్న కూడా ‘ఇది శుభారంభం’ అంటూ ఎంతో సంబరపడ్డారు. ఇక అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసింది లేదు. 2017లో ‘జేకే టైర్ ఎఫ్‌ఎంఎస్‌సీఐ నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్- ఫార్ములా ఎల్‌జీబీ4’ టైటిల్ గెలుచుకున్నాను. క్రమక్రమంగా జాతీయ స్థాయి రేసింగ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొంటూ వచ్చాను. దాంతో దేశవ్యాప్తంగా నాకు గుర్తింపు లభించింది’’.
విజయ పరంపర...
యశ్ ప్రతిభను గుర్తించిన ప్రముఖులు అతడిని ప్రతిష్ఠాత్మక ‘భారత మోటర్ స్పోర్ట్స్ క్లబ్స్ ఫెడరేషన్’కు నామినేట్ చేశారు. దీనివల్ల మలేషియా, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో జరిగే రేసింగ్‌ల్లో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం యశ్‌కు దక్కింది. ఇప్పటి వరకు అతడు 13 జాతీయ, క్లబ్ చాంపియన్‌షిప్‌లు గెలిచాడు. కానీ దీని వెనుక అలుపెరిగని శ్రమ, సడలని సంకల్పం, అంకితభావం ఉన్నాయి. అతడి దృష్టిలో రేసర్ అంటే ఎక్కడైనా ఏ సమయంలోనైనా రేస్‌కు సిద్ధంగా ఉండాలి. అందుకే యశ్ రోజుకు రెండు గంటలు ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తాడు. ఆహార నియమాలు పక్కాగా పాటిస్తాడు. రేసింగ్ నిబంధనల ప్రకారం డ్రైవర్, కార్ సీట్... రెండింటి బరువు మొత్తం 80 కిలోలకు మించకూడదు. అలా శరీర బరువును అదుపులో పెట్టుకొంటూ రేసింగ్ కొనసాగించడంమంటే ఫార్ములా వన్ రేసర్లకు అంత సులువు కాదు.
ఉదయం ఆరింటికే షురూ...
‘‘మనం ఎంత క్రమశిక్షణగా ఉన్నామనేదాన్ని బట్టే మిగతావన్నీ ఆధారపడి ఉంటాయి. ఉదయం ఆరు గంటలకు నా రోజు మొదలువుతుంది. ఎనిమిది గంటల వరకు వర్కవుట్స్. తరువాత అల్పాహారం, శిక్షణా తరగతులు. అదే సమయంలో నా స్పాన్సర్స్‌తో కూడా సంప్రతింపులు జరుగుతుంటాయి. ఇక డైట్ విషయానికి వస్తే... పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఆహారమే తీసుకొంటాను. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాను. కోడి గుడ్లు, అప్పుడప్పుడు పాస్తా, ఇడ్లీ, దోశలు తింటుంటాను. ఇతర ఆటల్లా రేసర్లు రోజూ సాధన చేయాల్సిన పనిలేదు. అయితే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి ఏడాది పొడవునా సాధన సాగుతూనే ఉంటుంది’’ అంటున్న యశ్ ప్రస్తుతం బెంగళూరులోని ‘బిషప్ కాటన్స్ బాయ్స్ స్కూల్’లో కామర్స్ చదువుతున్నాడు.
ఖరీదైన క్రీడ...
మోటర్ స్పోర్ట్ నేర్చుకోవాలని కల కంటే సరిపోదు. దానికి తగిన నిధులు కూడా సమకూర్చుకోగలగాలి. ఎందుకంటే ఇది చాలా ఖరీదైన క్రీడ. ‘‘రేసింగ్ సూట్ ఒక్కటే లక్ష రూపాయలకు పైన ఉంటుంది. హెల్మెట్ ధర సుమారు రూ.65 వేలు. ఫార్ములా 4, బడా చాంపియన్‌షిప్‌లకు మినహా మరే రేస్‌ల్లోనూ నగదు బహుమతులు ఇవ్వరు. నా ఖర్చుల్లో అధిక శాతం స్పాన్సర్ల నుంచి వస్తుంది. ఏ క్రీడాకారుడికైనా అతిపెద్ద సవాలు ఓటములకు తట్టుకుని నిలబడడం, స్పాన్సర్లను పట్టుకోవడం’’ అంటాడు యశ్. ప్రస్తుతం అతడు మరో ‘ఫార్ములా 4’ రేస్ కోసం సిద్ధమవుతున్నాడు. ‘‘దాని కోసం 2.3 కోట్ల రూపాయలు కావాలి. ఒకవేళ ఇటాలియన్, లేదా జర్మన్ ఫార్ములా 4 చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలంటే ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఇది భారీమొత్తమే అయినా చాలామంది స్పాన్సర్లు ముందుకు వచ్చారు. వారివల్లే నేను ఇన్ని పోటీల్లో పాల్గొనగలుగుతున్నా’’ అంటాడు యశ్.
మోటర్ స్పోర్ట్ నేర్చుకోవాలని కల కంటే సరిపోదు. దానికి తగిన నిధులు కూడా సమకూర్చుకోగలగాలి. ఎందుకంటే ఇది చాలా ఖరీదైన క్రీడ. రేసింగ్ సూట్ ఒక్కటే లక్ష రూపాయలకు పైన ఉంటుంది. హెల్మెట్ ధర సుమారు రూ.65 వేలు. ‘ఫార్ములా 4’ రేస్ కోసం రూ.2.3 కోట్లు ఖర్చవుతుంది.
ఇప్పటి వరకు యశ్ 13 జాతీయ, క్లబ్ చాంపియన్‌షిప్‌లు గెలిచాడు. దీని వెనుక అలుపెరిగని శ్రమ, సడలని సంకల్పం, అంకితభావం ఉన్నాయి. అతడి దృష్టిలో రేసర్ అంటే ఎక్కడైనా ఏ సమయంలోనైనా రేస్‌కు సిద్ధంగా ఉండాలి.
ప్రధాని ప్రశంసలు...
రేసింగ్‌లో యశ్ చూపుతున్న అసమాన ప్రతిభకు గాను అతడికి గత ఏడాది ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ఈ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కలిశాడు యశ్. ‘‘ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారంతో నీ విజయాలు ఆగిపోకూడదు. ఇది నీ కెరీర్‌కు కొత్త ఆరంభం కావాలి’’ అంటూ మోదీ ఆ సందర్భంలో యశ్‌లో స్ఫూర్తి నింపారు. అదే స్ఫూర్తితో అతడు ఇప్పుడు ‘ఫార్ములా వన్’ రేస్ కల నెరవేర్చుకొనే దిశగా దూసుకుపోతున్నాడు.