సముద్రం సాక్షిగా...
ABN , First Publish Date - 2021-02-03T05:30:00+05:30 IST
జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే పండుగ పెళ్లి. అందుకే చాలామంది తమ పెళ్లి వేడుక ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. చెన్నైకి చెందిన వి.చిన్నాదురై,
జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే పండుగ పెళ్లి. అందుకే చాలామంది తమ పెళ్లి వేడుక ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. చెన్నైకి చెందిన వి.చిన్నాదురై, ఎస్.శ్వేత కూడా తమ వివాహాన్ని వెరైటీగా జరుపుకోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే నీటి అడుగునా అదీ 60 అడుగుల లోతులో ఫిబ్రవరి 1వ తేదీన పెళ్లి చేసుకున్నారు. నీలంకరాయ్ నదిలో స్కూబా డైవింగ్ చేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సముద్రపు అలల సాక్షిగా పెళ్లి చేసుకున్న వీరికి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే...
చిన్నాదురై, శ్వేత ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. చిన్నాదురైకి స్కూబా డైవింగ్ అంటే ఇష్టం. ఆయనకు స్కూబా డైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. తన పెళ్లిని నీటి అడుగున చేసుకోవాలనుకున్నారాయన. ఇదే విషయాన్ని కాబోయే భార్య శ్వేతకు చెప్పి ఒప్పించారు. ఆమె పెళ్లికి నెల రోజుల ముందు స్కూబా డైవింగ్ కోర్సులో చేరింది. ‘‘మా సంప్రదాయం ప్రకారమే పెళ్లి జరిగింది. కాకపోతే నీటి అడుగున వివాహం చేసుకున్నాం. ముహూర్త సమయానికి కొంచెం ముందు ఇద్దరం స్కూబా డైవింగ్ చేశాం. పురోహితుడు నిర్ణయించిన ముహూర్తానికే (ఉదయం 7:30) తాళి కట్టాను. ఇద్దరం పూల దండలు మార్చుకున్నాం’’ అని చెప్పారు చిన్నాదురై. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీటి అడుగున పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న వీరు తమ వివాహ ఆహ్వాన పత్రికలో ఏ రోజున పెళ్లి అనేది రాయలేదు.
ఎందుకంటే సముద్రం శాంతించి, స్కూబా డైవింగ్‌కు అనుకూలంగా ఉన్నరోజునే మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టాలనుకున్నారు. ఫిబ్రవరి 1న సంప్రదాయ పెళ్లి దుస్తులు ధరించి, సముద్ర తీరంలో ఉన్న తమ పెద్దవాళ్లకు అభివాదం చేసి స్కూబా డైవింగ్ చేశారిద్దరూ. ‘‘నేను, మా అమ్మానాన్న కొంత ఆందోళన చెందాం, మా వెంట ఎనిమిది మంది స్కూబా డైవర్లు ఉన్నారు. సముద్ర అలల సాక్షిగా పెళ్లి చేసుకోవడం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది’’ అంటున్నారు నవ వధువు శ్వేత.