మంచు పర్వతంపై మ్యూజిక్
ABN , First Publish Date - 2021-05-19T05:30:00+05:30 IST
ప్రకృతికి పరవశించిన మయూరం పురివిప్పి నర్తించినట్టు... కరోనా కట్టడి నుంచి విముక్తి పొందిన ఫ్రాన్స్ యువ మ్యుజీషియన్ టెహో నింగినీ, నేలనూ ఏకంచేసి మరీ తన సంగీతాన్ని వినిపించాడు
ప్రకృతికి పరవశించిన మయూరం పురివిప్పి నర్తించినట్టు... కరోనా కట్టడి నుంచి విముక్తి పొందిన ఫ్రాన్స్ యువ మ్యుజీషియన్ టెహో నింగినీ, నేలనూ ఏకంచేసి మరీ తన సంగీతాన్ని వినిపించాడు. మహమ్మారి దెబ్బకు కొన్ని నెలలపాటు విరామం ఇచ్చిన అతడు... పంజరంలో నుంచి బయటపడ్డ చిలుకలా మేఘాలను ముద్దాడాలనుకున్నాడు. అందుకే 3 వేల మీటర్లు... అంటే 9,843 అడుగుల ఎత్తున ఉన్న స్విస్ పర్వతశ్రేణుల్లోని ‘సెక్స్ రూజ్’ శిఖరంపైకి ఎక్కి మ్యూజిక్ మ్యాజిక్ చేశాడు. గడ్డకట్టే మంచు... అనువుగాని ఇరుకైన వేదిక... అన్నిటినీ అధిగమించి అనుకున్నది సాధించాడు. నిజానికి టెహోకు ఎత్తైన ప్రదేశాలంటే తెగ భయం. మరి అంతెత్తులో ఎలా అంటే... ‘‘భయపడుతూనే పైకి వెళ్లాను. అది చాలా చిన్న ప్రదేశం. కింద పడకుండా ఆపడానికి చుట్టూ ఎలాంటి రక్షణా లేదు. ముందు వణుకు పుట్టింది. ఎలాగో కాసేపటికి ధైర్యం తెచ్చుకున్నా.
ఒక్కసారి మ్యూజిక్ ప్లే చేయడం మొదలుపెట్టాక క్రమంగా భయం పోయింది. ఆ తరువాత అద్భుతమైన, ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో నా సంగీతాన్ని నేను ఆసాంతం ఆస్వాదించాను’’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు టెహో. ఇంతకముందెన్నడూ అలాంటి విభిన్నమైన వేదికపై ప్రదర్శన ఇచ్చింది లేదంటాడు అతడు. ‘‘ఎడతెరిపి లేని ప్రదర్శనలతో ఎప్పుడూ బిజీగా ఉండేవాడిని. కానీ కరోనా వల్ల ఏడాదిగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. క్లబ్స్, పార్టీలు, పండగలు... అన్నీ బంద్. షో చేసే అవకాశమే లేక... జనం ఈలలు వినిపించక పిచ్చెక్కిపోయింది. ఇన్నాళ్లూ లోపల అణచిపెట్టినదంతా ఒక్కసారిగా బయటకు రావాలంటే వేదిక కూడా అందుకు తగినదిగా ఉండాలి. అందుకే స్విస్ పర్వతశ్రేణులు ఎంచుకున్నాను’’ అంటాడు టెహో. అక్కడి ‘గ్లేసియర్ 3000’ రిసార్ట్ తరచూ ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ప్రధానంగా మ్యుజీషియన్స్‌ను ప్రోత్సహిస్తూ, వారితో సరికొత్త ప్రయోగాలు చేస్తుంటుంది.