ఆక్సిజన్‌ మ్యాన్‌

ABN , First Publish Date - 2021-05-19T05:30:00+05:30 IST

‘‘సరిగ్గా ఏడాది కిందట... మా స్నేహితుడి భార్యకు కొవిడ్‌ సోకింది. అప్పుడామె నిండు గర్భిణి. ఒకరోజు ఆమెకు ఉన్నట్టుండి ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆమెను తీసుకుని ఆటోలో ఆసుపత్రికి బయలుదేరాం

ఆక్సిజన్‌ మ్యాన్‌

కరోనాతో దేశమంతా ప్రాణవాయువు కోసం అల్లాడుతోంది. అది అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిత్యం ఇలాంటి దృశ్యాలెన్నో. అవి చూసి తట్టుకోలేకపోయాడు యువ వ్యాపారవేత్త షాన్వాజ్‌ షేక్‌. అత్యవసరంలో ఉన్నవారి ఇంటి వద్దకే వెళ్లి ఉచితంగా ఆక్సిజన్‌ అందిస్తున్నాడు. ఏడాదిగా వేలమందికి ఊపిరి పోస్తూ... ‘ఆక్సిజన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ముంబయి’గా అభినందనలు అందుకొంటున్న ఆ యువకుడి జర్నీ ఇది...  


‘‘సరిగ్గా ఏడాది కిందట... మా స్నేహితుడి భార్యకు కొవిడ్‌ సోకింది. అప్పుడామె నిండు గర్భిణి. ఒకరోజు ఆమెకు ఉన్నట్టుండి ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆమెను తీసుకుని ఆటోలో ఆసుపత్రికి బయలుదేరాం. తీరా ఆసుపత్రికి వెళ్లాక ఆక్సిజన్‌ లేదన్నారు. అక్కడి నుంచి ఇంకోటి... మరొకటి... నాలుగు ఆసుపత్రులు తిరిగాక చివరకు ఒకచోట దొరికింది. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. లోపలికి తీసుకువెళ్లే లోపే ఆటోలోనే ఆమె ఊపిరి ఆగిపోయింది. కళ్లు తెరవక ముందే కడుపులో బిడ్డ కళ్లు మూసింది. కళ్ల ముందే ఒక ప్రాణం గిలగిలా కొట్టుకొంటుంటే ఏమీ చేయలేకపోయాం. అదీ ముంబయి వంటి మహానగరంలో! భార్యను పోగొట్టుకుని మిత్రుడు గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. నాలో దుఃఖం కట్టలు తెగుతోంది. రోజూ ఇలా ఎంతోమంది! కుంగదీసిన ఆ ఘటన నన్ను కదిలించింది. ఆ క్షణమే అనుకున్నాను... కనీసం కొన్ని ప్రాణాలైనా నిలబెట్టాలని! 


ఫోర్డ్‌ కారు అమ్మి... 

అత్యవసరంలో ఉన్నవారికి ఆక్సిజన్‌ అందించాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కాంట్రాక్టర్‌గా, డెవలపర్‌గా నేను సంపాదించేది నా నెలవారీ ఖర్చులకు సరిపోతుంది. మరి ఆక్సిజన్‌ సిలిండర్లకు, వాటి రవాణాకూ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ఆలోచిస్తూ కూర్చుంటే అడుగైనా ముందుకు పడదు. అప్పుడు నాకు కనిపించిన ఒకే ఒక్క మార్గం... నా కారు. ఫోర్డ్‌ ఎండీవర్‌ ఎస్‌యూవీ. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆ కారును రూ.22 లక్షలకు అమ్మేశాను. ఆ డబ్బుతో ఆక్సిజన్‌ సిలిండర్లు కొన్నాను. అంతకముందు నా కారును కొన్ని రోజులు అంబులెన్స్‌గా ఉపయోగించాను. 


రోజుకు 200 సిలిండర్లు... 

గత సంవత్సరం లాక్‌డౌన్‌ సమయంలో అందరిలో ఒక గందరగోళం. బెడ్లు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో... వెంటిలేటర్లు గల ఆసుపత్రులేవో తెలియక అవస్థలు పడ్డారు. బయటకు రావాలంటే భయం. ఇలాంటి పరిస్థితుల్లో కంటైన్‌మెంట్‌ జోన్లు దాటుకుని క్వారంటైన్‌లో ఉన్నవారికి ఆక్సిజన్‌ సిలిండర్లు తీసుకువెళ్లడానికి చాలా ఇబ్బందులుపడ్డాం. అయినా వెనక్కి తగ్గలేదు. 2012లో ‘యూనిటీ అండ్‌ డిగ్నిటీ ఫౌండేషన్‌’ (యూడీఎఫ్‌) అనే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాను. పేద, అట్టడుగు వర్గాలవారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడే ఆలోచనతో నాడు దాన్ని స్థాపించాను. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితుల కోసం కూడా పనిచేయాలని నిర్ణయించాను. అలాగే నా వ్యాపార భాగస్వామి, మరికొంతమంది మిత్రులు కూడా నాతోపాటు నడిచారు. వారందరి సహకారంతో కరోనా తొలి దశలో రోజుకు 200 సిలిండర్లు సరఫరా చేయగలిగాం. దీని కోసం ప్రత్యేకంగా వార్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. ఆక్సిజన్‌ డీలర్లు, ఔత్సాహికులతో నెట్‌వర్క్‌ నెలకొల్పాం. మా సేవలన్నీ ఉచితమే! పేషెంట్‌ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోము. అలాగే కొన్ని బస్తీలవారికి నిత్యావసరాలు, భోజనాలు కూడా అందిస్తున్నాం. 


డిమాండ్‌ అందుకోలేకపోతున్నాం... 

ప్రస్తుతం కరోనా రెండో దశ విలయం సృష్టిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆక్సిజన్‌ సిలిండర్ల డిమాండ్‌ ఎన్నో రెట్లు అధికమైంది. రోజూ వందల్లో కాల్స్‌ వస్తున్నాయి. విచిత్రమేమంటే... ఆసుపత్రులవారు కూడా అడుగుతున్నారు. ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌ల నుంచీ ప్రజలు కాల్‌ చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కొరత. అయినా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ముందుగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. కనీసం రెండొందల సిలిండర్లు స్టాక్‌ ఉండేలా చూసుకొంటూ, ఆపదలో ఉన్నవారికి పంపిస్తున్నాం. ఏదిఏమైనా కొరత కారణంగా గత ఏడాది దాదాపు ఏడువేల సిలిండర్లు సరఫరా చేసిన మేము... ఈసారి అది ఆరేడు వందలకే పరిమితమైంది. 


నిద్రాహారాలు మాని మేం ఎంత చేస్తున్నా... ప్రాణవాయువు అందక ఒక ప్రాణం పోయిందంటే తీవ్ర మనోవేదన కలుగుతుంది. సొంతవారిని, సన్నిహితులును పోగొట్టుకొంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పటికీ చాలామంది అడుగుతుంటారు... ‘మీ ఖరీదైన కారును అమ్మేశారు... బాధగా లేదా’ అని! ఈ మహమ్మారి పోయి పరిస్థితులు చక్కబడితే మరో ఫోర్డ్‌ కొనుక్కోవచ్చని వారికి చెబుతుంటాను. ఒకరి ప్రాణం నిలబెట్టడం కంటే విలువైనది ఏముంటుంది! 


ప్రస్తుతం కరోనా రెండో దశ విలయం సృష్టిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆక్సిజన్‌ సిలిండర్ల డిమాండ్‌ ఎన్నో రెట్లు అధికమైంది. రోజూ వందల్లో కాల్స్‌ వస్తున్నాయి. విచిత్రమేమంటే... ఆసుపత్రులవారు కూడా అడుగుతున్నారు. కానీ ఎక్కడ చూసినా కొరత. ముందుగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. 

Updated Date - 2021-05-19T05:30:00+05:30 IST