వివేక తత్వం... భవితకు మార్గం

ABN , First Publish Date - 2021-01-06T05:30:00+05:30 IST

ఉత్సాహం నింపే ప్రసంగాలు, ఉరకలెత్తించే బోధనలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దార్శనికుడు స్వామివివేకానంద

వివేక తత్వం... భవితకు మార్గం

12న జాతీయ యువజన దినోత్సవం

ఉత్సాహం నింపే ప్రసంగాలు, ఉరకలెత్తించే బోధనలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దార్శనికుడు స్వామివివేకానంద. యువతను చైతన్య పరిచే ఉపన్యాసాలతో యూత్‌ ఐకాన్‌గా పేరొందిన ఆయన బోధనలు ఇప్పటికీ ఆచరణీయమే. అలాంటి మార్గదర్శుడి జీవితం నుంచి ఈతరం నేర్చుకోవాల్సినవి, అలవరచుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని...


స్వశక్తిపై నమ్మకం

వివేకానంద బోధించిన వాటిల్లో ముఖ్యమైనది తమపై తమకు నమ్మకం కలిగి ఉండడం. ఎవరికైతే తమ శక్తిసామర్థ్యాల మీద నమ్మకం ఉండదో వారు జీవితంలో పైకి రావడానికి చాలా కష్టాలు పడతారంటారాయన. తన శక్తిని నమ్మి, భయాలను విడిచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేవాళ్లు మాత్రమే విజయం సాధిస్తారు.


లక్ష్యం వైపు సాగడం

ఏదైనా సాధించాలంటే తనపై తమకు నమ్మకంతో పాటు లక్ష్యం వైపు అలుపెరగకుండా సాగడం.. ఈ రెండూ ముఖ్యమే. మన కలల్ని నిజం చేసుకోవాలంటే అందుకోసం కష్టపడాలి. మనం జీవితంలో అనుకున్నది సాధించేంత వరకు మన మనసు, శరీరం విశ్రమించకూడదు. 




తెలివిగా ఆలోచించడం

మనం ఏం ఆలోచిస్తామో అలాగే తయారవుతాం. మనం చేసే పనులు కూడా మన ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. అందుకే మనం పరిస్థితులను అర్థం చేసుకున్న తరువాతే ఏది ఎలా చేయాలనే నిర్ణయానికి రావాలి. ఎప్పుడూ సానుకూల దృక్ఫథంతో ఉంటే మరింత తెలివిగా ఆలోచించగలుగుతాం. 


దృష్టి మళ్లించొద్దు

అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే మన దృష్టి ఎప్పుడూ దాని మీదే ఉండాలి. గమ్యం చేరేందుకు మన శక్తియుక్కులను కూడదీసుకొని ప్రయత్నించాలి. మధ్యలో ఎన్ని ఇబ్బందలు ఎదురైనా సరే వెనకడుగు వేయొద్దు. 


నిజాయతీగా ఉండాలి

 వివేకానంద తన జీవితకాలమంతా నిజాయతీగా ఉన్నారు. అందుకే ఆయన అంత విజయవంతమయ్యారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎంత కష్టంలో ఉన్నా కూడా నిజమే మాట్లాడాలి. మాటకు కట్టుబడి ఉండాలి. నిజం చెప్పడం వల్ల దారితీసే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. 


సేవకు సిద్ధపడాలి

 జాతి, కులం, మతం వంటి తారతమ్యాలు లేకుండా కష్టంలో ఉన్నవారికి సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఎవరిని కూడా వివక్షతో చూడకూడదు. అందరి సంక్షేమాన్ని కోరుకోవాలి. 


ధైౖర్యంగా ఎదుర్కోవాలి

 సమస్యల నుంచి దూరంగా పరుగెత్తడం సరైన పరిష్కారం కాదని వివేకానంద చెప్పడమే కాదు ఆచరించి చూపారు కూడా. అందుకే కష్టాలు వచ్చినప్పుడు పిరికివాడిలా భయపడిపోవద్దు. ధైర్యంగా ముందడుగేయాలి. దాంతో చాలా వరకు సమస్యలకు పరిష్కారం దొరకుతుంది.  


Updated Date - 2021-01-06T05:30:00+05:30 IST