బాలీవుడ్‌కి షూమ్యాన్‌

ABN , First Publish Date - 2021-02-17T08:43:20+05:30 IST

అభిమాన తారలను చూడాలని బిహార్‌ నుంచి ముంబయికి వచ్చాడు. కానీ ఆ తారలే ఇప్పుడతడి అభిమానులయ్యారు. నాడు... చెప్పులు లేకుండా మహానగరంలో అడుగుపెట్టాడు. నేడు... బాలీవుడ్

బాలీవుడ్‌కి షూమ్యాన్‌

అభిమాన తారలను చూడాలని బిహార్‌ నుంచి ముంబయికి వచ్చాడు. కానీ ఆ తారలే ఇప్పుడతడి అభిమానులయ్యారు. నాడు... చెప్పులు లేకుండా మహానగరంలో అడుగుపెట్టాడు. నేడు... బాలీవుడ్‌ బాద్‌షాలందరికీ తాను కుట్టిన చెప్పులనే తొడుగుతున్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ సామాన్యుడు... స్వయంకృషితో అసామాన్యుడిగా ఎదిగాడు. ఎలా? ఎవరతడు?



జీవితమే ఒక పోరాటం. ఆ పోరాటంలోనే విజయం ఉంటుంది. ఇది జమీల్‌ షాకు పరిస్థితులు నేర్పిన పాఠం. బిహార్‌లోని ఎక్కడో మారుమూలనున్న దర్భాంగా ప్రాంతం. ఏడుగురు సంతానంలో పెద్దవాడితడు. జమీల్‌ తల్లితండ్రులు వ్యవసాయ కూలీలు. పెద్ద కుటుంబం. ఏమూలకూ సరిపోని కూలి డబ్బులు. పేదరికం  ఐదో తరగతిలోనే అతడి చదువుకు బ్రేకు వేసింది. చేసేది లేక బడి మానేసి స్థానిక మదర్సాలో చేరాడు. 


పన్నెండేళ్లకే వలస... 

‘‘ఇంట్లో అంతమందిని పోషించడం మా అమ్మానాన్నల వల్ల కాలేదు. రెండో పూట తిండి తినడమే గగనమైపోయింది. ఇక స్కూలుకు ఎక్కడ వెళ్లగలను? నేను కూడా ఎంతో కొంత సంపాదించాలన్న ఉద్దేశంతో బడి మానేశాను. పన్నెండేళ్లకే మా ఊళ్లో వలస కార్మికులతో కలిసి ఢిల్లీ వెళ్లాను. ఓ తోళ్ల పరిశ్రమలో పని దొరికింది. వాలెట్స్‌, పర్సులు తయారు చేయాలి. నెలంతా కష్టపడితే ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు’’ అంటూ చెప్పుకొచ్చిన జమీల్‌ పసితనంలోనే కష్టాలకు ఎదురీదడం మొదలుపెట్టాడు. 


తారలను చూడాలని... 

అయితే చిన్నప్పటి నుంచి జమీల్‌కు సినీతారలంటే పిచ్చి. వారిని చూడాలని తహతహలాడుతుండేవాడు. దాంతోపాటే మంచి ఉపాధి అవకాశాలుంటాయని కొన్నేళ్ల తరువాత ఢిల్లీ నుంచి ముంబయికి మకాం మార్చాడు. ‘‘ముంబయి రోడ్ల మీద, షాపింగ్‌ మాల్స్‌లో సినీ తారలు తిరుగుతుంటారని మా ఊళ్లో చెప్పుకునేవారు. ఆ నగరానికి వెళితే వాళ్లని చూడవచ్చనుకునేవాడిని. కానీ ఇక్కడకు వచ్చాక నా రూటే మారిపోయింది’’ అంటాడు జమీల్‌. తరువాత ముంబయి ధారవి లెదర్‌ మార్కెట్‌లో పనికి కుదిరాడు. ఆ ప్రాంతంలో నివసించే అత్యధిక పేద కుటుంబాలన్నింటికీ జీవనోపాధి కల్పించేది ఆ మార్కెట్టే. 


హీరోలతో మాట్లాడిస్తానని... 

తెలిసీ తెలియని వయసులోనే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకున్న జమీల్‌ ఉన్నదాంట్లోనే కొంత పొదుపు చేసుకున్నాడు. అంతా బానే ఉందనుకున్న సమయంలో ఓ కుదుపు! సినీ హీరోలకు పరిచయం చేస్తానని, అందుకు డబ్బు ఖర్చవుతుందని అక్కడ పనిచేసే ఓ కూలీ సోదరుడు జమీల్‌ను నమ్మించాడు. దాంతో దాచుకున్న 25 వేల రూపాయలు సదరు వ్యక్తి చేతిలో పెట్టాడు. అది తీసుకుని ఆ వ్యక్తి పరారయ్యాడు. అతడిని వెతుక్కుంటూ బెంగళూరు వరకు వెళ్లాడు జమీల్‌. కానీ ఎక్కడా అతడి ఆచూకీ దొరకలేదు. మోసపోయిన జమీల్‌కు తిరిగొచ్చేసరికి ఉన్న పని కూడా పోయింది. దిక్కుతోచక డ్రైవర్‌గా, వాచ్‌మన్‌గా, డోర్‌కీపర్‌గా రకరకాల పనులు చేశాడు. కొంతకాలానికి కోలుకున్నాడు. మళ్లీ కొద్ది కొద్దిగా పొదుపు మొదలుపెట్టాడు. 


కొనలేక కొత్త ప్రయోగం... 

కొన్నాళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన జమీల్‌ మళ్లీ తోళ్ల పరిశ్రమలో చేరాడు. మంచి డ్యాన్సర్‌ కావాలన్న పట్టుదలతో సాధన కూడా ప్రారంభించాడు. బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సందీప్‌ సొపార్కర్‌ దగ్గర శిక్షణకు చేరాడు. అతడి ఆసక్తిని గమనించిన సందీప్‌ ఫీజు తీసుకోలేదు. అయితే డ్యాన్స్‌ నేర్చుకోవాలన్నా, చేయాలన్నా షూ తప్పనిసరిగా ఉండాలి. అక్కడ నేర్చుకొనేవారు చాలామంది ఇతర దేశాల నుంచి తెప్పించుకొంటున్నారు. ఒక్కో జత కనీసం పదివేల రూపాయల ఖరీదు ఉంటుంది. అంత డబ్బు అతడివద్ద లేదు. అది తన శక్తికి మించిన పని అనుకున్నాడు. దాంతో అక్కడా ఇక్కడా చూసి అతడే షూ తయారు చేసుకున్నాడు. 


తారలకు తళుకులు... 

నిదానంగా జమీల్‌ పేరు బాలీవుడ్‌ సెలబ్రిటీల వరకు వెళ్లింది. అతడి షూస్‌కు క్రేజ్‌ పెరిగింది. కత్రినా కైఫ్‌, హృతిక్‌ రోషన్‌, ప్రియాంకా చోప్రా, ఆమిర్‌ఖాన్‌, కైలీ మినోగ్‌ వంటి స్టార్లంతా మనోడి షూస్‌కు ఫిదా అయిపోయారు. తమ సినిమాల్లో జమీల్‌ డిజైన్‌ చేసిన షూస్‌ మాత్రమే ధరించే సెలబ్రిటీలూ ఉన్నారు. ‘భయపడి ఆగిపోతే మన గమ్యాన్ని ఎన్నటికీ చేరుకోలేం. కష్టపడే తత్వం, సృజన ఉంటే భారత్‌లో అవకాశాలకు కొదవలేదు’ అంటున్న జమీల్‌ షా ఇప్పుడు చిన్నపాటి పారిశ్రామికవేత్తగా మారి రెండు చేతులా సంపాదిస్తున్నాడు.


భవిష్యత్తుకు పునాది... 

‘‘నేను చేసిన షూ ఇంపోర్టెడ్‌ షూస్‌ నాణ్యతకు దరిదాపుల్లో కూడా లేవు. అయితే షూ తయారీ సంస్థ ఒకటి నెలకొల్పాలన్న ఆలోచనకు ఊపిరి పోశాయి ఆ షూస్‌. ఎందుకంటే నాలాంటి వాళ్లు అనేకమంది ఉన్నారు. వారందరికీ ఈ తరహా బూట్లు అందుబాటు ధరలో ఇవ్వగలిగితే? డ్యాన్సింగ్‌ షూస్‌ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. మూమెంట్స్‌ చేసేటప్పుడు మంచి గ్రిప్‌ ఇవ్వాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సరైన షూస్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించాను. పోను పోను నైపుణ్యం పెరిగింది. షూస్‌ అనుకున్నవి అనుకున్నట్టు వచ్చాయి. 2005లో నా కథ మరో మలుపు తిరిగింది. సందీప్‌ సర్‌ శిష్యులే నా దగ్గర షూస్‌ కొనడం ప్రారంభించారు. అది నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి మంచి ఆదరణ లభించింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు జమీల్‌. 


రాత మార్చిన వర్క్‌షాప్‌... 

జమీల్‌కు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. అందుకు కారణం కూడా సినిమా హీరోలే! వారిలా తనూ డ్యాన్స్‌ చేయాలనుకునేవాడు. అనుకోకుండా తన ప్రాంతంలో ఓ రెండు రోజుల డ్యాన్స్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు. దానికి వెళ్లాలంటే అంత డబ్బు అతని దగ్గర లేదు. అయితే జమీల్‌ ఉత్సాహాన్ని గమనించిన అతను పనిచేసే కంపెనీ యజమాని ఆ డబ్బు కట్టాడు. వర్క్‌షాప్‌లో మెళకువలు నేర్చుకున్నాడు. అదే అతడిని తరువాత బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా మార్చింది. ఎన్నేళ్ల నుంచో కలలు కంటున్న సెలబ్రిటీలను కలిసేందుకు మార్గమైంది. 


Updated Date - 2021-02-17T08:43:20+05:30 IST