మేం వయసుకు వచ్చాం...

ABN , First Publish Date - 2021-01-10T16:30:00+05:30 IST

అరవై ఏళ్లు రాగానే... కాశీకి పోదాము రామాహరీ అని పాటలు పాడుకోవడం మన దేశంలో మామూలే.

మేం వయసుకు వచ్చాం...

అరవై ఏళ్లు రాగానే... కాశీకి పోదాము రామాహరీ అని పాటలు పాడుకోవడం మన దేశంలో మామూలే. కానీ చైనా, జపాన్‌, పశ్చిమ దేశాల్లో ‘అదిరేటి డ్రస్సు మేం వేస్తే... బెదిరేటి లుక్‌ మీరిస్తే... దఢ’ అనే పాటలు పాడతారట. ఎందుకంటే జీవించి ఉన్నన్ని రోజులూ ఆస్వాదించాల్సిందే అన్నది అక్కడి కాన్సెప్ట్‌. అందుకే పాతికేళ్ల వయసులో ఉన్న హుషారే డెబ్భై ఏళ్లలో కొనసాగించాలని భావిస్తుంటారట.  


ట్రెండ్‌కు తగినట్టుగా ఉత్పత్తి దారులు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ‘ఫ్యాషన్‌ గ్రాండ్‌మాస్‌’, ‘గ్రానీ మోడల్స్‌’, ‘గ్రాండ్‌డాడ్స్‌’ పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీళ్లని చూసి మిగతా వారు స్పూర్తి పొందుతారనే ఆలోచన లేకపోలేదు. ఆ వయసు వాళ్లు తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న దూరాలోచన కూడా ఉంది. చైనాలో నేడు 88 ఏళ్ల ఓ బామ్మ ఫ్యాషన్‌ ఐకాన్‌ అంటే నమ్మగలరా? ఆమె ‘గ్రానీ మోడల్స్‌’ క్యాట్‌ వాక్‌ చేస్తే కెమెరాలు ఆగకుండా క్లిక్‌ మంటూనే ఉంటాయి.


చాలా మంది అరవై ఏళ్లు పైబడ్డాక మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వీళ్లలో కొంత మంది డైరీ ఫుల్‌ బిజీ.  ఫ్యాషన్‌ షూట్ల కోసం రోజుకి వంద డ్రస్సులు మారుస్తుంటారట. కాలేజీ రోజుల్లో అయితే లిప్‌స్టిక్‌ తెలియదు, మస్కారా తెలియదంటూ వీళ్లలో చాలా మంది గుర్తు చేసుకుంటారు. ఉదయం ఏడు గంటలకు షూటింగ్‌కు వెళ్లి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వస్తున్నారు. ఈ వయసులో కూడా అంత బిజీ జీవితం. వయసులో ఉన్నప్పుడు అంత త్వరగా అవకాశాలు రాకపోవడం, డబ్బు పరిమితంగా ఉండడం, బాధ్యతల వల్ల... చేయాలని అనుకున్నవి చేయకుండా ఉండిపోతారు చాలా మంది. రిటైర్మెంట్‌ తరవాత, బాధ్యతలు తీరడంతో వాటిని కొంగొత్తగా మొదలుపెడుతున్నారు సీనియర్‌ సిటిజన్స్‌. అందులో సంగీతం, పియానో నేర్చుకోవడం, డాన్స్‌ క్లాసులకు వెళ్లడం లాంటి వాటితో పాటు ఫ్యాషన్‌, మోడలింగ్‌, ఎండోర్స్‌మెంట్లు కూడా చేరాయి. 

Updated Date - 2021-01-10T16:30:00+05:30 IST