అదనపు శరీర భాగాలతో పుట్టిన పాప.. ఆపరేషన్ చేయగా..

ABN , First Publish Date - 2021-08-01T00:11:00+05:30 IST

సౌదీ అరేబియాలోని వైద్యులు అదనపు శరీర భాగాలతో జన్మించిన ఐషా అనే పాపకు ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు.

అదనపు శరీర భాగాలతో పుట్టిన పాప.. ఆపరేషన్ చేయగా..

రియాద్: సౌదీ అరేబియాలోని వైద్యులు అదనపు శరీర భాగాలతో జన్మించిన ఐషా అనే పాపకు ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. 25 మంది వైద్యులు దాదాపు 8 గంటల పాటు శ్రమించి అదనపు శరీర భాగాలను తొలగించారు. ఇది తమ విజయవంతమైన 50వ ఆపరేషన్ అని వైద్యవిభాగం హెడ్ డాక్టర్ అబ్దుల్లా ఆనందం వ్యక్తం చేశారు. ఆపరేషన్ జరిగిన కొద్ది సమయం తర్వాత పాప మేల్కొందని, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు చెప్పారు.


అదనపు శరీర భాగాలతో జన్మించే వారిని పరాధీన కవలలు(ప్యారాసైటిక్ ట్విన్స్) అని పిలుస్తుంటారు. తెలంగాణకు చెందిన వీణా-వాణీల గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ విధంగా జన్మించిన వారిని అవిభాజ్య కవలలు(కన్‌జాయిన్డ్ ట్విన్స్) అని పిలుస్తుంటారు. అయితే పరాధీన కవలలు అంటే ఒక బిడ్డ మరో బిడ్డపై ఆధారపడి జీవించడమని చెప్పవచ్చు. 


వివరంగా చెప్పాలంటే.. అవిభాజ్య కవలలు అతుక్కుని పుట్టినప్పటికి, ఊపిరి తీసుకోవడంలో కానీ, ఆలోచించడంలో కానీ ఒకరి సహాయాన్ని మరొకరు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వారి శరీరాలు మాత్రమే అతుక్కుని ఉంటాయి. పరాధీన కవలల విషయానికి వస్తే.. కవలల్లో ఒక బిడ్డ మాత్రమే పూర్తిగా పుడుతుంది. ఆ బిడ్డకే అదనంగా కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు రావడం వంటివి జరుగుతాయి. అంటే.. ఇక్కడ ఒక బిడ్డ మరో బిడ్డపై ఆధారపడి జీవించాల్సి ఉంటుంది.


తల్లి గర్భంలో ఉన్నప్పుడు కవలలిద్దరూ వేరు వేరు కాకపోవడం వల్లే ఇలా జరుగుతుంటుంది. ఇలా జన్మించిన కవలలను పరాధీన కవలలు అంటారు. అయితే కవలలు వేరు వేరుగా పుట్టకుండా ఇలా ఒక బిడ్డకే అదనపు చేతులు, కాళ్లు వస్తే వైద్యులు ఆపరేషన్ చేసి ఒక బిడ్డను కాపాడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇటువంటి ఆపరేషన్లు చేస్తున్న ఆస్పత్రులు ఉన్నాయి.

Updated Date - 2021-08-01T00:11:00+05:30 IST