‘దళిత సాధికారత’ సార్థకమయ్యేనా?

ABN , First Publish Date - 2021-06-30T14:22:23+05:30 IST

ఐదుదశాబ్దాల క్రితం గల్ఫ్ దేశాలకు జీవనోసాధి కోసం వచ్చిన వారిలో ముస్లింలతో పాటు దళితులు కూడా ముందు వరుసలో ఉన్నారు.

‘దళిత సాధికారత’ సార్థకమయ్యేనా?

ఐదుదశాబ్దాల క్రితం గల్ఫ్ దేశాలకు జీవనోసాధి కోసం వచ్చిన వారిలో ముస్లింలతో పాటు దళితులు కూడా ముందు వరుసలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల మాలలు, ఉత్తర తెలంగాణ జిల్లాల మాదిగలు ఈ వలస కార్మికులలో పెద్ద సంఖ్యలో ఉండేవారు. అప్పట్లో భారత్ నుంచి విదేశాలకు వెళ్ళడానికి అవసరమైన పాస్‌పోర్టు పొందడం అనేది చాలా ప్రయాసతో కూడిన వ్యవహారం. జిల్లా కలెక్టర్ల సిఫారసులతో మద్రాస్ (నేటి చెన్నై)కు వెళ్ళి పాస్‌పోర్టు పొందడం దళితులకు అప్పట్లో తమ స్థాయికి మించిన పని. అయితే పాస్‌పోర్టులు పొందిన ప్రతి ఒక్కరు ఇరాక్‌తో పాటు అన్ని గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు పొందారు.


అప్పట్లో ఒకవైపు ఇందిరాగాంధీ చేపట్టిన నివేశన స్థలాలు, సాగుభూమి పంపిణీ, మరోవైపు మస్కట్ ఉద్యోగం దళితుల అభ్యున్నతికి విశేషంగా తోడ్పడ్డాయి. ఒమాన్ రాజధాని మస్కట్ నాడు దళితుల గమ్యంగా ఉండేది. తెలంగాణలోని కొన్ని గ్రామాలలో వీరిని మస్కట్ మాదిగలుగా కూడా పిలిచేవారు. ఎడారి ఉపాధి ఆశ, అవకాశాలు దళితులకు ఆర్థిక స్వావలంబన సమకూర్చాయి. 


అయినా పెట్రోదినార్ల సంపాదనతో స్వదేశంలో ఇతర సామాజికవర్గాలు అభివృద్ధి చెందినట్లుగా దళితులు అభివృద్ధి చెందలేదనేది ఒక చేదు నిజం. ఇతరులు తమ అభివృద్ధికి తామే బాట వేసుకున్నట్లుగా దళితులు వేసుకోలేకపోయారు. ఇతర సామాజికవర్గాల ప్రవాసులలో అత్యధికులు కార్మికులే అయినా ఇతర రంగాలలో, వృత్తులలో కూడ అనేకమంది విస్తరించారు. దళితులు ఇప్పటికీ కార్మికులుగా మాత్రమే ఉన్నారు. ఇతర వృత్తులలో వారు దాదాపు లేరని చెప్పవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టడీసర్కిళ్ళ ఆలంబనతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే దళిత యువత ఎందుకో గానీ ఈ ఎడారిదేశాలలో వృత్తిపరమైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. వర్గాలు, జాతులకు అతీతంగా ప్రతిభకు పట్టం కట్టే గల్ఫ్ దేశాలలోని ఉపాధి అవకాశాలను ఇతర సామాజికుల వలే దళితులు ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? ఇది మనం లోతుగా పరిశీలించవలసిన విషయం. 


గల్ఫ్ దేశాలలోని స్థానిక చట్టాల దృష్ట్యా జైళ్ళలోని విదేశీయులు సహజంగా సవాలక్ష ఇబ్బందులకు గురవుతారు. ఈ అభాగ్యులకు బయటి నుంచి– అది గల్ఫ్ కావచ్చు, లేదా స్వదేశంలోని బంధుమిత్రులు కావచ్చు వీలయిన విధంగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే దళితులైన ఖైదీలకు పెద్దగా సహాయం లభించడం లేదు. కేవలం మూడు లక్షల రూపాయలను దియాగా చెల్లించలేక దరూరి బుచ్చన్న అనే దళితుడు ఇరవై సంవత్సరాలుగా యు.ఏ.ఇ.లోని జైలులో మగ్గుతున్నాడు. ఈ విషయాన్ని దళితసంఘాల ప్రతినిధులు, కొందరు మేధావుల దృష్టికి తీసుకువెళ్ళినా ఏ ఒక్కరు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన బుచ్చన్న కుటుంబం ఎస్సీ కమిషన్‌తో సహా నాయకులు, అధికారుల చుట్టూ తిరిగి అలిసి ఆశలు వదులుకుంది. జైలులో కునారిల్లుతున్న ఆ అభాగ్యుడి దయనీయ స్థితికి కారణాలు ఏమిటి? ప్రభుత్వమూ, సమాజమూ ఎందుకు పట్టించుకోవడం లేదు? దళిత సాధికారిత గురించి మాట్లాడే నాయకులు ముందుగా తమ చిత్తశుద్ధి గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలి.


ఈ సందర్భంగా ఒక విషయం ప్రస్తావించాలి. దశాబ్దాల క్రితం సౌదీ అరేబియాలో అత్యాధునిక సైనిక ఆసుపత్రిలో పని చేయడానికి అర్హులైన వైద్యుల కోసం సౌదీ ప్రభుత్వం బ్రిటన్‌లో ఎంపిక పరీక్షలు నిర్వహించింది. యువ వైద్యురాలయిన డాక్టర్ జె.గీతారెడ్డి ఎంపికయ్యారు. (సౌదీ పర్యటనకు ఇందిరాగాంధీ వెంట వచ్చిన రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగి వచ్చి రాజకీయాలలోకి ప్రవేశించారు). డాక్టర్ గీతారెడ్డి తన ప్రతిభాపాటవాలతో ఎంపికయ్యారు గానీ రిజర్వేషన్ సౌలభ్యంతో కాదు. ప్రతిభను తీర్చిదిద్దేందుకు, బుచ్చన్న లాంటి అభాగ్యుడికి అండగా నిలబడే సమాజాన్ని సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత సాధికారత, స్వావలంబన పథకం తోడ్పడి తీరాలి. అప్పుడే దానికి సార్థకత. అలా కాని పక్షంలో అది కూడా ఒక ‘రైతుబంధు’గా మిగిలిపోతుంది.


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి


Updated Date - 2021-06-30T14:22:23+05:30 IST