ప్రవాస పంజాబీల ప్రాబల్యం
ABN , First Publish Date - 2021-01-06T14:29:48+05:30 IST
రైతుల ఆందోళనపై ప్రవాసులు విదేశీ ప్రభుత్వాల ద్వారా భారత సర్కారుపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయడం బాధకరం. నరేంద్ర మోదీ తాత్కాలికం కానీ మన పురానవ భారతావని మాత్రం శాశ్వతమైనది.
రైతుల ఆందోళనపై ప్రవాసులు విదేశీ ప్రభుత్వాల ద్వారా భారత సర్కారుపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయడం బాధకరం. నరేంద్ర మోదీ తాత్కాలికం కానీ మన పురానవ భారతావని మాత్రం శాశ్వతమైనది. మాతృదేశ సార్వభౌమత్వాన్ని సంరక్షించడం ప్రతి దేశీయుడి, ప్రతి ప్రవాసుడి కర్తవ్యం.
‘పంజాబ్ దా పుత్తర్’ అని పంజాబీలు గర్వంగా చెప్పుకుంటారు. బతుకుతెరువు రీత్యా తాము ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ మాతృ సంస్కృతి, మాతృభూమి గురించి పరితపించే భారతీయులలో ప్రప్రథములు పంజాబీలు. పుట్టిన గడ్డను అమితంగా ప్రేమిస్తారు. కన్న ఊరును మరచిపోరు. మరి ఈ దేశభక్తి ప్రపూరితులు తమ జన్మభూమిని, అందునా స్వజనులను ప్రభావితం చేసే సకల సామాజిక, ఆర్థికాంశాలపై స్పందించడంలోనూ ఇతరుల కంటే ముందుండడంలో ఆశ్చర్యమేముంది?
పంజాబ్ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం ఎంత ప్రధాన భూమిక వహిస్తుందో, ప్రవాసులు స్వదేశంలోని కుటుంబాలకు పంపే డబ్బు కూడా అంతే ముఖ్యపాత్ర వహిస్తోంది. కెనడా, బ్రిటన్, అమెరికా మొదలైన పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి పంజాబీ సిక్కులు ప్రాధాన్యం ఇవ్వడం కద్దు. అయితే కొంత కాలంగా వారు గల్ఫ్ దేశాలకూ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పంజాబ్‌లో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడమే వారు గల్ఫ్ దేశాల బాట పట్టడానికి ఒక ప్రధాన కారణం.
కెనడాలో వ్యాపారాలు చేసినా, అరబ్ దేశాలలో ఉద్యోగాలు చేసినా పంజాబీల ప్రాణమంతా తమ ‘పిండ్’ (గ్రామం)పై ఉంటుంది. మరి మాతృభూమిలో మద్దతు ధరల కోసం రైతుల మహోధృత పోరాటానికి ఈ ప్రవాసులు సహానుభూతితో స్పందించకుండా ఎలా ఉంటారు? గల్ఫ్ దేశాలలో నిరసన కార్యక్రమాలకు ఎలాంటి అవకాశం ఉండదు. ప్రజాస్వామ్య దేశాలైన కెనడా, బ్రిటన్, అమెరికాలలో ఉన్న ప్రవాస పంజాబీ సిక్కులు శీఘ్రగతిన క్రియాశీలురు అయ్యారు. తమ ఆతిథేయి దేశాల ప్రభుత్వాల ద్వారా ఢిల్లీ శివారులలో మోహరించిన రైతుల విన్నపాన్ని పరిశీలించవల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ప్రవాస సిక్కులకు మద్దతుగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఒక అడుగు ముందుకు వేశారు. భారతీయ రైతుల సమంజసమైన ఆందోళనకు కెనడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. దౌత్య మర్యాదలను ఉల్లంఘించిన ఈ ప్రకటన సహజంగానే న్యూఢిల్లీలో పెద్ద దుమారం రేపింది. కెనడాలో సంఖ్యాపరంగానూ, సంపదలపరంగానూ ప్రభావశీలురుగా ఉన్న సిక్కుల ఓట్లను కైవసం చేసుకునేందుకే ట్రూడో ఆ ప్రకటన చేశారనేది నిర్వివాదాంశం. అంతకు ముందు కూడా కెనడా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న సిక్కుల సంఖ్య భారత ప్రభుత్వంలో ఉన్న సిక్కు మంత్రుల సంఖ్య కంటే అధికమని ట్రూడో గతంలో వ్యాఖ్యానించారు. కెనడా ప్రతిపక్ష నేత ఎరిన్ ఊటూల్ తమ ప్రధానమంత్రితో గొంతు కలిపి ‘ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి ఒక్కరి హక్కు’ అంటూ ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. బ్రిటన్‌లో కూడా లేబర్ పార్టీ నాయకుడు తన్మన్జీత్ సింగ్ ఆధ్వర్యంలో 36 మంది పార్లమెంటు సభ్యులు భారతీయ రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావల్సిందిగా బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా అమెరికాలో కూడ కాంగ్రెస్ సభ్యులు కొందరు పంజాబీ రైతులకు బాసటగా నిలిచారు.
విదేశాలలో పుట్టి పెరిగినప్పటికి అత్యంత విలక్షణమైన భారతీయ సంస్కృతిని ఇప్పటికీ కొనసాగిస్తుండడం ముదావహమే. అయితే విదేశీ ప్రభుత్వాల ద్వారా భారత సర్కారుపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం మాత్రం బాధాకరం. అవి, ఎంతమాత్రం వాంఛనీయం కాదు. విదేశీ ప్రభుత్వాల ఒత్తిళ్ళ నుంచి మాతృదేశ సార్వభౌమత్వాన్ని సంరక్షించడం ప్రతి దేశీయుడి, ప్రతి ప్రవాసుడి కర్తవ్యం.
మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి