భారత్ ‘ప్రాణ’ స్నేహితులు

ABN , First Publish Date - 2021-05-05T13:21:29+05:30 IST

భారతదేశంలో ప్రాణవాయువు సంక్షోభం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను మంటగల్పుతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా ఆసేతు హిమాచలం కరాళ నృత్యం చేస్తోందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది.

భారత్ ‘ప్రాణ’ స్నేహితులు

భారతదేశంలో ప్రాణవాయువు సంక్షోభం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను మంటగల్పుతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా ఆసేతు హిమాచలం కరాళ నృత్యం చేస్తోందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. ప్రపంచ అగ్రగామి ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తున్న తరుణంలో కరోనా వల్ల ఉత్పన్నమైన దయనీయ పరిస్థితులు భారత్‌కు ఇబ్బంది కల్గిస్తున్నాయి. 


దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఆక్సిజన్ కొరతపై అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న వార్తలు భారత ప్రభుత్వానికి సహజంగానే అగ్రహం కల్గిస్తున్నాయి. నష్టనివారణ చర్యలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉపక్రమించింది. విదేశీ పత్రికలలో వస్తున్న వార్తలపై భారతీయ ఎంబసీలు అప్పుడప్పుడు వివరణలు ఇస్తున్నాయి. 


న్యూఢిల్లీ లోని విదేశీ దౌత్యవేత్తలకు, ప్రాణవాయువు కొరతపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ వివరణ ఇస్తూ ప్రభుత్వాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తుండగా మరో వైపు తమకు ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటూ కొన్ని విదేశీ రాయబార కార్యాలయాలు స్వచ్ఛంద సేవా సంస్థలను కోరుతున్నాయి. తద్వారా భారతీయ అధికారులపై తమకు విశ్వాసం లేదని విదేశీ దౌత్యవేత్తలు పరోక్షంగా సూచిస్తున్నారు. స్వదేశీ ప్రసార మాధ్యమాలు, పత్రికలు ఆశించిన రీతిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపలేకపోయినప్పటికి అంతర్జాతీయ మీడియా మాత్రం అనేక విమర్శనాత్మక వార్తలను వెలువరించింది. 


విపత్కర పరిస్థితులలో విదేశాల నుంచి సహాయం స్వీకరిస్తే, దేశం స్థాయి దిగజారుతుందని భారత ప్రభుత్వం భావిస్తోంది. కనుకనే విపత్తుల వేళ విదేశీ సహాయంపై మన్మోహాన్ సింగ్ హయాం నుంచి కొన్ని ఆంక్షలు అమలులో ఉన్నాయి. దీంతో గతంలో జాతీయ విపత్తు పరిస్థితుల సందర్భంగా విదేశీ ప్రభుత్వాలు సహాయమందించడానికి ముందుకు వచ్చినా భారత్ స్వీకరించలేదు. 2018లో వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు గల్ఫ్ దేశాలు ముందుకు వచ్చినా కేంద్రం అడ్డుకోవడంతో పెద్ద దుమారం చెలరేగింది. అలాంటిది ఇప్పుడు ప్రాణవాయువు, దాన్ని నిల్వ చేసే ట్యాంకర్ల కోసం గల్ఫ్ దేశాల వైపు భారత్ ఆతృతగా సహాయం కోసం ఎదురు చూస్తోంది. వేల కోట్ల రూపాయల సహజవాయువు దిగుమతి విషయమై కొద్ది నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఖతర్ రాజు శేఖ్ తమీం బిన్ హమద్‌తో మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం అదే ఖతర్ రాజు మోదీకి ఫోన్ చేసి ప్రాణవాయువు గూర్చి ఆందోళన చెందవద్దని భరోసా చెప్పారు. వెన్వెంటనే సహాయంగా ప్రాణవాయువు, దాన్ని నిల్వ చేసే ట్యాంకర్లను పంపించారు. బహ్రెయిన్, కువైత్ దేశాలు కూడా భారత్‌కు భారీ పరిమాణంలో ఆమ్లజనిని పంపించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలలోని ప్రైవేటుసంస్థల నుంచి అదానీ గ్రూప్ ఆక్సిజన్‌ను కొనుగోలు చేయగా భారతీయ నౌకదళం నౌకలు, వైమానిక దళం విమానాలు వాటిని స్వదేశానికి తరలించాయి. ఆక్సిజన్ నిండి ఉన్న ట్యాంకులను విమానాల ద్వారా తరలించడంలో సమస్యల ఉన్నందున ఖాళీ ట్యాంకులను విమానాలలో తరలించి నౌకల ద్వారా నిండిన ట్యాంకులను తరలించారు. విశాఖపట్టణం నౌకదళ స్థావరానికి చెందిన జలశ్వతో సహా మరో ఆరు యుద్ధనౌకలు ప్రస్తుతం ప్రాణవాయువు ట్యాంకర్లను రవాణా చేసే ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నాయి. రక్షణ మంత్రిత్వశాఖ ఇంటా, బయటా రవాణా చూస్తుండగా, పంపిణీ, సరఫరా పని తీరును హోం మంత్రిత్వశాఖ పర్యవేక్షించడమే కాకుండా ఆక్సిజన్‌ను సరైన రీతిలో వినియోగించాలని కోరుతున్నది. అంబానీ, ఆదానీ, టాటాలు విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు, కానీ వీటిలో కొన్ని సంస్థలు ఎక్కడ, ఎవరికి ప్రాణవాయువు సరఫరా చేశాయో తెలియదు. 


భారత్‌లో ఆక్సిజన్ కొరతను తీర్చడానికి అవసరమైన 50 వేల మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును దిగుమతి చేసుకోవడానికి వివిధ దేశాలలోని భారతీయ రాయబారులు ప్రయత్నించి చాలవరకు సఫలీకృతులయ్యారు, ఆక్సిజన్ కంటే ఎక్కువగా దాన్ని ద్రవరూపంలో అధిక పరిమాణంలో నిల్వ చేసే క్రయోజన్ రకం ట్యాంకర్లను విదేశాల నుంచి కొనుగోలు చేయడానికి భారతీయ ఎంబసీలు ప్రయత్నిస్తున్నాయి.


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2021-05-05T13:21:29+05:30 IST