సోమాలియా సరసకు చేరాం!
ABN , First Publish Date - 2021-10-20T13:25:50+05:30 IST
ఆహారధాన్యాల ఉత్పత్తి లేని కువైత్ ప్రపంచ ఆకలి సూచీలో ఐదవ స్థానంలో ఉంది.
ఆహారధాన్యాల ఉత్పత్తి లేని కువైత్ ప్రపంచ ఆకలి సూచీలో ఐదవ స్థానంలో ఉంది. ఇతర గల్ఫ్ దేశాలూ ఆకలి సూచీలో ముందు వరుసలో ఉండగా, సస్యశ్యామల భూమి, ఎనిమిది లక్షల టన్నుల ఆహారధాన్యాలను ముందస్తుగా నిల్వ చేసుకుంటున్న భారతదేశం మాత్రం ప్రపంచ ఆకలి సూచీలో అడుగు భాగాన ఉంది!
ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ అగ్రగామి ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవిస్తోంది. అయినా ఈ నూతన భారతంలో చిన్నారులు ఆకలితో నకనకలాడుతున్నారనేది ఒక కఠోరసత్యం. పేదరికం, అనారోగ్యానికి తోడుగా అవగాహనారాహిత్యం, సామాజిక, ఆర్థిక పరిస్థితులే ఈ దైన్యస్థితికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. దీర్ఘకాలంగా పౌష్టికాహార లేమి కారణాన చిన్నారులలో అనారోగ్య దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. భారత్‌లో ఐదేళ్ల వయస్సు లోపు మరణిస్తున్న చిన్నారులలో 69 శాతం మంది పౌష్టికాహార లోపంతో మరణిస్తున్నారనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. విదేశీ విపణిలో భారతీయ పెట్టుబడుల గూర్చి మాట్లాడుతున్న మనం అంగన్‌వాడీ కేంద్రాలలో కోడిగుడ్ల లక్ష్యసాధనకు మాత్రం ఇంకా సుదూరంలో ఉన్నామనే వాస్తవాన్ని విస్మరిస్తున్నాం. ప్రపంచంలో కెల్లా అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే భారత్‌లో పేద చిన్నారులకు పాలు అందడం ఒక కలగానే మిగిలిపోయింది.
‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ (ప్రపంచ ఆకలిసూచీ)లో 116 దేశాలలో భారత్ 101వ స్థానంలో ఉండడం మన డొల్లతనాన్ని ప్రతిబింబిస్తోంది. కొంతకాలంగా మన స్థానం ఈ జాబితాలో, ప్రపంచంలోని అత్యంత పేదరిక దేశాల సరసన చేరడం బాధాకరమైన విషయం. విదేశీసంస్థలు శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వేను భారతదేశం తోసిపుచ్చుతున్నప్పటికీ, ఇదే అంశంలో సాక్షాత్తు మన సర్కారు సంస్థల నివేదికలు కూడా అదే కఠోర వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయనే విషయాన్ని మరిచిపోకూడదు.
ఖమ్మం జిల్లాలో చెంచులు కావచ్చు లేదా హైదరాబాద్ మహానగరంలోని మురికి వాడలు కావచ్చు, పౌష్టికాహార లోపం తీవ్రస్థాయిలో ఉందనే వాస్తవాన్ని ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పిజ్జాలు, బర్గర్లు, కబాబ్‌ల భారీ విక్రయాల మధ్య మద్యం ఏరులుగా పారుతున్న తెలుగు నాట.. కోడిగుడ్డు, పాలు కరువై అయిదేళ్ళలోపు చిన్నారుల భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకొంటున్నాయనే నిపుణుల అభిప్రాయాన్ని పట్టించుకునే తీరిక పాలకులకు లేదు. చిన్నారులలో పౌష్టికాహార లోపం సమస్య ఉన్న 17 రాష్ట్రాలలోని మొదటి అయిదింటిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో పౌష్టికాహార లోపం కారణాన అయిదేళ్ళలోపు చిన్నారుల బరువులో 47 శాతం, వయస్సుకు అనుగుణంగా పెరగాల్సిన ఎత్తులో 33 శాతం వెనుకబడి ఉన్నట్లుగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది.
దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, అస్సోం లలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే లక్షమందికి పైగా చిన్నారుల ఆకలిచావులు సంభవించగా, పాలకులు మాత్రం పేర్ల మార్పిడి యజ్ఞంలో నిమగ్నమై ఉన్నారు. అన్ని రంగాలలో మాదిరిగానే పోషకాహారం లోపంలో కూడా అణగారిన వర్గానికి సంబంధించిన పిల్లలు అధికస్థాయిలో వెనుకబడి ఉన్నారు. ఇతర కులాల వారితో పోల్చితే దళిత, గిరిజన వర్గాల చిన్నారులు 20 శాతం వరకు అధికంగా ఉన్నారు.
ఆకలి, పౌష్టికాహార లేమి సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఈ సమస్య పరిష్కారంలో ప్రభుత్వాలు తమకు తోచిన విధంగా కృషి చేస్తున్నప్పటికీ ఆ కృషిలో చిత్తశుద్ధి లోపించిందని చెప్పవచ్చు.
ఇప్పటికే ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన పాలకులు మున్ముందు సమీకృత బాలల అభివృద్ధి సేవల పథకం, మధ్యాహ్న భోజన పథకం, గర్భిణుల సంరక్షణ, పౌష్టికాహార సరఫరా మొదలైన వ్యవస్థలను కూడా ప్రైవేటీకరణ చేసి తమ గురుతర బాధ్యతల నుంచి వైదొలిగినా అశ్చర్యపడవల్సిన అవసరం లేదు. ‘ప్రపంచ ఆకలిసూచీ’లో పేద యెమన్, సోమాలియా తదితర ఆఫ్రికా దేశాల సరసన భారత్ పేరు ఉండడం అమిత ఆవేదన కలిగిస్తోంది.
మొహమ్మద్ ఇర్ఫాన్,
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి