మత్తులో తూలుతున్న యువత

ABN , First Publish Date - 2021-04-07T13:03:03+05:30 IST

ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో మాదకద్రవ్యాల వినియోగం తక్కువగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో భారత్ క్రమేణా కీలక పాత్ర వహిస్తోంది. సహజంగానే ఇది ఆందోళన కలిగించే అంశం.

మత్తులో తూలుతున్న యువత

ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో మాదకద్రవ్యాల వినియోగం తక్కువగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో భారత్ క్రమేణా కీలక పాత్ర వహిస్తోంది. సహజంగానే ఇది ఆందోళన కలిగించే అంశం. విశ్వవ్యాప్తంగా ఉత్పత్తి అవుతోన్న హెరాయిన్‌లో 95శాతం థాయిలాండ్, బర్మా, ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్ లలోనే ఉత్పత్తి అవుతోంది. ఈ దేశాల మధ్య ఉన్న భారత్‌కు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం కత్తి మీద సాముగా ఉంది.


మాదక ద్రవ్యాల అక్రమరవాణాకు భౌగోళికంగా భారత్ అనువుగా ఉంది. దీంతో అంతర్జాతీయ ముఠాలు భారత్‌పై కన్నేసి ఉంచాయి. భారత్ నుంచి విదేశాలకు నిత్యం రాకపోకలు సాగించే ప్రవాసులను పావులుగా వాడుకోవడానికి ఆ మాఫియా ముఠాలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులతో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసుల ద్వారా వారికే తెలియకుండా మాదక ద్రవ్యాలను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లుగా ఇప్పటి వరకు బహిర్గతమైన కేసుల ద్వారా తెలుస్తోంది.


మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరంపై గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా కువైత్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రవాసులు అధిక సంఖ్యలో జైళ్ళలో మగ్గుతున్నారు. కువైత్ కేంద్ర కారాగారంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. హెరాయిన్ కంటే స్వల్ప ప్రభావం కలిగిన ఔషధ మందులు, గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డ వారు యు.ఏ.ఇ., ఖతర్ తదితర దేశాలలోని జైళ్ళలో మగ్గుతున్నారు. దురదృష్టవశాత్తు వీరి నేరాల విషయమై స్వదేశంలోని పోలీసులు లోతుగా విచారణ చేయలేకపోతున్నారు. కొన్ని కేసులలో దర్యాప్తునకు సహకరించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. మరి కొన్ని కేసులలో స్మగ్లింగ్ ముఠాలు గల్ఫ్ జైళ్ళలో మగ్గుతున్న వారి కుటుంబ సభ్యులకు నెలకు కొంత మొత్తం పారితోషికం ఇస్తున్నారు. దీంతో సంబంధిత ఖైదీల కుటుంబాలు కూడా దర్యాప్తునకు సహకరించడం లేదు.


ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావించాలి. 2019లో సంభవించిన సంఘటన ఇది. కొత్తగా పెళ్ళయిన ఒక జంటను, వధువు మేనత్త స్వయంగా తన ఖర్చుపై హానీమూన్ నిమిత్తం ఖతర్‌కు పంపింది. ఆ వధూవరుల బ్యాగులో వారికి తెలియకుండా మాదక ద్రవ్యాలను పంపించగా ఖతర్ విమానాశ్రయంలో బ్యాగేజి పరిశీలన అనంతరం ఆ జంటను అరెస్ట్ చేశారు. ఖతర్ న్యాయస్ధానం ఆ అమాయక జంటకు సమారు కోటిన్నర రూపాయల జరిమానా, పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హానీమూన్ నుంచి వారు ఎన్నాళ్ళకూ తిరిగిరాకపోవడంతో స్వదేశంలో తల్లిదండ్రులు, అత్తమామలు తీవ్రంగా కలవరపడసాగారు. ఒక రోజు ఖతర్ నుంచి ఒక మహిళ ముంబైలోని వధువు తండ్రికి ఫోన్ చేసి మీ కూతురు, అల్లుడు డ్రగ్స్ కేసులో పట్టుబడి జైళ్ళో ఉన్నారని చెప్పింది. హతాశుడైన ఆ తండ్రి ఖతర్‌కు వచ్చి ఏడాదిన్నర పాటు ఒక హోటల్‌లో బస చేసి జరిగిన ఘోరం వివరాలు తెలుసుకున్నాడు. ముంబైలో తన కుమార్తె, అల్లుడి చేతికి బ్యాగేజి ఇచ్చిన వ్యక్తులపై కేసు నమోదయి, సరైన దిశగా విచారణ జరిగినట్లుగా ఖతర్ న్యాయస్ధానం భావిస్తే మాత్రమే జంట విడుదలకు ఆవకాశం ఉన్నట్లుగా ఆ దేశ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తండ్రి భారత్‌కు తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్ మొదలు ప్రపధానమంత్రి కార్యాలయం దాకా 17 ప్రభుత్వ శాఖల చుట్టూ తిరిగాడు. మరాఠీ నుంచి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుంచి అరబ్బి భాషలోకి మహారాష్ట్ర పోలీసుల ఎఫ్.ఐ.ఆర్., పంచనామాలను అనువాదం చేయించేందుకు లక్షలాది రూపాయలను ఆ కుటుంబం ఖర్చు చేసింది.


కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్.సి.బి. విచారణ చేసి బ్యాగేజి ఇచ్చిన మేనత్తతో సహా ఆరుగురిని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసినట్లుగా ఇచ్చిన నివేదికను దౌత్యవర్గాల ద్వారా ఖతర్‌కు సమర్పించిన అనంతరం అతి అరుదైన కేసుగా ఖతర్ సుప్రీంకోర్టు కేసును పునఃసమీక్షించి జంటను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ రకమైన ప్రయత్నం అందరికి సాధ్యం కాదు కదా. 


విదేశాలకు అక్రమ రవాణా అటుంచి స్వదేశంలోనూ మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోతోంది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా పలు నగరాలలో యువతీయువకులు మాదక ద్రవ్యాల వ్యసనానికి గురవుతున్నారు. గల్ఫ్‌లో పుట్టిపెరిగిన కొంత మంది పిల్లలను వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యాభ్యాసానికై హైదరాబాద్‌కు పంపించడానికి డ్రగ్స్ కారణంగా భయపడుతున్నారు. 


మాదక ద్రవ్యాలన్నింటిలోనూ ఖరీదైన హెరాయిన్‌ను భారతదేశంలో ప్రతి రోజు సగటున 28 లక్షల మంది ఒక టన్ను మేరకు వినియోగిస్తున్నట్టు ఒక సర్వేలో వెల్లడయింది. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని తెలిపింది. దీన్ని బట్టి మాదక ద్రవ్యాల వినియోగం ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క హెరాయిన్ ద్వారా భారత్‌లోకి ప్రతి సంవత్సరం 1.44 లక్షల కోట్ల రూపాయల సొమ్ము మనీలాండరింగ్ ద్వారా వస్తుందని కూడా కేంద్రప్రభుత్వ అధ్వర్యంలోని జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్ధ (యన్.సి.బి) అంచనా వేసింది. ఆరంభంలోనే ఈ అక్రమాన్ని నిర్మూలించడానికి సమగ్ర చర్యలు తీసుకోకపోతే తెలుగు రాష్ట్రాలకు, పంజాబ్‌కు తేడా లేకుండాపోతుంది.


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2021-04-07T13:03:03+05:30 IST