భారత్‌లోని ఇంటి నుంచి ఓ ఎన్నారైకు ఫోన్.. ఇదే మా చివరి మాటలంటూ షాకింగ్ న్యూస్.. చివరకు..
ABN , First Publish Date - 2021-05-27T18:27:45+05:30 IST
‘మేం ఇక ప్రాణాలతో ఉండమేమో. ఇదే మా చివరి ఫోన్ కాల్ కావచ్చు. నువ్వు జాగ్రత్త’ అంటూ ఆస్ట్రేలియాలో ఉండే సోదరుడికి భారత్‌లో తల్లితో పాటు ఉంటున్న సోదరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆ ఎన్నారై గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. చివరకు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో తెలిసిందే. ప్రతిరోజూ లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు రికార్డవుతున్నాయి. ఇలాంటి సమయంలో విదేశాల్లో ఉండిపోయిన ప్రవాస భారతీయులు తమ కుటుంబాల గురించి ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో ఉంటున్న తమ కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తలెత్తినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భయం భయంగా గడుపుతున్నారు. ఇటీవల కొంతమందికి ఎదురైన అనుభవాలు ప్రవాసీల ఆవేదనకు అద్దం పడుతున్నాయి. స్వదేశంలో తండ్రికి కరోనా లేకపోయినా ఆస్పత్రి బెడ్ దొరక్క మరణిస్తే విదేశాల్లోని కుమారుడి పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లికి కరోనా అని తెలిసి ఆస్పత్రిలో బెడ్ దొరక్క అవస్థలు పడుతుంటే విదేశాల్లోని కుమార్తె గుండె కోత ఎంతమందికి అర్థమవుతుంది?
మరియం అనే మహిళ ఖతార్‌లో ఉంటోంది. అక్కడే ఉద్యోగం చేస్తోందామె. ఆమె తాతయ్య ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారు. 85 ఏళ్ల ఆయనకు కరోనా సోకింది. ఆ సమయంలో మరియం తల్లి కూడా ఖతార్‌లోనే ఉంది. దాంతో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి వేరే బంధువులకు ఫోన్ల మీద ఫోన్లు చేసింది. ఎలాగోలా ఆయనకు కరోనా తగ్గింది. కానీ ఊపిరితిత్తులు బాగా దెబ్బతినడంతో వెంటిలేటర్ తప్పనిసరి అయింది. దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే అయ్యాయి. ప్రయాగ్‌రాజ్ దాని చుట్టుపక్కల ఉండే కాన్పూర్, లక్నో వంటి పట్టణాల్లో తెలిసిన వారికి, ఆస్పత్రులకు, స్వచ్ఛంద సంస్థలకు ఫోన్లు చేసిన మరియం.. వెంటిలేటర్ కోసం వేడుకుంది. కానీ ఎక్కడా దొరకలేదు. చివరకు ఒక ఆస్పత్రిలో బెడ్ దొరికినా అప్పటికే బాగా ఆలస్యమవడంతో ఈ నెల 5న మరియం తాతయ్య కన్నుమూశారు. ‘నేను చేయగలిగినంతా చేశా. ఎవరెవరిని సాయం అడగగలనో అందర్నీ అడిగా. వేల మైళ్ల దూరంలో ఉన్న నేను అంతకుమించి ఏం చేయగలను?’’ అని మరియం వాపోయారు.
మూడు నెలల నుంచి భారత్‌లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సుల కోసం భారతీయ కుటుంబాలు చేయని ప్రయత్నాలు లేవు. ఎంత చేసినా ఇవి దొరక్క ప్రాణాలు వదులుతున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు. పెరుగుతున్న అవసరాలను వైద్య వ్యవస్థ తీర్చలేకపోతోంది. ప్రాణాలు కోల్పోతున్న పేషెంట్లను చూస్తూ నిస్సహాయంగా నిలబడిపోయింది. ఇలాంటి సమయంలో ప్రయాణాలపై ఆంక్షల వల్లే కావచ్చు లేక మరేదైనా వ్యక్తిగత కారణాలతో కావచ్చు విదేశాల్లో ఉండిపోయిన ఎన్నారైలకు మానసిక ఆవేదన మామూలుగా ఉండటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, కుటుంబ సభ్యులు మరణించారని తెలిసినా చివరి చూపు కోసం కూడా స్వదేశానికి రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తమ కుటుంబీకులకు ఆస్పత్రి అవసరం ఉందని తెలిసిన ప్రవాసీల పరిస్థితి ఏంటి? వారి మనసు పడే ఆవేదన ఎవరికి అర్థం అవుతుంది? వాళ్లు ఎవరిని సాయం అడగాలి?
చాలా మంది ఎన్నారైల తల్లిదండ్రులు, ఇతర కుటుంబీకులు భారత్‌లో ఒంటరిగా ఉంటారు. అవసరమైనప్పుడు వీళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కూడా ఎవరూ ఉండరు. కొన్ని కుటుంబాలకు మాత్రం ఇలా సాయం చేయడానికి ఇతర కుటుంబీకులు ఉంటారు. సింగపూర్‌లో ఉంటున్న జ్యోత్స్న తల్లిదండ్రులకు కరోనా సోకినప్పుడు చెన్నైలోని ఆమె సోదరి అన్నీ తానై చూసుకుంది. మెడిసిన్స్ అందేలా చూడటం నుంచి, ల్యాబులు, ఆస్పత్రి బెడ్లు, సీటీ స్కాన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు.. అన్నీ సమయానికి అందేలా జాగ్రత్తలు తీసుకుంది. దాంతో జ్యోత్స్న తల్లిదండ్రులు కోలుకున్నారు. కానీ ఆస్ట్రేలియాలో ఉండే ఇర్విన్ అనే వ్యక్తికి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు దగ్గర కుటుంబీకులు ఎవరూ లేరు. 93 ఏళ్ల తల్లి, 68 ఏళ్ల సోదరి, 72 ఏళ్ల బావ. వీళ్లు ముగ్గురూ తమిళనాడులోని పళ్లవరంలో ఉంటున్నారు. ముగ్గురికీ సడెన్‌గా అనారోగ్యం చేసింది.
కుటుంబ సభ్యులు అందరికీ అనారోగ్యం రావడంతో ఇర్విన్ వణికిపోయారు. దాన్ని వైరల్ ఫీవవర్ అనుకున్న ఆయన కుటుంబం.. డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఒంట్లో బాగోని వారికి ఆహారం అందివ్వడం కోసం ఒక దూరపు చుట్టాన్ని ఇర్విన్ మాట్లాడారు. అయితే కొన్ని రోజులకు ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి తీవ్రతరం అయ్యింది. అసలే వృద్ధులైన వారు నీరసం కారణంగా తలుపు దగ్గర పెట్టిన ఆహారం కూడా తీసుకోలేకపోయారు. ఆ వీధిలోని కుక్కలు ఇంటి ముందు ఆహారం తినసాగాయి. ఇలాంటి సమయంలో వారికి కరోనా టెస్టులు చేయించడం కూడా ఇర్విన్ తలకు మించిన పనైంది. ఎట్టకేలకు వారికి ఇంటిలోనే టెస్టులు జరిపించే ఏర్పాట్లు చేశారు ఇర్విన్. కానీ టెస్టు ఫలితం రాలేదు. ప్రభుత్వ ల్యాబుకు ఫోన్ చేస్తే.. రిపోర్టు రాలేదంటే కరోనా లేదనే అర్థం అన్నారట. కానీ కరోనా రిపోర్టు లేకుండా అంబులెన్సులు, ఆస్పత్రులు ఎవరూ వారిని చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు.
అలాంటి సమయంలో ఇర్విన్‌తో మాట్లాడిన ఆయన సోదరి తాము చనిపోవడం ఖాయమనీ, ఇదే చివరి ఫోన్ కాల్ కూడా కావచ్చునని చెప్పిందట. ఆ మాటలు విన్నప్పుడు ఇర్విన్ బాధ వర్ణనాతీతం. ‘‘భారత్‌లో ఉన్న నా మొత్తం కుటుంబం అది. వాళ్లకు ఏమీ చేయలేక పోయా. ఎంత నిస్సహాయంగా ఫీలయ్యానో చెప్పలేను’’ అని ఇర్విన్ అన్నారు. ఆ తర్వాత ఒక మిత్రుడి ద్వారా ఒక వాలంటీర్‌ను సంప్రదించారు ఇర్విన్. ఆ వాలంటీర్ తానే దగ్గరుండి ఇర్విన్ కుటుంబానికి అన్ని సదుపాయాలు కల్పించారు. ఆస్పత్రిలో చేర్పించి సీటీ స్కాన్ కూడా తీయించారు. అనారోగ్యంతో ఉన్న తల్లితో అప్పటి వరకూ తాను మాట్లాడలేదని, ఆస్పత్రిలో చేర్పించిన రెండో రోజు ఫోన్ చేసి మాట్లాడానని ఇర్విన్ వెల్లడించారు.
ఇలా వీళ్లిద్దరే కాదు. భారత్‌లో లేని ప్రవాసీలంతా తమ కుటుంబాల కోసం ఆరాట పడుతున్నారు. ప్రతి రోజూ ఫోన్లు చేసి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఆ దేశాలకు, భారత్‌కు టైంలో తేడాలుండటం వల్ల కొందరు ప్రవాసీలకు నిద్ర కూడా ఉండటం లేదు. మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లోని వారికి కరోనా రాకపోయినా వేరే వ్యాధి వచ్చినా ఆస్పత్రిలో బెడ్లు దొరకడం, వైద్యులు అందుబాటులో ఉండటం చాలా పెద్ద సమస్యగా మారిందని కొందరు ఎన్నారైలు అంటున్నారు. ఇర్విన్ కుటుంబానికి సాయం చేసిన సన్నీ నటరాజ్, సంగీత ఈశ్వరన్ అనే ఇద్దరు వాలంటీర్లు కూడా ఇవే ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పరిస్థితుల్లో ప్రవాసీల కుటుంబాలకు ఎవరు అండగా ఉంటారు? కొన్ని ఏజెన్సీలు ఇలాంటి కుటుంబాలకు అంటెడీలను అందుబాటులో ఉంచుతున్నాయి. దానికి కొంత ఫీజు వసూలు చేసినా అన్నీ చక్కగా చూసుకుంటే పర్లేదు. అదే పరిస్థితి విషమిస్తే? కుటుంబీకులు తీవ్రమైన అనారోగ్యంతో ఉంటే?
ఇటీవల మంగళూరు పోలీసులు ఎన్నారైలకు సహకారం అందించడం కోసం సమన్వయ పేరిట ఒక వేదికను సిద్ధం చేశారు. మంగళూరులోని కుటుంబీకులకు కరోనా సోకినా, వైద్యుల అవసరం ఉన్నా తమకు తెలియజేస్తే.. సమన్వయ బృందం వారి అవసరాలను తీరుస్తుందని హామీ ఇచ్చారు. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్‌కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వంటివి విరాళం ఇచ్చి పరిస్థితి చక్కబెట్టేందుకు తమ వంతు సాయం చేస్తున్న ఎన్నారైలు.. తమ తోటి ప్రవాసీలకు కూడా సాధ్యమైనంత సాయం చేస్తున్నారు. భారత్‌లో తమకు తెలిసి సాయం చేసే వాళ్లుంటే వారి నంబర్లను తెలిసిన ఎన్నారైలకు అందజేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకు మించి ఏమీ చేయలేని స్థితి. ఈ కరోనా వేవ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం వైద్య రంగంతోపాటు, ఎన్నారైల అవసరాలపై కూడా దృష్టి పెట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటే మంచిందని కొందరు ఎన్నారైలు అంటున్నారు.