Americaలో కొత్త బిల్లు.. Green card విషయంలో భారతీయులకు తీపికబురు!

ABN , First Publish Date - 2021-09-14T03:04:12+05:30 IST

భారతీయులకు అమెరికా నుంచి భారీ తీపికబురందింది. అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా ఆనందించదగిన..

Americaలో కొత్త బిల్లు.. Green card విషయంలో భారతీయులకు తీపికబురు!

వాషింగ్టన్: భారతీయులకు అమెరికా నుంచి భారీ తీపికబురందింది. అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా ఆనందించదగిన విషయం. అమెరికా ప్రభుత్వం తాజాగా బడ్జెట్ రీకన్సిలేషన్ బిల్‌లో భాగంగా ఇమ్మిగ్రేషన్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల ఇకపై గ్రీన్ కార్డు పొందేందుకు భారతీయులు ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.


అమెరికాలో శాశ్వతంగా నివశించేందుకు అవసరమైన గ్రీన్ కార్డ్ అందించేందుకు ప్రతి దేశానికీ ఓ పరిమితి ఉంటుంది. అయితే తాజాగా ప్రవేశపెట్టబోతున్న నిబంధనలతో ఈ పరిమితి నుంచి మినహాయింపు పొందేందుకు దరఖాస్తుదారులకు అవకాశం లభించనుంది. ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 5వేల డాలర్లు సూపర్ ఫీజ్ చెల్లిస్తే ఈ మినహాయింపు లభిస్తుంది.


అనేకమంది భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే అత్యధికంగా ఉద్యోగ సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారినే పరిగణలోకి తీసుకుంటున్నారు. అందులోనూ అత్యధికశాతం హెచ్1-బీ వీసాలు. ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలే అత్యధికంగా తమ ఉద్యోగులు గ్రీన్ కార్డులు పొందేందుకు స్పాన్సర్ చేస్తున్నాయి. నైపుణ్యం గల ఉద్యోగులే ప్రాధాన్యంగా ఆయా సంస్థలు స్పాన్సర్ చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు వేగంగా గ్రీన్ కార్డు పొందేందుకు అధికమొత్తంలో ఫీజులు చెల్లిస్తుండడం గమనార్హం. 


ఈ బిల్లుపై సైరస్ డీ మెహతా అండ్ పార్ట్‌నర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ మెహతా మాట్లాడుతూ.. ఇది చాలా గొప్ప బిల్లు అని అన్నారు. ఈ బిల్లులో అవసరమైన అంశాలన్నీ లేకపోయినా.. భారతీయులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎంప్లాయిమెంట్ గ్రీన్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి లాభం చేకూరుతుందని, ఇప్పటివరకు అమలులో ఉన్న పరిమితుల నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే ఈ బిల్లు తుది బిల్లు కాదని, ఇందులో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తుది బిల్లు పార్లమెంట్‌కు చేరుతుందని, బిల్లులో చేసిన ఇమ్మిగ్రేషన్ నిబంధనల వల్ల దేశానికి లాభం చేకూరుతుందా లేదా అనే దానిపై సభ్యులు చర్చిస్తారని, అయితే ఇమ్మిగ్రేషన్ నిబంధనలు బడ్జెట్ రికన్సిలేషన్ బిల్లులో భాగం కనుక దీనికి భారీ మెజారిటీ అవసరం లేదని మెహతా పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-14T03:04:12+05:30 IST