న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన ‘మెయిల్’
ABN , First Publish Date - 2021-05-09T06:37:37+05:30 IST
ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘ఆహా’ ఒరిజినల్ మూవీ ‘మెయిల్’(చాపర్ట్1- కంబాలపల్లి కథలు). ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఈ ఏడాది ప్రారం
ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘ఆహా’ ఒరిజినల్ మూవీ ‘మెయిల్’(చాపర్ట్1- కంబాలపల్లి కథలు). ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఈ ఏడాది ప్రారంభంలో ‘ఆహా’ ఓటీటీలో విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన ఈ చిత్రం ఇప్పుడు అరుదైన గుర్తింపు దక్కించుకుంది. జూన్‌లో నిర్వహించబోయే న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్‌వైఐఎఫ్‌ఎఫ్)2021కు ఈ చిత్రం ఎంపికైంది. గొప్ప లెగసీతో చాలా కాలం నుంచి నిర్వహించబడుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలింస్, ఇండిపెండెంట్, ఆర్ట్ మూవీస్ ఇలా అన్నీ విభాగాలకు చెందిన సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనకు ‘మెయిల్’ సినిమా ఎంపిక కావడంపై చిత్ర యూనిట్, ఆహా యాజమాన్యం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సినిమా విషయానికి వస్తే.. 2000 సంవత్సరం ప్రారంభంలో.. ఇంటర్నెట్ శకం ప్రారంభమవుతున్న టైమ్‌లో తెలంగాణలోని ఓ అందమైన పల్లెటూరిలో జరిగే కథే ‘మెయిల్’ సినిమా. కాలేజీ కుర్రాడు రవికి కంప్యూటర్ అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. అదే సమయంలో ఆ గ్రామంలో గేమింగ్ సెంటర్‌ను నిర్వహించే హైబత్ అనే వ్యక్తితో రవికి ఎలా అనుబంధం ఉంటుందో సినిమా తెలియజేస్తుంది. డిజిటల్ యుగం ప్రారంభమవుతున్న సమయంలో పల్లెటూరిలో ఉండే అమాయకత్వం, హాస్యం, భావోద్వేగాల కలయికను ‘మెయిల్’ సినిమాలో చూడొచ్చు. స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.