అమెరికాలో RRR సెన్సెషన్.. ఏఏ భాషల్లో ఎన్ని థియేటర్లలో విడుదలవుతోందంటే..
ABN , First Publish Date - 2021-12-22T22:51:40+05:30 IST
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ మాసీవ్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఎన్నారై డెస్క్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ మాసీవ్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, మేకింగ్ వీడియోలు, సాంగ్స్ ఈ అంచనాలను తార స్థాయికి చేర్చాయి. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ట్రిపుల్ ఆర్ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' లాంటి దృశ్యకావ్యం తర్వాత జక్కన్న తీసిన మూవీ కావడంతో సినిమా లవర్స్‌కు దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. భారత్‌లో ఐదు భాషల్లో భారీగా విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్.. అటు అమెరికాలోనూ అన్నే భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. సరిగమ సినిమాస్, రఫ్తార్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా యూఎస్‌లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. జనవరి 6న ప్రీమియర్ షోలతో అమెరికాలో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం మొదలుకానుంది.
అక్కడ మొత్తం ఐదు భాషల్లో కలిపి ఏకంగా 2,212 థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుండడం విశేషం. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా అమెరికాలో ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు. ఇక భాషల వారీగా చూసుకుంటే.. తెలుగులో అత్యధికంగా వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో యూఎస్‌లో తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని దాదాపు అన్ని స్క్రీన్స్‌లోనూ ఆర్ఆర్ఆరే దర్శనమివ్వబోతోంది. తెలుగు తర్వాత హిందీలో ఏకంగా 793 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత తమిళం-291, మలయాళం-66, కన్నడ-62 థియేటర్లలో విడుదల కానుంది. ఇలా ఐదు భాషల్లో కలిపి మొత్తం 2,212 థియేటర్లలో భారీ స్థాయిలో ఈ మూవీ సందడి చేయనుంది. ఇదిలాఉంటే.. ఈ సినిమా రిలీజ్‌కు రెండు వారాల మునుపే యూఎస్‌లో ప్రీ బుక్సింగ్స్ ప్రారంభించారు మూవీ మేకర్స్. ఇప్పటికే టెక్కెట్లన్నీ అమ్ముడుపోవడంతో దాదాపు రెండు మిలియన్ డాలర్లు( మన కరెన్సీలో దాదాపు రూ.15 కోట్లు) వచ్చినట్టు తెలిసింది. బుకింగ్స్ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే ఈ మొత్తం సమకూరడం ఓ రికార్డని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఇలా ఇప్పటి నుంచే రికార్డుల వేట మొదలెట్టిన ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.