The OA
ABN , First Publish Date - 2021-01-10T22:08:55+05:30 IST
ఒకవేళ ఆ పేరు మీకు తెలియకపోయినా ‘గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ’, ‘ఒన్స్‌అపాన్ ఏ టైం ఇన్ ది వెస్ట్’ సినిమాల పేర్లు ఖచ్చితంగా విని ఉంటారు. వెస్టర్న్ (కౌబాయ్) సినిమాల స్పెషలిస్ట్ ఈయన. సెర్జో లియోనే చి
‘‘ఇంతవరకూ మీరు ఎన్నో వెబ్ సిరీస్‌లను చూసుండొచ్చు. కానీ, ఇలాంటి సిరీస్‌ను మాత్రం చూసుండరు. ఇది వినోదాన్ని అందిస్తుంది, ఆలోచింపచేస్తుంది, ఓదార్పును కలుగజేస్తుంది, ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సిరీస్ చూసేందుకు కొంత ఓపిక సహనం కావాలి. ఇందులో చెప్పే కొన్ని అంశాలు మనకు నమ్మశక్యం కానివిగా అనిపించినప్పటికీ ఒక కథగా ఆ అంశాలను మనం ఒప్పుకోగలిగితే సిరీస్ ముగిసే సమయానికి మీరొక కొత్త అనుభవంతో బయటపడతారు...’’
ఒకవేళ ఆ పేరు మీకు తెలియకపోయినా ‘గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ’, ‘ఒన్స్‌అపాన్ ఏ టైం ఇన్ ది వెస్ట్’ సినిమాల పేర్లు ఖచ్చితంగా విని ఉంటారు. వెస్టర్న్ (కౌబాయ్) సినిమాల స్పెషలిస్ట్ ఈయన. సెర్జో లియోనే చివరిగా తీసిన సినిమా పేరు ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ అమెరికా’. ఇటలీలో పెద్ద దర్శకుడిగా పేరుపొంది, అమెరికా వచ్చి అద్భుతమైన సినిమాలు రూపొందించి, తీసిన సినిమానల్లా సూపర్ హిట్ చేశాడు. అలాంటి దర్శకుడు కౌబాయ్ సినిమాల మీద మొహం మొత్తి ఒక కొత్త రకమైన సినిమా తీద్దామనుకున్నాడు. ఈ సారి కథను అమెరికాలోని మాఫియా/గ్యాంగ్స్ ఆధారంగా రూపొందించాడు. కథ చాలా పెద్దదైపోయింది.
‘బాహుబలి’లాగా రెండు భాగాలుగా తీద్దామనుకున్నాడు. నిర్మాతలు ఒప్పుకోలేదు. అంత పెద్ద సూపర్ హిట్ సినిమా డైరెక్టర్‌కి కూడా కష్టాలు తప్పలేదు. నిర్మాతల ఒత్తిడి తట్టుకోలేక కథని కొంత తగ్గించి మొత్తం ఒకే భాగంగా రూపొందించాడు. అది కాస్తా 269 నిమిషాల నిడివిగల సినిమా అయింది. కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించినప్పుడు ఇరవై నిమిషాల పాటు థియేటర్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కానీ సినిమా విడుదల సమయంలో నిర్మాతలు, నాలుగున్నర గంటల సినిమా అంటే జనాలకు ఓపిక ఉండదని నచ్చచెప్పి, దాన్ని 229 నిమిషాలకు తగ్గించారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగారు. వాళ్ల ఇష్టానికి సినిమాని ఎడిట్ చేసి 139 నిమిషాలకు కుదించి రిలీజ్ చేశారు. అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన సెర్జో లియోనే తీవ్రంగా దెబ్బతిన్నారు. ఆయన ఆ తర్వాత సినిమాలే తీయలేదు.
సినిమా ఎంత కళాత్మకమైనదైనా నిర్మాత చివరిగా చూసేది తను పెట్టిన డబ్బులు తిరిగొచ్చాయా లేదా అనే! నిర్మాతగా అది అతని బాధ్యత. కానీ ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు దర్శకులు రచయితలు చాలా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. వేరే మార్గం లేదు. కానీ ఓటీటీ రాకతో ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు సినిమా నిడివి అసలు సమస్యే కాదు. ఓటీటీ అవకాశమే లేకుంటే మనం ఎన్నో గొప్ప కథలను మిస్సయ్యుండే వాళ్ళం. అలా సినిమా ఫార్మాట్‌కు సరిపోక, ఒక పెద్ద కథతో ఎంతో ఆసక్తికరంగా నడిచే ఒక వెబ్ సిరీస్ - The OA.
ఎనిమిది ఎపిసోడ్స్ కలిగిన సిరీస్ గురించి చెప్పడమంటే చాలా కష్టమైన పని. అసలీ సిరీస్ మొదలవ్వడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏడు సంవత్సరాల క్రితం తప్పిపోయిందనుకున్న ఒక యువతి, బ్రిడ్జి మీద నుంచి కిందకి దూకబోతుండగా ఆమెను కాపాడి హాస్పిటల్లో చేరుస్తారు. టివిలో చూసిన ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్‌కు చేరుకుంటారు. ఆమె దగ్గరకెళ్ళి తమని పరిచయం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లను గుర్తుపట్టదు. అందుకు కారణం ఇంటినుండి తప్పిపోయినప్పుడు ఆమెకు కళ్ళు కనిపించక పోవడం. కానీ ఏడేళ్ళ తర్వాత ఇప్పుడు అన్నీ చూడగలుగుతుంది. కళ్ళెలా వచ్చాయనే ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు. ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళిపోయిందన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పదు. ఇంటికి తిరిగొచ్చిన దగ్గర్నుంచీ ఇంటర్నెట్‌లో హోమర్ అనే వ్యక్తి కోసం అన్వేషణ మొదలుపెడుతుంది.
తల్లిదండ్రులకు అసలేమీ అర్థం కాదు. ఆమెకు ఏమైందో అని బాధపడుతుంటారు. ఇంటర్నెట్‌లో ఆమె ఎవరి కోసమో వెతుకుతుందని తెలుసుకుని, మళ్ళీ వెళ్లిపోతుందేమోననే భయంతో ఆమెకు నెట్ కనెక్షన్ కట్ చేస్తారు. ఇదే సమయంలో తమ పక్కింట్లో ఉండే స్టీవ్ అనే టీనేజర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. అతని సహాయం ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ సంపాదిస్తుంది. అంతే కాకుండా, స్టీవ్‌తో పాటు మరొక నలుగురు వ్యక్తులను పోగు చెయ్యమని అడుగుతుంది. వాళ్ళందరూ ఒక అర్థరాత్రి ఒక పాడుబడిన ఇంట్లో కలుస్తారు. అక్కడ వారికి తన గురించి, తను ఏడేళ్లపాటు ఎక్కడికెళ్లిందనే విషయాలతో పాటు తన పేరు The OA గా ఎందుకు మారిందో చెప్పడం మొదలు పెడుతుంది. అలా వాళ్లంతా ప్రతి రాత్రీ రహస్యంగా ఇంటినుంచి బయటపడి ఆమె చెప్పే కథలు వినడమే ఈ సిరీస్‌లోని ప్రధానాంశం.
ఒకవైపు కథ చెబుతున్న ఆమెతో పాటు, వింటున్న ఐదుగురి జీవితాల్లో జరిగే వివిధ సంఘటనలు కూడా ఈ సిరీస్‌కు మరింత ఆసక్తిని చేకూరుస్తాయి. ఇందులోనాకు నచ్చిన విషయం ఏంటంటే, ఈ కథ చెప్పడానికి ఎన్నుకున్న స్ర్కీన్‌ప్లే విధానం. దాదాపు కథలో చాలా భాగం చెబుతుండగా జరుగుతుంది కాబట్టి, ఆమె చెప్పిందే మనం నిజమనుకోవాలి. కానీ ఒక పాత్ర కథ చెప్తున్నప్పుడు అందులో నిజం ఎంతో మనకెలా తెలుస్తుంది. ఎలాగైతే ఆ వింటున్న ఐదుగురు ఆమె కథ గురించి భిన్న అభిప్రాయాలు కలిగుంటారో, సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఆమె కథను నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు అయ్యుంటారు. కథ వింటున్న శ్రోతల పాత్రల ద్వారా ప్రేక్షకులు ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతారో, ఆ రియాక్షన్‌ను ఆ శ్రోతల ద్వారా చూపించడం చాలా బావుంది.
అలాంటి పాత్రను unrelialble narrator అంటారు. వాళ్ళు చెప్పిందాంట్లో నిజమేంటో, అబద్ధమేంటో తెలియక మనం సతమతమవుతాం. ఇదంతా నిజం అయ్యుండదులే అనుకున్న కొద్ది సేపటికే మన అంచనాలు తలకిందులవుతాయి. అలాగని ఇది ఒక క్రైం కథ కాదు. ఇదొక సైన్స్ ఫిక్షన్ కలగలిపిన కథాంశం. కానీ ఉట్టి సైన్స్ ఫిక్షనంటే ఆధ్యాత్మిక వైజ్ఞానిక కల్పన అని చెప్పొచ్చు.
ఈ సిరీస్ చూశాక, ఇందులో The OAగా నటించిన బ్రిట్ మార్లింగ్‌ను మాత్రం మీరు అంత త్వరగా మర్చిపోలేరు. ఆమె నటించడమే కాదు, ఈ సిరీస్‌కి కథ - స్ర్కీన్‌ప్లే రాసింది కూడా. 2016లో మొదటి సీజన్ వచ్చిన ఈ వెబ్ సిరీస్, 2019లో సెకండ్ సీజన్ కూడా వచ్చింది. అయితే మొదటి సీజన్లో ఉన్నంత అద్భుతమైన కథనం సెకండ్ సీజన్లో లేదనే చెప్పాలి. అయినా కూడా చాలా వెబ్ సిరీస్‌ల కంటే బాగానే ఉంటుంది. కాకపోతే దీన్ని చూడ్డానికి కొంచెం ఓపిక కావాలి. అ కొంచెం ఓపిక ఉంటే .. ఒక అద్భుతమైన అనుభవంగా మాత్రం మిగిలిపోతుంది.
-వెంకట్ శిద్దారెడ్డి