బ్యాడ్మింటన్‌ లెజెండ్‌ నటేకర్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-07-29T09:34:09+05:30 IST

బ్యాడ్మింటన్‌ లెజెండ్‌ నందూ నటేకర్‌.. అనారోగ్య కారణాలతో బుధవారం మృతి చెందాడు. 88 ఏళ్ల నటేకర్‌ గత కొంత కాలంగా వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు...

బ్యాడ్మింటన్‌ లెజెండ్‌ నటేకర్‌ కన్నుమూత

పుణె: బ్యాడ్మింటన్‌ లెజెండ్‌ నందూ నటేకర్‌.. అనారోగ్య కారణాలతో బుధవారం మృతి చెందాడు. 88 ఏళ్ల నటేకర్‌ గత కొంత కాలంగా వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతడికి భార్య, కుమారుడు గౌరవ్‌తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డేవి్‌సకప్‌లో గౌరవ్‌ దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. కోర్టులో ఎంతో ఉత్సాహంగా కదిలే నటేకర్‌ను బ్యాలే డ్యాన్సర్‌తో పోల్చేవారు. పాదరసంలా కదుల్తూ అతడు ఆడే స్ట్రోక్‌లు, స్మాష్‌లకు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యేవారు. వంద వరకు జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్‌ను నందూ సొంతం చేసుకున్నాడు. టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌తోపాటు ఇతర క్రీడల్లోనూ ప్రవేశం ఉంది. 1951-52 జూనియర్‌ నేషనల్స్‌లో టెన్నిస్‌ దిగ్గజం రామనాథన్‌ కృష్ణన్‌ చేతిలో ఓడిన నటేకర్‌.. బ్యాడ్మింటన్‌కు మారాడు. 1961లో ప్రవేశపెట్టిన అర్జున అవార్డును తొలుత దక్కించుకుంది కూడా నటేకరే..! దాదాపు దశాబ్దంపాటు 1951-63 వరకు థామ్‌సక్‌పలో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. నందూ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత క్రీడా చరిత్రలో నటేకర్‌ది ప్రత్యేక స్థానం అని ట్వీట్‌ చేశారు. నటేకర్‌ ట్రూ లెజెండ్‌ అని కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. ‘నందూ, సురేష్‌ గోయల్‌, ప్రకాష్‌ పడుకోన్‌ది ఓ శకం. మృదుభాషి, మర్యాదస్తుడు. ఆధునిక బ్యాడ్మింటన్‌ను ఎంతో నిశితంగా గమనించే వారు’ అని గోపీ చెప్పాడు. 


Updated Date - 2021-07-29T09:34:09+05:30 IST