రాజస్థాన్‌.. హమ్మయ్య!

ABN , First Publish Date - 2021-04-16T06:20:01+05:30 IST

క్రిస్‌ మోరిస్‌ (18 బంతుల్లో 4 సిక్సర్లతో 36 నాటౌట్‌) తన విలువేంటో చూపాడు. ఇదే వాంఖడేలో పంజాబ్‌తో చివరి ఓవర్‌లో శాంసన్‌ అతడికి స్ట్రయికింగ్‌కు నిరాకరించినా.. ఈరోజు అతడి సిక్సరే మ్యాచ్‌ను గెలిపించింది...

రాజస్థాన్‌.. హమ్మయ్య!

  • చివరి ఓవర్‌లో విజయం 
  • రాణించిన మిల్లర్‌, మోరిస్‌ 
  • ఢిల్లీతో మ్యాచ్‌

పంజాబ్‌తో 222 పరుగుల భారీ ఛేదనలో చివరి బంతికి దురదృష్టం వెంటాడినా.. ఈసారి రాజస్థాన్‌ రాయల్స్‌ మురిసింది. కాకపోతే కేవలం 148 పరుగుల కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఓ దశలో 42/5 స్కోరుతో ఇక గెలవడం అసాధ్యమే అనుకున్న స్థితిలో డేవిడ్‌ మిల్లర్‌ పోరాటం.. చివర్లో క్రిస్‌ మోరిస్‌ తన ‘విలువ’కు న్యాయం చేస్తూ సిక్సర్ల మోతతో  జట్టును గెలిపించాడు. అంతకుముందు పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ (3/15) పదునైన బంతులకు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో రిషభ్‌ పంత్‌ మినహా అంతా విఫలమయ్యారు. 


ముంబై: క్రిస్‌ మోరిస్‌ (18 బంతుల్లో 4 సిక్సర్లతో 36 నాటౌట్‌) తన విలువేంటో చూపాడు. ఇదే వాంఖడేలో పంజాబ్‌తో చివరి ఓవర్‌లో శాంసన్‌ అతడికి స్ట్రయికింగ్‌కు నిరాకరించినా.. ఈరోజు అతడి సిక్సరే మ్యాచ్‌ను గెలిపించింది. డేవిడ్‌ మిల్లర్‌ (43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 62) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. గురువారం ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 3 వికెట్లతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. ముస్తాఫిజుర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. అవేశ్‌కు మూడు, వోక్స్‌.. రబాడలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఉనాద్కట్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.


మిల్లర్‌ పోరాటం..: 148 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ జట్టు ఢిల్లీకన్నా దారుణంగా తడబడింది. 17 పరుగులకే మూడు వికెట్లు కోలోయింది. ఓపెనర్లు వోహ్రా (9), బట్లర్‌ (2) వికెట్లను మూడో ఓవర్‌లోనే  వోక్స్‌ పడగొట్టాడు. ఆ మరుసటి ఓవర్‌లో ఆర్‌ఆర్‌కు మరింత గట్టి షాక్‌ తగిలింది. పంజాబ్‌పై అద్భుత సెంచరీతో ఊపు మీదున్న కెప్టెన్‌ శాంసన్‌ (4)ను రబాడ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో డేవిడ్‌ మిల్లర్‌ ఒంటరి పోరాటం చేసినా కానీ మరో ఎండ్‌లో మాత్రం వికెట్ల పతనం ఆగలేదు. అవేశ్‌ ఖాన్‌ వరుస ఓవర్లలో శివమ్‌ దూబే (2), రియాన్‌ పరాగ్‌ (2) వికెట్లను తీయడంతో 42/5 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. మిల్లర్‌ మాత్రం పట్టు వీడకుండా 10వ ఓవర్‌లో రెండు, 13వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో గెలిపించే ప్రయత్నం చేశాడు.  తెవాటియా (19)తో కలిసి ఆరో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాక మిల్లర్‌ చెలరేగాడు. 16వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది ఢిల్లీ జట్టులో అలజడి రేపినా ఐదో బంతికి లలిత్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఆవేశ్‌ ఈ వికెట్‌ తీశాడు. 


మోరిస్‌ మోత..: మిల్లర్‌ అవుటయ్యాక ఆర్‌ఆర్‌ ఆశలు వదులుకున్నట్టు కనిపించినా.. ఆఖర్లో మోరిస్‌ మోతెక్కించాడు. ఉనాద్కట్‌ (11 నాటౌట్‌)ను అండగా చేసుకుని జట్టును గెలిపించాడు. చివరి 12 బంతుల్లో 27 పరుగులు కావాల్సి ఉండగా.. 19వ ఓవర్‌లో అతడు రెండు సిక్సర్లతో 14 పరుగులు రాబట్టాడు. ఇక ఆరు బంతుల్లో 12 రన్స్‌ కోసం తొలి నాలుగు బంతుల్లో 2,6,0,6తో మ్యాచ్‌ను ముగించాడు.



ఉనాద్కట్‌ హవా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరంభ ఓవర్లలో పరుగులు తీసేందుకు తెగ కష్టపడింది. పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ నిప్పులు చెరిగే బంతులతో వారిని కుదురుకోనీయలేదు. తన వరుస ఓవర్లలో టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా (2), ధవన్‌ (9), రహానె (8) వికెట్లను తీయడంతో ఢిల్లీ పవర్‌ప్లేలోనే 36/3 స్కోరుతో దయనీయస్థితిలో పడింది. ఇక ఏడో ఓవర్‌లో స్టొయిని్‌సను ముస్తాఫిజుర్‌ డకౌట్‌ చేశాడు. ఇలాంటి సమయాన కెప్టెన్‌ పంత్‌ నిలబడ్డాడు. అతడికి కొత్త ఆటగాడు లలిత్‌ యాదవ్‌ (20) సహకారం అందించాడు. ఈ జోడీ కాసేపు జట్టు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగింది. ఎనిమిదో ఓవర్‌లో యాదవ్‌ రెండు ఫోర్లు.. 11వ ఓవర్‌లో పంత్‌ నాలుగు ఫోర్లతో స్కోరు గాడిన పడినట్టే కనిపించింది. అటు 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన పంత్‌ జోరు మీదున్నాడు. కానీ ఈ సమయాన ఢిల్లీ మరోసారి వరుస వికెట్లను కోల్పోయింది. 13వ ఓవర్‌లో పంత్‌ను రియాన్‌ పరాగ్‌ రనౌట్‌ చేయగా.. ఆ వెంటనే లలిత్‌ యాదవ్‌ను మోరిస్‌ అవుట్‌ చేయడంతో ఢిల్లీ 150 పరుగులు కూడా దాటలేకపోయింది. ఐదో వికెట్‌కు ఈ జోడీ 51 పరుగులు నమోదు చేసింది. టామ్‌ కర్రాన్‌ (21), వోక్స్‌ (15) కాసిన్ని పరుగులు సమకూర్చగలిగారు.



స్కోరు బోర్డు

ఢిల్లీ: పృథ్వీషా (సి) మిల్లర్‌ (బి) ఉనాద్కట్‌ 2; ధవన్‌ (సి) శాంసన్‌ (బి) ఉనాద్కట్‌ 9; రహానె (సి అండ్‌ బి) ఉనాద్కట్‌ 8; పంత్‌ (రనౌట్‌) 51; స్టొయినిస్‌ (సి) బట్లర్‌ (బి) ముస్తాఫిజుర్‌ 0; లలిత్‌ యాదవ్‌ (సి) తెవాటియా (బి) మోరిస్‌ 20, టామ్‌ కర్రాన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 21; క్రిస్‌ వోక్స్‌ (నాటౌట్‌) 15; అశ్విన్‌ (రనౌట్‌) 7; రబాడ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 147/8; వికెట్ల పతనం: 1-5, 2-16, 3-36, 4-37, 5-88, 6-100, 7-128, 8-136; బౌలింగ్‌: చేతన్‌ సకారియా 4-0-33-0; ఉనాద్కట్‌ 4-0-15-3; మోరిస్‌ 3-0-27-1; ముస్తాఫిజుర్‌ 4-0-29-2; రియాన్‌ పరాగ్‌ 2-0-16-0; రాహుల్‌ తెవాటియా 3-0-27-0. 

రాజస్థాన్‌: జోస్‌ బట్లర్‌ (సి) పంత్‌ (బి) వోక్స్‌ 2; వోహ్రా (సి) రబాడ (బి) వోక్స్‌ 9; శాంసన్‌ (సి) ధవన్‌ (బి) రబాడ 4; శివమ్‌ దూబే (సి) ధవన్‌ (బి) ఆవేశ్‌ ఖాన్‌ 2; మిల్లర్‌ (సి) లలిత్‌ (బి) ఆవేశ్‌ ఖాన్‌ 62; రియాన్‌ పరాగ్‌ (సి) ధవన్‌ (బి) ఆవేశ్‌ ఖాన్‌ 2; రాహుల్‌ తెవాటియా (సి) లలిత్‌ (బి) రబాడ 19; మోరిస్‌ (నాటౌట్‌) 36; ఉనాద్కట్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 19.4 ఓవర్లలో 150/7; వికెట్ల పతనం: 1-13, 2-13, 3-17, 4-36, 5-42, 6-90, 7-104; బౌలింగ్‌: క్రిస్‌ వోక్స్‌ 4-0-22-2; ఆవేశ్‌ ఖాన్‌ 4-0-32-3; రబాడ 4-0-30-2; అశ్విన్‌ 3-0-14-0; టామ్‌ కర్రాన్‌ 3.4-0-35-0; స్టొయినిస్‌ 1-0-15-0.

Updated Date - 2021-04-16T06:20:01+05:30 IST