థాంప్సన్ రికార్డు పరుగు
ABN , First Publish Date - 2021-08-01T09:15:14+05:30 IST
మహిళల 100 మీ. స్ర్పింట్‌లో 33 ఏళ్ల ఒలింపిక్ రికార్డు బద్ధలైంది. 1988లో అమెరికా అందాల తార ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్‌నర్ నెలకొల్పిన రికార్డును జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ హెరా తిరగరాసింది...
- మహిళల 100 మీ.లో ఫ్లోజో రికార్డు కనుమరుగు
- పురుషుల 100 మీటర్ల ఫైనల్ నేడే
- సాయంత్రం 6 గం. నుంచి
మహిళల 100 మీ. స్ర్పింట్‌లో 33 ఏళ్ల ఒలింపిక్ రికార్డు బద్ధలైంది. 1988లో అమెరికా అందాల తార ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్‌నర్ నెలకొల్పిన రికార్డును జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ హెరా తిరగరాసింది. శనివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఎలైన్ 10.61 సెకన్ల టైమింగ్‌తో కొత్త ఒలింపిక్ రికార్డు నమోదు చేసి స్వర్ణ పతకం నిలబెట్టుకుంది. దాంతో 10.62సె.లతో ఫ్లోరెన్స్ పేరిట ఉన్న రికార్డు తుడిచి పెట్టుకుపోయింది. ఇక..మూడు పతకాలను జమైకా క్లీన్‌స్వీ్‌ప చేయడం విశేషం. థాంప్సన్ ప్రధాన ప్రత్యర్థి షెల్లీ ఆన్ ఫ్రైజర్ ప్రైస్ (10.74) రజతంతో సరిపెట్టుకోగా, షెరికా జక్సన్ (10.76సె) కాంస్య పతకం అందుకుంది.
పోలెండ్‌కు ‘మిక్స్‌డ్’ పసిడి
విశ్వక్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో పోలెండ్ (3 నిమిషాల 09.87 సెకన్లు) అనూహ్యంగా పసిడి పతకం నెగ్గింది. డొమెనిక్ రిపబ్లిక్ రజతం గెలుచుకోగా.. అమెరికా జట్టు కాంస్యానికే పరిమితమైంది. హీట్స్‌లో డిస్‌క్వాలిఫై అయిన అమెరికా...అప్పీలు చేసుకోగా నిర్వాహకులు ఫైనల్‌లో తలపడేందుకు అనుమతించారు. పురుషుల డిస్కస్ త్రోలో స్వీడన్ స్వర్ణం, రజతం, ఆస్ట్రియా కాంస్య నెగ్గాయి.