TG : Bandi Sanjay పాదయాత్ర పేరు ఖరారు..

ABN , First Publish Date - 2021-08-13T16:14:24+05:30 IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారైంది...

TG : Bandi Sanjay పాదయాత్ర పేరు ఖరారు..

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారైంది. ‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’గా కమలదళం ఖరారు చేసింది. మరికాసేపట్లో నగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద అధికారికంగా బీజేపీ నేతలు ప్రకటించనున్నారు. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాకే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సంజయ్‌ పాదయాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వారం రోజుల పాటు ఆయన అక్కడ పర్యటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 24న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.


పాదయాత్ర ఇలా..!

తొలిదశలో సుమారు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రోజున పాదయాత్ర మెహదీపట్నం మీదుగా షేక్‌పేటకు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం గోల్కొండ కోట వద్ద జరిగే సభలో సంజయ్‌ పాల్గొంటారు. చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్‌, సదాశివపేట, సంగారెడ్డి, జోగిపేట ద్వారా మెదక్‌ చేరుకుంటారు. ప్రతిపాదిత రూట్‌మ్యాప్‌ హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే వరకు కొనసాగుతుందని, షెడ్యూల్‌ విడుదలయ్యాక అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. మరోవైపు, సంజయ్‌ పాదయాత్ర విజయవంతానికి పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లిపోయాయి. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఇప్పటికే 30 నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-08-13T16:14:24+05:30 IST