అధికారులు, పోడు రైతుల మధ్య ఘర్షణ!
ABN , First Publish Date - 2021-09-17T09:21:21+05:30 IST
పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మఽధ్య భూపాలపల్లి జిల్లాలో గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. భూపాలపల్లి మండలం పందిపంపులలో అటవీశాఖ తరపున పది హెక్టార్లలో పండ్ల మొక్కలను పెట్టగా, రైతులు వాటిని తొలగించి పత్తి
- పెట్రోలు, పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన
- ఎఫ్ఆర్వో దివ్యకు గాయాలు
కాకతీయఖని, సెప్టెంబరు 16: పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య భూపాలపల్లి జిల్లాలో గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. భూపాలపల్లి మండలం పందిపంపులలో అటవీశాఖ తరపున పది హెక్టార్లలో పండ్ల మొక్కలను పెట్టగా, రైతులు వాటిని తొలగించి పత్తి పంటను సాగు చేస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది గురువారం పందిపంపులకు వెళ్లి ఆ పంటను తొలగించారు. ఆగ్రహించిన రైతులు పెట్రోల్, పురుగుల మందుడబ్బాలతో ఆందోళనకు దిగారు. విషయం తెలిసి, ఆజాంనగర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి దివ్య తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికిరాగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణకు దారితీయడంతో రైతులు ఒకదశలో దివ్యపై, ఆమె వాహనంపై పెట్రోల్ పోసి, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దూదేకులపల్లి రేంజ్ వెన్నెలమడుగు సెక్షన్ అధికారి మోహన్‌పైనా దాడిచేశారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి ఎఫ్ఆర్వో దివ్యను, సిబ్బందిని చికిత్స నిమిత్తం భూపాలపల్లి పీహెచ్సీకీ తరలించారు. కాగా రైతులు ఎఫ్ఆర్వో దివ్యపై ఏకపక్షంగా దాడికి దిగారని, ఘర్షణలో ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసు పోయిందని డీఎ్‌ఫవో కృష్ణప్రసాద్ తెలిపారు.
రైతులు మాత్రం తాము దాడికి పాల్పడలేదని చెబుతున్నారు. గతంలో కూడా తమపంటలను నాశనం చేయడంతో జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశామని, ఇటీవల 10 ఎకరాల్లో చేతికొచ్చిన పత్తి పంటను ధ్వంసం చేయడం మూలంగా సుమారు రూ.10లక్షలు నష్టం వాటిల్లిందని తెలిపారు. గురువారం ఎఫ్ఆర్వో దివ్య తమ పంటలను నాశనం చేయడంతో ఆవేదనతో పెట్రోల్, మందుడబ్బాలతో నిరస వ్యక్తం చేశామన్నారు. ఈ క్రమంలో ఎఫ్ఆర్వో తమ వద్ద నుంచి బాటిల్‌ను లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు పెట్రోల్ ఒలికి అక్కడున్న పలువురిపై, వాహనంపైన పడిందని అన్నారు. ఎఫ్ఆర్వో దివ్యను జిల్లా ఫారెస్ట్ అధికారి భూక్య లావణ్య పరామర్శించారు.