నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ!
ABN , First Publish Date - 2021-07-13T05:56:47+05:30 IST
చిక్కు ముడి వీడింది..
కొత్త జిల్లాలుగా... హన్మకొండ, వరంగల్
ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు
హన్మకొండ జిల్లాలో పరకాల, దామెర, నడికూడ మండలాలు
వరంగల్ జిల్లాలో వరంగల్, ఖిలా వరంగల్ మండలాలు
‘వరంగల్ రూరల్’ కలెక్టరేట్ సమస్యకు ఎట్టకేలకు తెర
ఇక నగర పరిధిలో రెండు జిల్లాల కలెక్టరేట్లు
వరంగల్(ఆంధ్రజ్యోతి): చిక్కు ముడి వీడింది.. సీఎం హామీ నెరవేరింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల స్వరూపాలను మారుస్తూ హన్మకొండ, వరంగల్ జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు 30 రోజుల గడువు విధించింది. గత నెల 21న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా విభజించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆమోదం ఉంటే తప్పకుండా రెండు మూడు రోజుల్లోనే జీవో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఆ సమయంలో హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వరంగల్ నగరం రెండు జిల్లాలకు కేంద్రంగా మారుతోంది.
హన్మకొండ జిల్లాలో పరకాల, నడికూడ, దామెర మండలాలను విలీనం చేస్తున్నారు. దీంతో హన్మకొండ జిల్లాలో అదనంగా పరకాల మునిసిపాలిటీ చేరినట్టయింది. అదే విధంగా పరకాల రెవెన్యూ డివిజన్ కేంద్రంగానూ ఉన్నది. భౌగోళికంగా పరకాల, నడికూడ మండలాలు కమలాపూర్, హసన్‌పర్తి మండలాల సరిహద్దులకు ఆనుకొని ఉంటాయి. గూనిపర్తి, అంబాల, ఎర్రగట్టు గుట్ట ద్వారా ఇదే దారిలో నడికూడ ప్రజలు హన్మకొండకు చేరుకోవాల్సి ఉంటుంది. దామెర మండల ప్రజలు మాత్రం మరో జిల్లా సరిహద్దును దాటి రావాల్సిందే.
కొత్త జిల్లాలు రెవెన్యూ మండలాల ఆధారంగా ఏర్పడ్డాయి. వరంగల్ జిల్లాలో అదనంగా వరంగల్, ఖిలా వరంగల్ మండలాలు చేరుతున్నాయి. గతంలో ప్రతిపాదించినట్లుగా వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాలను హన్మకొండ జిల్లాలో కాకుండా వరంగల్ జిల్లాలో చేర్చారు. ఈ మండలాల ప్రజలు తమకు హన్మకొండ కంటే వరంగల్ జిల్లాలో చేర్చితేనే సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారని ప్రజాప్రతినిధులు అంటున్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల సరిహద్దు గ్రామాలు వరంగల్ మండల సరిహద్దును ఆనుకుని ఉంటాయి. వ్యవసాయ మార్కెట్, కూరగాయల మార్కెట్, ఎరువులు, విత్తనాలు దుకాణాలన్నీ కూడా వరంగల్‌లోనే ఉన్నాయి.
హన్మకొండ జిల్లాలోకి పరకాల రెవెన్యూ డివిజన్ విలీనమయ్యే ప్రతిపాదన ఉన్నందున ప్రత్యామ్నాయంగా వర్ధన్నపేటను కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. వర్ధన్నపేట రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటయితే వరంగల్ (రూరల్) జిల్లాలో ఎప్పటిలాగానే మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలుంటాయి. హన్మకొండ జిల్లాలోనూ హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఉంటాయి. జిల్లాల నోటిఫికేషన్లో మాత్రం వర్ధన్నపేట రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రస్తావన లేదు.
సలహాలు, అభ్యంతరాలకు 30 రోజులు
జిల్లాల విభజనకు సంబంధించి ఏవైనా సలహాలు లేదా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. జిల్లాల విభజనకు సంబంధించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా వీటి ప్రతులను అందుబాటులో ఉంచుతారు. 30 రోజుల అనంతరం పూర్తి స్థాయిలో జిల్లాల విభజనకు సంబంధించి గెజిట్ విడుదల చేస్తారు.
కలెక్టరేట్ పేచీకి పరిష్కరం
ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లాలో 16 మండలాలు ఉండగా, దాని స్థానంలో కొత్తగా ఏర్పడిన వరంగల్ జిల్లాలో 15 మండలాలు ఉండబోతున్నాయి. రూరల్ జిల్లా కలెక్టరేట్ భవనం కోసం కొన్నేళ్లుగా స్థలం విషయంలో పేచీ ఏర్పడిన తెలిసిందే. ముందుగా అన్ని జిల్లాలతో పాటుగా గీసుగొండ మండలం రెడ్డిపాలెం శివారులో కలెక్టరేట్ ఏర్పాటు చేయడానికి ముందుకెళ్లగా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆగిపోయింది. ఆనాటి నుంచి జిల్లాకు కేంద్రం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపినా కొలిక్కి రాలేదు. తాజాగా వరంగల్ జిల్లా ఏర్పాటుతో కలెక్టరేట్ వివాదం సమసిపోయినట్లయింది.
పరకాల నియోజకవర్గం రెండు ముక్కలు
వరంగల్ రూరల్ జిల్లాలో ఇప్పటి వరకు వర్ధన్నపేట నియోజకవర్గం రెండు జిల్లాలో కొనసాగగా, తాజాగా పరకాల నియోజకవర్గం సైతం రెండు జిల్లాల పరిధికి మారింది. నియోజకవర్గంలోని పరకాల, దామెర, నడికూడ మండలాలు హన్మకొండ జిల్లాలోకి మారగా, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు మండలాలతో పాటుగా రెండు నగర పాలక సంస్థ డివిజన్లు వరంగల్ జిల్లాలో కొనసాగనున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలాలు మాత్రం యధావిధిగా వరంగల్ జిల్లాలోనే ఉండబోతున్నాయి.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు : మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజా ప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్.. జిల్లాల ఏర్పాటుపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
‘వరంగల్’కు మహర్దశ: ఎమ్మెల్యే నరేందర్
వరంగల్ టౌన్, జూలై 12: వరంగల్ తూర్పు నియోజకవర్గం కేంద్రంగా వరంగల్ జిల్లాను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం మార్గనిర్దేశకత్వంలో వరంగల్ పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు పరిపాలన సౌకర్యవంతంగా అందేం దుకు, వరంగల్ తూర్పుతో పాటు అన్ని ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎంకు వరంగల్ ప్రజలు రుణపడి వుంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావులకు కూడా ఽధన్యవాదాలు తెలిపారు.