జోరు వాన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం
ABN , First Publish Date - 2021-06-16T08:45:50+05:30 IST
రాష్ట్రంలో వాన జోరు కొనసాగుతోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కొన్ని చోట్ల భారీ వర్షం కురవగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడింది.
- పెద్దపల్లిలో అత్యధికంగా 12.54 సెంటీమీటర్లు
- ఉప్పొంగి ప్రవహించిన వాగులు, వంకలు
- కాళేశ్వరం ప్రాజెక్టు సరస్వతి బ్యారేజీలోకి నీరు
- మంచిర్యాలలో లోతట్టు ప్రాంతాలు జలమయం
- ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): రాష్ట్రంలో వాన జోరు కొనసాగుతోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కొన్ని చోట్ల భారీ వర్షం కురవగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడింది. పెద్దపల్లి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లిలో 12.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ధర్మారం మండలంలో 11.92 సెంటీమీటర్ల్లు, కమాన్పూర్ మండలంలో 11.78 సెంటీమీటర్ల్లు, కాల్వశ్రీరాంపూర్ మండలంలో 10.64 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి హుస్సేన్మియా వాగు గుండా మానేరులోకి పెద్ద ఎత్తున వరద వెళ్లడంతో ఆ నీళ్లన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతీ బ్యారేజీలోకి వెళ్లాయి. ధర్మారం మండలంలో ఖాన్సాయిపేట వాగు ఉధృతంగా ప్రవహించింది. వర్షం కారణంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
మంచిర్యాల జిల్లాలో వర్షానికి రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. తాండూరు మండలంలో అత్యఽధికంగా 7.3 సెంటీమీటర్లు, జైపూర్లో 7.0 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా సింగరేణి ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జోరువాన కురిసింది. పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో అత్యధికంగా వాంకిడిలో 11.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి కుమ్రం భీం, వట్టివాగు ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ మంగళవారం ఉదయం వరకు జోరు వాన కురిసింది. జిల్లాలో అత్యధికంగా నార్నూర్ మండలంలో 8.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పంటల సాగుకు సరిపడా వర్షాలు కురియడంతో జిల్లా వ్యాప్తంగా సాగు పనులు ఊపందుకున్నాయి. నిర్మల్ జిల్లా బాసర మండలంలో సోమవారం రాత్రి మూడు గంటల పాటు భారీ వర్షం కురిసింది. బాసరలో అత్యధికంగా 10 సెంటీమీటర్లుగా నమోదైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.