బండి అమ్మినా చలానా వస్తోందా?

ABN , First Publish Date - 2021-03-14T07:40:33+05:30 IST

ఇది కేవలం ఇద్దరి సమస్య కాదు. వేలాది మంది ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికైతే..

బండి అమ్మినా చలానా వస్తోందా?

    • ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయా?..
    • అయితే తస్మాత్‌ జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి
    • లఘు చిత్రంతో వాహనదారులకు
    • అవగాహన కల్పిస్తున్న పోలీసులు


    రమేశ్‌ ఇటీవలే కొత్త బైక్‌ కొన్నాడు. తన పాతబండిని వేరే వ్యక్తికి అమ్మేశాడు. కానీ.. ఆ బైక్‌ పేరుతో ట్రాఫిక్‌ ఉల్లంఘన చలానాలు రమేశ్‌ ఇంటికి వస్తున్నాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసు నమోదు కాగానే.. తన ఫోన్‌ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ వస్తోంది. బైక్‌ కొనుగోలు చేసిన వ్యక్తికి ఫోన్‌ చేసి విషయం చెప్పగా.. ‘ఆ బైక్‌ నేను వేరేవాళ్లకు వెంటనే అమ్మేశాను’ అని సమాధానం చెప్పాడతను. కానీ బండి మాత్రం ఇంకా రమేశ్‌ పేరుమీదనే ఉండటంతో కేసులు, చలానాలు అన్ని అతనికే వస్తున్నాయి. త్వరలోనే చార్జిషీట్‌ ఫైల్‌ చేస్తామని పోలీసుల నుంచి సమాచారం రావడంతో అతను ఆందోళన చెందుతున్నారు. 


    మధు ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. మూడేళ్ల క్రితం తన ఇంట్లో పెట్టిన బైక్‌ చోరీకి గురైంది. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసి కొత్త బైక్‌ తీసుకున్నారు. కానీ. గత ఏడాది కాలంగా ఖమ్మం, హైదరాబాద్‌, సైబరాబాద్‌ లిమిట్స్‌లో అతడి పాత బైక్‌పై ట్రాఫిక్‌ ఉల్లంఘనలు కేసులు నమోదైనట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. ఇప్పటికి చలానాల సంఖ్య 30 దాటింది. చార్జిషీట్‌ ఫైల్‌ చేసి కోర్టుకు పంపుతామంటూ ట్రాఫిక్‌ పోలీసుల నుంచి సమాచారం వచ్చింది. ఆ బైక్‌ను ఎలా పట్టుకోవాలో మధుకు అర్థం కావడంలేదు. 


    (హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి): ఇది కేవలం ఇద్దరి సమస్య కాదు. వేలాది మంది ఇదే తరహాలో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికైతే.. వాహనం తమ వద్దే ఉన్నా కూడా ట్రాఫిక్‌ చలానాలు పడుతున్నాయి. దీనికి కారణం.. వారి నంబర్‌ ప్లేట్‌పై ఉన్న రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను వేరే వాళ్లు వాడడమే.  ఇలాంటి వారి ఇబ్బందులను గుర్తించిన సైబరాబాద్‌ పోలీసులు..  వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యను ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి ఎలా తీసుకెళ్లాలి అనే విషయమై లఘు చిత్రాన్ని నిర్మించి సోషల్‌మీడియా, యూట్యూబ్‌లో పెట్టి నెటిజన్‌లకు అవగాహన కల్పిస్తున్నారు.


    వాహనం సీజ్‌.. 

    మీ కంప్లైంట్‌ రిజిస్టర్‌ కాగానే ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌, ఈ చలాన్‌ సైట్లో వివరాలు నమోదవుతాయి. దాంతో మీరు అమ్మేసిన వాహనం పోలీసుల కంటపడినా, ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినా సిస్టంలో ఈ చాలానా తీసుకోదు. సోల్డ్‌ అవుట్‌ వెహికిల్‌ అని పోలీసులను అలర్టు చేస్తుంది. పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని సీజ్‌ చేస్తారు. ఆ వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి.. దాని పాత యజమానిని కలిసి, ఓనర్‌షిప్‌ రైట్స్‌ మార్చుకొని, మొత్తం పెండింగ్‌ చాలానాలు కట్టిన తర్వాతనే తిరిగి వాహనాన్ని అప్పగిస్తారు.


    వాహనం చోరీకి గురైతే...

    వాహనం చోరీకి గురైన కొన్ని నెలల తర్వాత రాష్ట్రంలో ఎక్కడో ఓ మూల నుంచి ట్రాఫిక్‌ చలానా కేసులు నమోదవుతున్నాయా? అప్పుడు వెంటనే వాహనదారులు అప్రమత్తం కావాలి. ఈ విషయమై దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఆ విషయాన్ని చలానా నమోదైన ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తెలియజేయాలి. ఫలానా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పి ఎ్‌ఫ్‌ఐఆర్‌ కాపీని పంపాలి. దాంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆ వాహనాన్ని తెఫ్ట్‌ వెహికిల్‌గా సిస్టంలో రిజిస్టర్‌ చేస్తారు. దాంతో ఆ వాహనంపై మరోసారి ట్రాఫిక్‌ చలానా జనరేట్‌ అయ్యే సమయంలో తెఫ్ట్‌ వెహికిల్‌గా పోలీసులను అలర్ట్‌ చేస్తుంది. పోలీసులు దానిపై నిఘాపెట్టి సీజ్‌ చేస్తారు. 


    ఏంచేయాలంటే..

    1. వాహనం అమ్మేసిన వ్యక్తి.. కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోయినా, మన నంబర్‌ ప్లేట్‌ను తస్కరించి వేరేవారు వాడినా ఇలా చేయాలి. 
    2. తెలంగాణ పోలీస్‌ ఈ చలాన్‌ (https://echallan.tspolice.gov.in/) వెబ్‌సైట్లోకి వెళ్లాలి. 
    3. ఓపెన్‌ అయిన వెబ్‌ పేజీలో.. కంప్లైంట్స్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. అక్కడ ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌, సోల్డ్‌ అవుట్‌ వెహికిల్‌ అని రెండు ఆప్షన్స్‌ ఉంటాయి.
    4. మీ వాహనాన్ని అమ్మి ఉంటే.. సోల్డ్‌ అవుట్‌ ఆప్షన్‌, మీ నంబర్‌ ప్లేట్‌ను వేరే ఎవరైనా ఉపయోగి స్తున్నట్టయితే ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. సోల్డ్‌ అవుట్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే.. అక్కడ కంప్లైంట్‌ పేజీ వస్తుంది. ఫేక్‌ నంబర్‌ ప్లేట్‌ అయితే అది క్లిక్‌ చేయాలి.
    5. వచ్చిన కంప్లైంట్‌ పేజీలో మీరు అమ్మేసిన వాహనం నంబర్‌, అడ్రస్‌, ఇతర వివరాలు, మీకు చలానాలు వస్తున్న రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.
    6. వివరాలు ఎంటర్‌ చేసిన తర్వాత సబ్‌మిట్‌ చేయాలి. 
    7. ఇప్పుడు రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడి బాక్స్‌లో ఎంటర్‌ చేయాలి. 
    8. చివరగా మీరు నమోదు చేసిన వివరాలన్నీ రిజిస్టర్‌ అయినట్లు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. 
    9. దాంతో మీ సమస్య కేవలం 5 నిమిషాల్లో పరిష్కారం అవుతుంది. ఇక మీకు ట్రాఫిక్‌ ఉల్లంఘన చలానాలు రాకుండా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకుంటారు.

    Updated Date - 2021-03-14T07:40:33+05:30 IST