కీలక ప్రాజెక్టులే బోర్డుల పరిధిలోకి

ABN , First Publish Date - 2021-08-31T09:32:59+05:30 IST

శ్రీశైలం, నాగార్జున సాగర్‌, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, శ్రీశైలం ఎడమ కాల్వ తదితర ప్రాజెక్టులనే బోర్డుల పరిధిలోకి తీసుకోవాలని, మిగిలిన ప్రాజెక్టులను

కీలక ప్రాజెక్టులే బోర్డుల పరిధిలోకి

వాటిలో శ్రీశైలం, సాగర్‌, కల్వకుర్తి, ఎడమ కాల్వ

గోదావరి సహా మిగిలినవన్నీ రాష్ట్రాల పరిధిలోనే

బోర్డులకు లేఖ రాయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం


హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జున సాగర్‌, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, శ్రీశైలం ఎడమ కాల్వ తదితర ప్రాజెక్టులనే బోర్డుల పరిధిలోకి తీసుకోవాలని, మిగిలిన ప్రాజెక్టులను రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని కృష్ణా, గోదావరి బోర్డులను తెలంగాణ కోరనుంది. అలాగే, గోదావరి నదిపై నిర్మించిన ఏ ప్రాజెక్టుపైనా అభ్యంతరాలు లేకపోయినా, వాటిని బోర్డుల పరిధిలోకి తీసుకెళ్లడంపైనా ఆక్షేపణ వ్యక్తం చేయనుంది. ఈ మేరకు శ్రీశైలం, సాగర్‌, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు మంజూరైన ఉద్యోగుల వివరాలను మాత్రమే బోర్డుకు అందించాలని, మిగిలిన ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. గెజిట్‌ అమలు, తదుపరి కార్యాచరణపై చర్చించడానికి సెప్టెంబరు ఒకటో తేదీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా, కృష్ణా నదిపై నిర్మించిన కొన్ని ప్రాజెక్టుల ఉద్యోగుల వివరాలనే సమర్పించాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు గత వారం రోజులుగా నీటిపారుదల శాఖ కసరత్తు చేసింది. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ మినహా మిగిలిన ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకెళ్లొద్దు.


వాటిని రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలి’’ అంటూ కొద్ది రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. కృష్ణా ప్రాజెక్టులపై ఉద్యోగుల వివరాలను ఏపీ అందించినందున... తెలంగాణ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. బోర్డుల పరిధిలో ఏయే ప్రాజెక్టులు ఉండాలో వాటి వివరాలు మాత్రమే ఇచ్చామని, మిగిలిన వివరాలు అందజేయలేదని ఏపీకి చెందిన కీలక అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో, ఏపీ తరహాలోనే గోదావరి ప్రాజెక్టుల్లో ఉద్యోగుల వివరాలను కూడా ఇవ్వకూడదని తెలంగాణ భావిస్తోంది. వాటిపై బోర్డులకు పెత్తనం ఇస్తే.. ఆర్థిక భార మే కాకుండా అనవసరమైన సమస్యలు పెరిగే అవకాశాలున్నాయని తెలంగాణ గుర్తించింది.


గోదావరిపై అభ్యంతరాలకు చాన్స్‌

కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి భేటీలో గోదావరి ప్రాజెక్టులపై చర్చ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. గోదావరి నదిపై ప్రాజెక్టులను తెలంగాణ తొలి నుంచీ కీలకంగా భావిస్తోంది. వాటిపై ఎటువంటి అభ్యంతరాలూ లేవని, అటువంటప్పుడు వాటిని బోర్డు పరిధిలోకి తీసుకెళ్లడం ఎందుకని ప్రశ్నిస్తోంది.


అదే సమయంలో, కృష్ణాకన్నా గోదావరి ప్రాజెక్టులే కీలకమని, గోదావరి డెల్టా నుంచి కృష్ణా డెల్టాకు తెలంగాణ నీటిని తరలిస్తోందని, తెలంగాణలో అవి పూర్తయితే రాష్ట్రంలోని గోదావరి డెల్టా ఎడారిగా మారుతుందని ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోదావరిపై నిర్మాణంలో ఉన్న పోలవరంతోపాటు పాత ప్రాజెక్టు ధవళేశ్వరాన్ని గెజిట్‌లో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ రెండింటికీ అంతర్రాష్ట్ర వివాదాలు ఎక్కడున్నాయని ఏపీ ప్రశ్నిస్తోంది. గోదావరి ప్రాజెక్టులపై గెజిట్‌ను స్వాగతిస్తే మొదటికే మోసమని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేనా, కృష్ణా ప్రాజెక్టుల గెజిట్‌ను ఆది నుంచీ ఏపీ స్వాగతించినా.. అనంతర కాలంలో దాని అమలు పర్యవసానాలు ఏపీకి తెలిసి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతోనే ఏపీకి కీలకమని భావించే పలు ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే, రెండు రాష్ట్రాలూ ఎవరి వాదన వారు వినిపించే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. దాంతో, గోదావరి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదురుతుందా...? అనే ఆసక్తి నెలకొంది.

Updated Date - 2021-08-31T09:32:59+05:30 IST