4 గంటల్లో రచ్చ రచ్చ

ABN , First Publish Date - 2021-05-19T07:49:45+05:30 IST

పాలు, కూరగాయల కోసం పొద్దున్నే బయటికి రావడం సహజం. సరుకుల కోసం కాస్త ఉదయం 10 దాటాకా వెళ్తాం.

4 గంటల్లో రచ్చ రచ్చ

  • లాక్‌డౌన్‌ వేళ భౌతిక దూరం గాలికి..
  • మార్కెట్లు, బజార్లలో గుంపులుగా జనం
  • అన్ని వ్యాపారాలకూ అనుమతిపై విమర్శలు
  • ఇలాగే ఉంటే ఉపయోగం లేదు: నిపుణులు
  • లాక్‌డౌన్‌ ఆంక్షల విధింపులో మహారాష్ట్ర, 
  • ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాలే ఆదర్శమని వెల్లడి


హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): పాలు, కూరగాయల కోసం పొద్దున్నే బయటికి రావడం సహజం. సరుకుల కోసం కాస్త ఉదయం 10 దాటాకా వెళ్తాం. షాపింగ్‌ అంటే సాధారణంగా సాయంత్రం పూటే! మద్యం ప్రియులకు పొద్దున 11 దాటితే గానీ ‘మందు’ దొరకదు!! కానీ.. లాక్‌డౌన్‌ పేరుతో వీటన్నిటికీ పొద్దున ఆరు నుంచి 10 గంటల దాకా గేట్లు బార్లా తెరిచేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ సమయంలో జనం వీధుల్లో కిక్కిరిసిపోతున్నారు. సూపర్‌ మార్కెట్లలో ఎగబడి షాపింగ్‌ చేస్తున్నారు. షాపింగ్‌ బిల్లులు చెల్లించడానికి చాంతాడంత క్యూల్లో నిలబడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రాష్ట్రవ్యాప్తంగా పొద్దున 6-10 గంటల మధ్య నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎటు చూసినా జనమే. కూరగాయల మార్కెట్లు, సంతలు, దుకాణాలు, వైన్‌ షాపులు, వ్యాపార సంస్థలు.. అన్ని చోట్లా జన జాతరే! అందునా.. ఉదయం 8 గంటల దాకా చాలా మంది నిద్ర లేవరు. దీంతో 8 నుంచి 10 గంటల మధ్య జనం రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా.. రోజు మొత్తం జరిగే అమ్మకాలు ఈ నాలుగు గంటల్లోనే జరిగిపోతున్నాయి. ఉదాహరణకు.. తాము రోజుకు 250 కిలోల చికెన్‌, 135 కిలోల మటన్‌ అమ్ముతామని, లాక్‌డౌన్‌ పెట్టినప్పటి నుంచి నాలుగు గంటల్లోనే అంతస్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయని ఒక వ్యాపారి చెప్పారు. ఇలా నిత్యం నిర్ణీత సమయంలో జనం పోటెత్తుతుండడంతో.. లాక్‌డౌన్‌ పెట్టిన ఫలితం లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఈ పరిస్థితి చూస్తే.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది రద్దీని తగ్గించడానికా.. పెంచడానికా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది లాక్‌డౌన్‌ విధించినప్పుడు నిత్యావసర వస్తువులు రాత్రి ఏడు గంటల వరకూ అందుబాటులో ఉండేవి. ఫర్నిచర్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఉపకరణాల దుకాణాలు, మాల్స్‌ పూర్తిగా మూతబడి ఉండేవి. కానీ, ఈసారి అలా కాకుండా.. అన్నింటికీ 6 నుంచి 10 దాకా అనుమతి ఇవ్వడమే సమస్యలకు దారితీస్తోంది. అందుకే హైకోర్టు కూడా ఈ సమస్యపై దృష్టి సారించాల్సిందిగా సూచించింది. కాగా.. ఈ వేళలు పోలీసులకు అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఉదయం పది దాకా ఎవరు వీధుల్లోకి వచ్చినా పట్టించుకోవాల్సిన పనిలేదు. తర్వాత వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఏవీ తెరిచి ఉండవు కాబట్టి పెద్దగా ఎవరూ బయటకు రారు. దీంతో పోలీసులకు పని తగ్గింది. కాగా.. 10 గంటల తర్వాత కూడా పలువురు రాజకీయ నాయకులు పెద్దకార్యక్రమాలు నిర్వహిస్తూ లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. ఉదాహరణకు.. వికారాబాద్‌ జిల్లాలో మంగళవారం పరిగి ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ చేపట్టారు. ఆ కార్యక్రమానికి వచ్చి ఆయన చేతుల మీదుగా చెక్కు తీసుకున్న ఒక మహిళకు.. ఆ తర్వాత కొద్దిగంటల్లోనే పాజిటివ్‌ అని తేలింది.


కేరళ, మహారాష్ట్రలో అలా..

కరోనా కేసుల తీవ్రతలో మహారాష్ట్ర కొద్ది నెలలుగా దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. అక్కడ పాజిటివిటి రేటు గత నెలలో 25 శాతానికి పైగా ఉంది. అలాగే కేరళలోనూ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. మన రాష్ట్రంలో సైతం నెలరోజులుగా కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నా.. ప్రభుత్వం మాత్రం లెక్కలు తక్కువగా చేసి చూపుతోందన్న విమర్శలున్నాయి. అయితే లాక్‌డౌన్‌తో కేరళ, మహారాష్ట్ర పాజిటివిటీ రేటును తక్కువకాలంలోనే చాలావరకు తగ్గించుకోగలిగాయి. ఏ రాష్ట్రంలో నిబంధనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. 


మహారాష్ట్ర.. 

మహారాష్ట్రలో ఏప్రిల్‌ 21న లాక్‌డౌన్‌ విధించారు. జూన్‌ 1 దాకా అక్కడ లాక్‌డౌన్‌ ఉంటుంది. ఆ నిబంధనల ప్రకారం..

ఇతర రాష్ట్రాలవాసులు మహారాష్ట్రలో అడుగుపెట్టాలంటే నెగెటివ్‌ ఆర్టీపీసీఆర్‌ రిపోర్ట్‌ తప్పనిసరి.

కూరగాయలు, కిరాణా, పాలు లాంటి నిత్యవసర వస్తువుల దుకాణాలకు ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ అనుమతి. ఇతర ఏ వ్యాపారాలైనారాత్రి 8 గంటల వరకూ హోం డెలివరీకి మాత్రమే అనుమతి.

వివాహ వేడుకలు 2 గంటల్లోనే ముగించాలి. గరిష్ఠంగా 25 మందికే అనుమతి.


కేరళ.. 

అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్‌ నిబంధనలను రాష్ట్రం మొత్తానికీ వర్తింపజేస్తే.. కేరళ మాత్రం పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న  జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

రాజధాని తిరువనంతపురంతోపాటు ఎర్నాకుళం, త్రిస్సూర్‌, మలప్పురం జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉండటంతో ఆ జిల్లాల సరిహద్దులు మూసివేశారు. ఇతర జిల్లాల ప్రజలను ఆ జిల్లాల్లోకి అనుమతించట్లేదు.

కూరగాయలు, కిరాణాలు 2 రోజులకోసారి తెరవాలి. వీటికి మధ్యాహ్నం 2గంటల వరకు అనుమతి ఉంది. 

రెస్టారెంట్లు, హోటళ్లకు ఉదయం 7 నుంచి రాత్రి 7.30 వరకు పార్శిల్‌ సేవలు అందించేందుకు అనుమతి.

కరోనాకు గురైనవారి కుటుంబాలు, ప్రైమరీ కాంటాక్టులు ఉన్నవారు బయటికి రాకుండా వారి ఇళ్లకు ప్రభుత్వం సీల్‌ వేస్తోంది. వారికి కావాల్సిన నిత్యవసరాలను ప్రభుత్వమే అందిస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉన్న నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలును కేరళ ప్రభుత్వం డ్రోన్‌లతో పాటు జియో ఫెన్సింగ్‌ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తోంది.


కర్ణాటకలో..

కర్ణాటకలో మనలాగానే తొలుత వారాంతపు కర్ఫ్యూ విధించారు. ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో ప్రయోగాత్మకంగా విధించిన ఆ కర్ఫ్యూను తర్వాత కొనసాగించారు. అచ్చం మనలాగానే ఉదయం 6-10 గంటల నడుమ నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు వీలు కల్పించారు. ఆ సమయంలో మద్యం విక్రయాలకూ అనుమతిచ్చారు. కానీ,నిత్యావసరాల ముసుగులో అన్ని వ్యాపారాలూ తెరుచుకోవడంతో దీనివల్ల ఏ ఉపయోగమూ లేకపోయింది. కర్ఫ్యూతో కేసులు అదుపులోకి రాకపోవడంతో మే 10 నుంచి 14 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 12 గంటల నడుమ నిత్యావసర వస్తువుల విక్రయాలు మాత్రమే జరుగుతున్నాయి. దీంతో.. ఆరు రోజుల తర్వాత, అంటే మే 16 నుంచి కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపించడం మొదలైంది.  


ఇలా ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు ఆదరాబాదరాగా గుమిగూడడం తగ్గింది. అటు ఢిల్లీలో మద్యం దుకాణాలు బార్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసివేసి కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అక్కడ ఏప్రిల్‌ 19న లాక్‌డౌన్‌ విధించేనాటికి రోజువారీ కేసుల సంఖ్య 23,686. లాక్‌డౌన్‌ వల్ల కేసులు తగ్గుతూ వచ్చి మే 17 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 4,524కు చేరింది. మహారాష్ట్రలో ఏప్రిల్‌ 21 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 67,468గా నమోదైంది. మే 17 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 26,616కు చేరింది. లాక్‌డౌన్‌ను సరిగ్గా అమలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ గణాంకాలే ఉదాహరణ. ఏపీలో మే 5న 18 గంటల కర్ఫ్యూ విధించారు. ఉదయం 6 నుంచి 12 దాకా అన్ని దుకాణాలనూ తెరిచి ఉంచుతున్నారు. అక్కడ మే 5న రోజువారీ కేసుల సంఖ్య 22,204గా నమోదు కాగా.. మే 17 నాటికి ఆ సంఖ్య 18,561గా ఉంది. అది కూడా ముందురోజు ఆదివారం కాబట్టి టెస్టుల సంఖ్య తగ్గడం వల్లే కేసుల సంఖ్య కూడా తగ్గింది. మే 16న ఏపీలో నమోదైన రోజువారీ కేసుల సంఖ్య 24,171. ఈ తరహా విధానం ఎందుకూ పనికిరాదని ఏపీ మోడల్‌ ద్వారా రుజువైంది. ఇప్పుడు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నదీ ఏపీ తరహా విధానమే. కాబట్టి, మన రాష్ట్రంలో కూడా ప్రస్తుత విధానాన్ని మార్చి నిత్యావసరాలు ఎక్కువ సేపు అందుబాటులో ఉండేలా చేసి.. మిగతా దుకాణాలను మూసేస్తే రద్దీ, తొక్కిసలాట తగ్గుతాయని.. తద్వారా కేసులు కూడా తగ్గుతాయని ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ తరహా నిబంధనలను మన దగ్గర అమలుచేస్తేనే ఫలితాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు.

Updated Date - 2021-05-19T07:49:45+05:30 IST