రామప్ప శిల్పకళ అపూర్వం.. అద్భుతం

ABN , First Publish Date - 2021-12-19T07:19:40+05:30 IST

రామప్ప ఆలయం అపూర్వం, అనిర్వచనీయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

రామప్ప శిల్పకళ అపూర్వం.. అద్భుతం

  • శిల్పాలు నవరస సమ్మేళనంగా ఉన్నాయి
  • సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ
  • రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు


ములుగు, డిసెంబరు 18: రామప్ప ఆలయం అపూర్వం, అనిర్వచనీయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. వందల ఏళ్ల క్రితమే మన పెద్దలు అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకున్నారనడానికి రామప్ప గొప్ప రుజువు అని కొనియాడారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సీజేఐ కుటుంబ సమేతంగా సందర్శించారు. సాయంత్రం 5.12 గంటలకు రామప్ప చేరుకున్న రమణ దంపతులకు ఆలయ పూజారులు సంప్రదాయ పద్ధతిలో తలపాగా ధరింపజేసి పూలమాలలు వేసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక్కడ కొలువైన రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రంగమండపంలో అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. గైడ్‌ల ద్వారా ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. శిల్పాలను ఆసక్తిగా తిలకిస్తూ సుమారు గంటపాటు ఆలయ ప్రాంగణంలో గడిపారు. శాండ్‌బాక్స్‌ టెక్నాలజీని ఉపయోగించి రామప్ప ఆలయాన్ని నిర్మించారని జస్టిస్‌ రమణకు ఇన్‌టాక్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు వివరించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. శిల్పాలు నవరస సమ్మేళనంగా అద్భుతంగా ఉన్నాయన్నారు. తెలుగు నేలపై ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా విశ్వ వీధుల్లో రామప్ప పేరు మార్మోగడం గర్వకారణమన్నారు. 


మీ ప్రసంగం మాకెంతో స్ఫూర్తిదాయకం

వెంకటాపూర్‌ (రామప్ప): సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ రామప్ప సందర్శన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గతంలో మహిళా న్యాయవాదుల సదస్సులో మాతృ భాషపై జస్టిస్‌ రమణ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ‘తెలుగు తల్లి మురిసింది’ శీర్షికన వెంకటాపూర్‌ మం డలం పాలంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించారు. దూరం నుంచే దానిని చూసిన సీజేఐ నేరుగా వారి వద్దకు వెళ్లారు. ‘మీ ప్రసంగం మాకెంతో స్ఫూర్తిని ఇచ్చింది’ అని షారున్‌, సాయి హర్షిణి అనే విద్యార్థినులు అనడంతో సీజేఐ మురిసిపోయారు. భరతమాత వేషధారణలో జాతీయ పతాకంతో వచ్చిన మరో విద్యార్థిని చందనాల అశ్వినిని అభినందించారు. శ్రద్ధగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించారు. వారితో కలిసి ఫొటో దిగారు.


నేడే న్యాయభవన సముదాయ ప్రారంభోత్సవం

హనుమకొండ లీగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోర్టు ఆవరణలో రూ.23.30కోట్లతో నిర్మించిన నూతన న్యాయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు సీజేఐ ఎన్వీ రమణ దీనిని ప్రారంభిస్తారు. కోర్టు భవన సముదాయాన్ని మొత్తం రూ.21.65 కోట్లతో నిర్మించగా.. మొత్తం పది కోర్టులను ఏర్పాటుచేయనున్నారు. రూ.కోటి వ్యయంతో పార్కింగ్‌, అంతర్గత సీసీ రోడ్లు, లాన్‌ను ఏర్పాటు చేశారు. మరో రూ.65లక్షలతో కోర్టు ప్రాంగణంలోనే శిశు సంక్షేమ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. 

Updated Date - 2021-12-19T07:19:40+05:30 IST