అనంతగిరి ఆసుపత్రిలో కొవిడ్ చికిత్సకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-05-22T04:49:36+05:30 IST
అనంతగిరిలో కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని
- ఇప్పటి నుంచే థర్డ్‌వేవ్‌కు సిద్ధం కావాలి
- అధికారులను ఆదేశించిన మంత్రి సబితారెడ్డి
- రీజినల్ సబ్ సెంటర్ మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్) : అనంతగిరిలో కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆమె శుక్రవారం వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని ప్రభుత్వ క్షయ, ఛాతి వ్యాధుల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కొవిడ్ బాధితులకు చికిత్స చేసేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మెన్ నాగేందర్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, డీఎంహెచ్‌వో సుధాకర్ సింధే, మునిసిపల్ చైర్‌పర్సన్ మంజులతో కలిసి మంత్రి కొవిడ్ చికిత్స ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతగిరిలోని 200 పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలు సిద్ధం చేయాలని, ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటునకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. తాండూరులో ఇప్పటికే మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రంలో కరోనా బాధితులకు చికిత్సలు చేస్తున్నారని, త్వరలో అనంతగిరి కొవిడ్ కేంద్రం కూడా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వికారాబాద్ జిల్లాకు రీజినల్ సబ్ సెంటర్‌ను మంజూరు చేసిన సీఎంకు ఆమె జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞత లు చెప్పారు. జిల్లాకు మంజూరైన ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు నియంత్రించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో రూ.2,500లకే సీటీ స్కాన్ చేయనున్నారని మంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే, ఇప్పటి నుంచే థర్డ్‌వేవ్‌కు సంసిద్ధం కావాలని, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.