‘ఉపాధి’ పరుగు

ABN , First Publish Date - 2021-01-26T05:20:30+05:30 IST

2021-22 ఆర్థిక సంవత్సరంలో వికారాబాద్‌ జిల్లాలో ఉపాధి హామీ పనులు పరుగులు పెట్టనున్నాయి.

‘ఉపాధి’ పరుగు

  • ఉపాధి హామీ పనుల ప్రణాళిక ఖరారు
  • కోటి పని రోజుల లక్ష్యం
  • వచ్చే ఆర్థిక సంవత్సరానికి పనుల గుర్తింపు
  • వికారాబాద్‌ జిల్లాలో 4.16 లక్షల మంది కూలీలకు లబ్ధి


2021-22 ఆర్థిక సంవత్సరంలో వికారాబాద్‌ జిల్లాలో ఉపాధి హామీ పనులు పరుగులు పెట్టనున్నాయి. ఈసారి కూలీలకు అధిక పని దినాలు కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆమోదం తెలపడమే ఆలస్యం. పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో వికారాబాద్‌ జిల్లాలో చేపట్టాల్సిన పనుల ప్రణాళిక ఖరారైంది. గ్రామాల్లో సభలు నిర్వహించి చేపట్టాల్సిన పనులను గుర్తించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు 1.03 కోట్ల పని రోజులు కల్పించాలనే లక్ష్యాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్దేశించుకున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం పంపించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తరువాత ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభం కానుంది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 566 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 1,87,974 ఉపాధి హామీ జాబ్‌ కార్డులు ఉండగా, వీటిలో 4,16,298 మంది కూలీలు నమోదై ఉన్నారు. 13,515 శ్రమశక్తి సంఘాలు ఉండగా, 2,53,289 మంది కూలీలు ఉపాధి పనుల్లో చురుకుగా పాల్గొనే వారున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 63.54లక్షల పనిరోజుల్లో కూలీలకు ఉపాధి కల్పించగలిగారు. ఇంతవరకు జిల్లాకు కేటాయించిన పనిరోజుల లక్ష్యంలో 71.08 శాతం పూర్తి చేయగలిగారు. సాధారణంగా ఉపాధి కూలీకి రోజుకు రూ.237 కూలీ వేతనంగా నిర్ధారించగా, జిల్లాలో సరాసరి కూలీ వేతనం 182.13గా నమో దైంది. జిల్లా వ్యాప్తంగా 9,768 కుటుంబాలు  వంద పని రోజులను పూర్తి చేయగా, ఉపాధి హామీ కుటుంబాలకు సరాసరి 55.71 పనిరోజులు కల్పించగలిగారు. ఈ ఏడాది ఇంతవరకు ఉపాధి కూలీలకు వేతనం రూపంలో రూ.1,145.80 లక్షలు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలల గడువు ఉండడంతో అంతలోపు మిగిలిన పని రోజుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


అడిగిన ప్రతి కూలీకి పని కల్పించేలా..

పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేక ఇళ్లకే పరిమితమైన వారికి ఉపాధి కల్పించి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా కృషి చేశారు. గ్రామీణ కూలీలు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పిస్తూ జీవనోపాధికి దోహదపడాలనేది ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద జాబ్‌కార్డు పొందిన ప్రతి కుటుంబానికి ఏడా దిలో తప్పనిసరిగా వంద రోజుల పాటు పని కల్పించాల్సి ఉంటుంది. చేపట్టే పనిలో కూలీల వేతనం 60 శాతానికి తగ్గకుండా, మిగతా 40 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌గా ఉండేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. ఈ పథ కం ద్వారా భూగర్భ జలా లు పెంపొందించే పనులతో పాటు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కందకాలు, కాంటూరు కందకాలు, ఇంకుడు గుం తలు, బావుల తవ్వకం, చెరువులు, కాలువల్లో పూడిక తొలగింపు, పొలాల వద్దకు రోడ్ల నిర్మాణం, వర్మీ కం పోస్టు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద భవనాలు, ప్రహరీగోడలు, సీసీ రోడ్ల వంటి నిర్మాణ పనులు చేపడతారు. గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రణాళికల ఆధారంగానే ఎంత మంది కూలీలకు ఏ మేర ఉపాధి కల్పించగలుగుతామనేది అంచనా వేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. 

Updated Date - 2021-01-26T05:20:30+05:30 IST