రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌

ABN , First Publish Date - 2021-05-12T07:56:36+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకు రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అయింది. కొవిడ్‌ కంటే ముందు వరకు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఆకాశమే హద్దుగా పెరిగిన స్థిరాస్తుల ధరల్లో ఇప్పుడు స్తబ్ధత నెలకొంది.

రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌

సెకండ్‌ వేవ్‌లో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు.. 

తగ్గిన గిరాకీ.. స్తంభించిన స్థిరాస్తుల ధరలు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకు రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అయింది. కొవిడ్‌ కంటే ముందు వరకు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఆకాశమే హద్దుగా పెరిగిన స్థిరాస్తుల ధరల్లో ఇప్పుడు స్తబ్ధత నెలకొంది. గత మార్చి నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. రంగారెడ్డి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో స్థిరాస్తుల క్రయవిక్రయాల ద్వారా రిజిస్ట్రేషన్‌ శాఖకు మార్చి నెలలో రూ.300 కోట్లు రాగా.. మేలో రూ.100 కోట్లు కూడా దాటే అవకాశాలు కనిపించడం లేదు. రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం భారీగా తగ్గడం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఫ్రభావం చూపుతోంది. అందుకే ప్రభుత్వం లాక్‌డౌన్‌పై ఆసక్తి కనబర్చలేదు. అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక మందగమనం వల్లే ఆస్తుల క్రయవిక్రయాలు భారీగా తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. 


మధ్య తరగతి వర్గాలు ఆస్తుల కొనుగోళ్లపై ఆసక్తి కనబరచకపోవడంతో ఫ్లాట్‌లు, ప్లాట్ల కొనుగోళ్లు ఇటీవల బాగా తగ్గిపోయాయి. అయితే, నల్లధనం ఉన్న వాళ్లు, వ్యాపారస్తులు, బడా వ్యక్తులు మాత్రం ఎకరాల్లో భూములు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అయితే, కరోనా రెండో వేవ్‌ ఉధృత రూపం దాల్చడంతో ఇటీవల అన్ని వ్యాపారాలతో పాటు రియల్‌ ఎస్టేట్‌ దూకుడు కూడా తగ్గింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఈ జిల్లా నుంచే వస్తోంది. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలో మార్చి నెలలో రూ.297.19 కోట్ల ఆదాయం రాగా.. ఏప్రిల్‌లో రూ.195.53 కోట్లే వచ్చింది. అంటే ఒక్క నెలలోనే రూ.100 కోట్ల ఆదాయం తగ్గింది. అలాగే ఈ నెల 10 వరకు రూ.31.32 కోట్లే వచ్చింది. లాక్‌డౌన్‌ వల్ల ఈ నెలలో ఆదాయం రూ.100 కోట్లు చేరడం కష్టమే. మార్చితో పోలిస్తే ఈ నెల మూడో వంతు ఆదాయం కూడా రాదు. ఇక డాక్యుమెంట్ల ప్రకారం చూస్తే మార్చిలో రంగారెడ్డి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో 30,165 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా.. ఏప్రిల్‌లో 22,912 రిజిస్ట్రేషన్లే జరిగాయి. ఇక మేలో 10వ తేదీ వరకు 4,337 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. 


డీఆర్‌ కార్యాలయం ద్వారానే ఎక్కువఆదాయం

రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే విలువైన స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇతర సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా సింహభాగం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. ఏప్రిల్‌లో రంగారెడ్డి పరిధిలో వచ్చిన రూ.195 కోట్ల ఆదాయంలో జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారానే రూ.61.89 కోట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 2411 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Updated Date - 2021-05-12T07:56:36+05:30 IST