వరంగల్‌ కోర్టు.. రోల్‌ మోడల్‌..

ABN , First Publish Date - 2021-12-20T06:02:18+05:30 IST

వరంగల్‌లో ప్రారంభించిన పది కోర్టుల నూతన భవన సముదాయం మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా ఉంటుందని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. తన ఆలోనలకు, భావాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోర్టు ఆధునీకరణ జరగడం ఆనందగా ఉందన్నారు.

వరంగల్‌ కోర్టు.. రోల్‌ మోడల్‌..
కోర్టు భవన సముదాయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ముద్రించిన సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న సీజేఐ ఎన్వీ రమణ, ఇతర జడ్జిలు, వరంగల్‌ కోర్టు నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న సీజేఐ ఎన్వీ రమణ, కార్యక్రమానికి హాజరైన న్యాయవాదులు, ప్రజలు

నూతన భవనం మిగతా కోర్టులకు ఆదర్శం
వరంగల్‌తో ఆత్మీయ అనుబంధం
ఇక్కడి చారిత్రక కట్టడాలు అద్భుతం
పిల్లలకు తెలుగు నేర్పండి.. తెలుగులోనే మాట్లాడించండి..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ
ఘనంగా కోర్టు భవన సముదాయానికి ప్రారంభోత్సవం


హనుమకొండ, డిసెంబరు 19 (ఆంరఽధజ్యోతి):
వరంగల్‌లో ప్రారంభించిన పది కోర్టుల నూతన భవన సముదాయం మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా ఉంటుందని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. తన ఆలోనలకు, భావాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోర్టు ఆధునీకరణ జరగడం ఆనందగా ఉందన్నారు. ఆదివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలో రూ.23.30కోట్ల వ్యయంతో నిర్మించిన పది కోర్టుల న్యాయ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జస్టిస్‌ రమణ ప్రసంగించారు. పోక్సో కోర్టులో ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి తద్వారా బాధితులకు అసౌకర్యం కలుగకుండా  ఏర్పాట్లు చేయడం ముదావహం అన్నారు. దీనిని వీడియో తీసి ఇస్తే మిగతా రాష్ట్రాల్లోని కోర్టులకు పంపి, వరంగల్‌ కోర్టును ఒక మోడల్‌ తీసుకోవాలని చెబుతానని అన్నారు.

మౌలిక వసతులు అవశ్యం
కోర్టులో మౌలిక వసతులు లేకుండా కేసులు సత్వరం పరిష్కారం కావని చీఫ్‌ జస్టిస్‌ రమణ అన్నారు. కోర్టుల్లో  కేసులు పేరుకు పోవడానికి కారణం న్యాయమూర్తుల కొరతే కాదు.. సరైన మౌలిక వసతులు లేకుండా  కోర్టు భవనాల్లో  న్యాయవాదులు పని చేయాలను కోవడం  దురాశ అవుతుంది అన్నారు. వరంగల్‌ జ్యుడీషియల్‌ జిల్లాలోనే దాదాపు 71,348 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో ఈ ఒక్క వరంగల్‌ కోర్టు సముదాయంలోనే 40,769 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. కోర్టుల్లో తగిన సదుపాయాలు లేకపోవడంవల్ల కేసుల పెండింగ్‌ పెరుగుతోందన్నారు. కేంద్రం నిధులతో పాటు రాష్ట్ర ప్రభు త్వ గ్రాంట్‌తో కోర్టు భవనాలను అభివృద్ధి చేయాల్సి ఉండ గా చాలారాష్ట్రాల్లో అది అమలు కావడం లేదని, రాష్ట్ర ప్ర భుత్వాలు నిధులు కేటాయించడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం నిధులు ఇవ్వకపో యినా కోర్టు భవనాలను నిర్మిస్తోందని ప్రశంసించారు.

తెలుగు పరిమళం
‘అన్ని భాషలు నేర్చి అంధ్రంబు రాదంటు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అన్న కాళోజీ కవితను ఉటంకిస్తూ చీఫ్‌ జస్టిస్‌ రమణ తన ప్రసాగాన్ని తెలుగులో కొనసాగించారు. వరంగల్‌లో తనకు బంధువులు, మిత్రులు కూడా ఉన్నారన్నారు. వరంగల్‌తో తనకు అవినాభావ, అత్మీయ సంబంధం ఉందన్నారు. కాకతీయుల కీర్తి కమనీయమైన కాంతి పుంజమై వెలుగుదారులు చూపి నడిపించు.. అంటూ ఓరుగల్లు వైభవాన్ని చాటిచెప్పే తెలుగు పద్యాన్ని ఈ సందర్భంగా ఆలపించారు. వరంగల్‌ ఒక చారిత్రాత్మక నగరమని, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికరంగాలో ప్రముఖస్థానంలో ఉందని చెప్పారు. ప్రగతి శీల ఉద్యమాలకు  నెలవుగా అంతర్జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమం నుంచి కాంగ్రెస్‌ జాతీయ  ఉద్యమం నుంచి మితవాద, మతవాద, అనేక రాజకీయ ఉద్యమాలకు పుట్టినిల్లు అన్నారు. పోరాటగడ్డ, కళలకు, సంస్కృతికి, సాహిత్యానికి నెలవు ఈ ప్రాంతమని కొనియాడారు. అనేక మంది కవులు, స్వతంత్ర పోరాట యోధులు, విప్లవకారులు తిరిగిన నేల ఇది అన్నారు. బమ్మెర పోతన, పాల్కురి సోమన, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణ రావు వంటి సరస్వతీ పుత్రులకు జన్మనిచ్చిన భూమి అన్నారు. దేశానికి ఒక ప్రధానమంత్రిని ప్రసాదించిన ప్రాంతమన్నారు. నిరంకుశ, నియంతృత్వ పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన అనేక  పోరాటాలకు పుట్టినిల్లు ఇదన్నారు. ఓరుగల్లుకు వందననం.. పోరుగల్లుకు వందనం.. అంటూ కీర్తించారు. మాతృభాషలో మాట్లాడండి.. మాతృ భాషను ప్రేమించండీ.. అని పిలుపునిచ్చారు. తెలుగు భాషలో అద్భుతమైన సాహిత్యం ఉందని, కవిత్వం, పద్యం ఉందన్నారు. ఇంట్లో పిల్లలను తెలుగులో మాట్లాడేట్టు చేయండని సూచించారు. ఆంగ్ల భాషను నేర్చుకోమనండి.. కానీ తెలుగులో కూడా మాట్లాడేలా పిల్లలను పెంచాలని కోరారు. వరంగల్‌లో అనేక అద్భుత కట్టడాలు ఉన్నాయన్నారు. రామప్ప, వేయిస్తంభాల గుడి గొప్పకట్టడాలను, భద్రకాళి ఆలయాన్ని సందర్శించినప్పుడు తనకు ఎంతో ఆనందం కలిగిందన్నారు.

ఘనమైన వారసత్వం
ఉమ్మడి వరంగల్‌ కోర్టుకు ఘన చరిత్ర ఉందన్నారు. 1936లో ప్రారంభించిన ఈ కోర్టు అనేకమైన పురాతన కట్టడాలకు నిలయమై ఉందన్నారు. ఎందరో స్వతంత్ర సమర యోధులు, దేశభక్తులతో ఈ కోర్టు ప్రాంగణం పునీతమైందన్నారు. ఇక్కడి నుంచే జస్టిస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జస్టిస్‌ రఘువీర్‌, జస్టిస్‌ మోతీలాల్‌ నాయక్‌, జస్టిస్‌ నర్సింహారెడ్డి, జస్టిస్‌ కేశవరావులాంటి న్యాయమూర్తులను కూడా ఈ బార్‌ అసోసియేషన్‌ ప్రసాదించిందన్నారు. పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్‌ నవీన్‌రావు కోర్టుల పునర్నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. తన మానస పుత్రికగా జిల్లా కోర్టు కోర్టు భవనాన్ని తీర్చిదిద్దారని ఎన్‌వీ రమణ కొనియాడారు.

ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి సతీష్‌ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్‌ బుయాన్‌, జస్టిస్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, జస్టిస్‌ నవీన్‌రావు, ఆడ్వకేట్‌ జనరల్‌ బండి ప్రసాద్‌, సోలిటర్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి, జిల్లా జడ్జి నందికొండ నర్సింగరావు, అదనపు జిల్లా జడ్జీలు, సీనియర్‌, జూనియర్‌ జడ్జీలు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే వీ ఈశ్వర్‌ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి మట్టెవాడ విజయ్‌ కుమార్‌, ఉపాధ్యక్షు డు నల్ల మహాలక్ష్మి, సంయుక్త కార్యదర్శి క్రిష్ణ స్వామి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు దుస్స జనార్దన్‌, బైరపాక జయాకర్‌, నందికొండ సంజీవరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-20T06:02:18+05:30 IST