కొత్త ఠాణాల ఊసేది?
ABN , First Publish Date - 2021-10-20T05:24:24+05:30 IST
కొత్త ఠాణాల ఊసేది?
మూడు చోట్ల ఏర్పాటుకు గతంలోనే ప్రతిపాదనలు
ఏళ్లు గడుస్తున్నా కలగని మోక్షం
పెరుగుతున్న జనాభా.. విస్తరిస్తున్న నగరం..
సవాలుగా మారుతున్న శాంతిభద్రతల పరిరక్షణ
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లదీ అదే తీరు
మూడింటితోనే నెట్టుకువస్తున్న పోలీసులు
వరంగల్ క్రైం, అక్టోబరు 19: వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో కొత్త ఠాణా (పోలీస్ స్టేషన్)ల ఏర్పాటు ప్రక్రియ ప్రతిపాదనలకే పరిమితమైంది. కమిషనరేట్ ఏర్పడి ఆరేళ్లు అవుతున్నా వాటి ఊసేలేకుండా పోయింది. కమిషనరేట్ ఏర్పాటు సమయంలో కొత్తగా నాలుగు ఠాణాలు నెలకొల్పాలని నిర్ణయించారు. అలాగే నగరంలో పెరుగుతున్న జనాభా కనుగుణంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను సైతం పెంచాలని నిర్ణయించారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు.
మూడు జోన్లు... తొమ్మిది డివిజన్లు...
కమిషనరేట్‌గా 2015లో ఏర్పాటైనా ఇంకా, వరంగల్ పోలీస్ శాఖ మూడు జోన్లు తొమ్మిది డివిజన్లతో కొనసాగుతోంది. వీటిని ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, సెంట్రల్ జోన్‌గా విభజించారు. ఒక్కో జోన్‌కు ఒక్కో డీసీపీని నియమించారు. ఈస్ట్‌జోన్ పరిధిలో మామునూర్, పరకాల, నర్సంపేట డివిజన్లు ఉన్నాయి. వెస్ట్‌జోన్ పరిధిలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట డివిజన్లు కొనసాగుతున్నాయి. ఇక సెంట్రల్ జోన్ పరిధిలో వరంగల్, హన్మకొండ, కాజీపేట డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్ల కింద మొత్తం 53 పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. 2016 అక్టోబరులో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా నూతన మండలాలు ఆవిర్భవించాయి. కొత్తగా ఏర్పాటైన దామెర (ఈస్ట్ జోన్), ఐనవోలు, తరిగొప్పుల (వెస్ట్ జోన్), వేలేరు (సెంట్రల్ జోన్) మండలాల్లో కొత్త పోలీ్‌సస్టేషన్లు ప్రారంభించారు. వీటితోపాటు కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీస్ స్టేషన్, క్రైం, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, సీసీఆర్‌బీ, షీటీమ్స్, సైబర్ క్రైమ్స్, ఐటీ కోర్ విభాగాలు పనిచేస్తున్నాయి. కొన్ని విభాగాలను సిబ్బంది కొరత వేధిస్తోంది.
ముగ్గురు సీపీలు మారినా...
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు వరంగల్ పోలీస్ శాఖ అర్బన్, రూరల్‌గా ఉండేది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్బన్, రూరల్ జిల్లాలుగా ఉన్న పోలీ్‌సశాఖను కమిషనరేట్‌గా ఏర్పాటు చేశారు. తొలి సీపీగా సుధీర్‌బాబు బాధ్యతలు చేపట్టారు. ఆయన తర్వాత రవీందర్, అనంతరం ప్రమోద్ కుమార్ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం తరుణ్‌జోషి కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
కమిషనరేట్ ఏర్పాటుకు ముందు అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఎస్పీ రాజేష్‌కుమార్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నగరంలో అతి పెద్ద ఏరియా కలిగిన మిల్స్‌కాలనీ పోలీ్‌సస్టేషన్ పరిధిలో లేబర్ కాలనీ, ఇంతేజార్‌గంజ్ పరిధిలో ఏనుమాముల మార్కెట్ వద్ద, సుబేదారి పరిధిలో న్యూ శాయంపేటలో కొత్త పోలీ్‌సస్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆ నివేదికలో పేర్కొన్నారు. వీటితో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనగామ, నర్సంపేట, వర్ధన్నపేట, గీసుగొండ, ఆత్మకూరు, కేయూ పోలీ్‌సస్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ ఠాణాలు నెలకొల్పాలని ప్రతిపాదించారు. అంతేగాకుండా ఖిలావరంగల్ అశ్వకదళం సైతం ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన చర్యలు కూడా ప్రారంభించారు. అవేవీఇంతవరకూ ప్రారంభానికి నోచుకోలేదు.
ట్రాఫిక్ సమస్య...
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైన తర్వాత కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు తోడు వావానాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. స్టేషన్ల సంఖ్యకు తోడు సిబ్బంది కూడా అనుకున్నంత స్థాయిలో పెరగడం లేదనే వాదనలున్నాయి. పది లక్షల జనాభా కలిగిన నగరంలో ట్రాఫిక్ విభాగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. నగరంలో మూడు ట్రాఫిక్ (వరంగల్, హన్మకొండ, కాజీపేట) పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. ఆయా పోలీస్ స్టేషన్లకు ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు విధులు నిర్వహిస్తున్నారు. వీరిని ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచడంతోపాటు డీసీపీ స్థాయి అధికారిని నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.