హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తాం

ABN , First Publish Date - 2021-09-13T08:20:01+05:30 IST

వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయనుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు...

హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తాం

ఈసారికి యథావిధిగా 

నిమజ్జనానికి అనుమతించండి

మంత్రి తలసాని శ్రీనివాస్‌ విజ్ఞప్తి


ఖైరతాబాద్‌ సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయనుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారి్‌సతో చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మంత్రి ఖైరతాబాద్‌ గణపతి వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డి, ఉత్సవ సమితి ప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితికి ఒకరోజు ముందు కోర్టు తీర్పు రావడం వల్ల వాటిని అమలు చేసే సమయం లభించలేదని అన్నారు. సాగర్‌లో నిమజ్జనం జరిగిన 48 గంటలలోపు పీవోపీ విగ్రహాలతో పాటు వ్యర్థాలను తొలగించే ప్రక్రియ పూర్తవుతుందని హామీ ఇస్తున్నామని చెప్పారు. ‘‘హైదరాబాద్‌ నిమజ్జనోత్సవానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. కాబట్టి హైకోర్టు పెద్ద మనసు చేసుకొని ఈసారి విగ్రహాలను యఽథావిధిగా హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు అనుమతివ్వాలి. ఇప్పటికిప్పుడు వాటర్‌ పాండ్‌లను ఏర్పాటు చేయడం సాధ్యపడదని కోర్టుకు విన్నవిస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-13T08:20:01+05:30 IST