క్యారెట్ బొబ్బట్లు
ABN , First Publish Date - 2021-10-09T18:22:54+05:30 IST
గోధుమపిండి - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, క్యారెట్ తురుము - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, బాదం - నాలుగైదు, కొబ్బరి తురుము - పావుకప్పు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, యాలకులు - ఒక టీస్పూన్
కావలసినవి: గోధుమపిండి - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, క్యారెట్ తురుము - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, బాదం - నాలుగైదు, కొబ్బరి తురుము - పావుకప్పు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, యాలకులు - ఒక టీస్పూన్.
తయారీ విధానం: ఒక బౌల్‌లో గోధుమపిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ చపాతీ పిండి కన్నా మెత్తగా కలుపుకోవాలి. తరువాత ఒక టీస్పూన్ నెయ్యి వేసి మళ్లీ ఒకసారి కలుపుకొని పావుగంట పక్కన పెట్టుకోవాలి. బాదం, జీడిపప్పును మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. స్టవ్‌పై వెడల్పాటి ఒక పాత్రను పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. తరువాత బెల్లం వేసి కలియబెట్టాలి. బెల్లం కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ పొడి, పావు కప్పు కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. కాసేపు వేగిన తరువాత యాలకుల పొడి వేయాలి. స్టవ్ పై నుంచి దింపి పక్కన పెట్టుకోవాలి. మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు గోధుమపిండి కొద్దిగా తీసుకుని అరచేతిలో కాస్త వెడల్పుగా ఒత్తి, మధ్యలో క్యారెట్ ఉండ పెట్టి చుట్టూ చివర్లు దగ్గరకు ఒత్తాలి. ఒక పాలిథీన్ పేపర్‌పై నెయ్యి వేసి చేత్తో ఒత్తుకుంటూ బొబ్బట్లు తయారుచేసుకోవాలి. ఈ బొబ్బట్లను నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని వేడి వేడిగా తింటూ పండుగ మజాను ఆస్వాదించవచ్చు.