కరివేపాకు కర్రీ
ABN , First Publish Date - 2021-10-23T17:23:40+05:30 IST
కరివేపాకు - 50గ్రాములు, మెంతులు - ఒక టీస్పూన్, మినప్పప్పు - ఒక టీస్పూన్, ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్, ఎండుమిర్చి - మూడు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, చింతపండు రసం - ఒక కప్పు, ఉల్లిపాయలు
కావలసినవి: కరివేపాకు - 50గ్రాములు, మెంతులు - ఒక టీస్పూన్, మినప్పప్పు - ఒక టీస్పూన్, ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్, ఎండుమిర్చి - మూడు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, చింతపండు రసం - ఒక కప్పు, ఉల్లిపాయలు - రెండు, పసుపు - ఒక టీస్పూన్, బెల్లం - ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు - తగినంత, నువ్వుల నూనె - ఒక టీస్పూన్, కరివేపాకు- ఒక కట్ట(పోపు కోసం), ఆవాలు - ఒక టీస్పూన్, మినప్పప్పు - ఒక టీస్పూన్.
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి మెంతులు, మినప్పప్పు, ఎండుమర్చి, ధనియాలు వేసి వేగించాలి. తరువాత వీటిని మిక్సీలో వేసి పట్టుకోవాలి. అందులోనే కొబ్బరి తురుము, కరివేపాకు కూడా వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్‌పై ఒక పాత్రనుపెట్టి నువ్వుల నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత చింతపండు రసం పోయాలి. పసుపు, తగినంత ఉప్పువేసి మరిగించాలి. మరుగుతున్న సమయంలోనే మిక్సీలో వేసి పట్టుకున్న కరివేపాకు మిశ్రమం వేసి కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు ఉండేలా చూసుకోవాలి. కాసేపు ఉడికిన తరువాత బౌల్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు పోపు తయారుచేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినప్పప్పు వేసి వేగించాలి. తరువాత కరివేపాకు వేయాలి. ఈ పోపును కర్రీలో కలుపుకోవాలి. ఈ కరివేపాకు కర్రీ అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.