Addanki Politics: అద్దంకి వైసీపీలో వేరు కుంపట్లు.. యువనేతకు తప్పని అసంతృప్తి సెగలు
ABN , First Publish Date - 2022-09-09T23:27:27+05:30 IST
అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ బాచిన కృష్ణచైతన్యకు గ్రూపు రాజకీయాలుతలనొప్పిగా మారాయట. అద్దంకిలో...
బాపట్ల (Bapatla): అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ బాచిన కృష్ణచైతన్య (Addanki Ycp Incharge Krishna Chaitanya)కు గ్రూపు రాజకీయాలు (Group Politics) తలనొప్పిగా మారాయట. అద్దంకిలో కృష్ణచైతన్యకి వ్యతిరేకంగా ఏర్పాటైన వర్గం పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుందట. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ.. కృష్ణచైతన్యపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారట. దీంతో.. అద్దంకి వైసీపీ (Ycp) వర్గపోరు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుందట.
ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కృష్ణచైతన్య తండ్రి బాచిన చెంచు గరటయ్య సీనియర్ నేత. గత ఎన్నికల సమయంలో తండ్రి వారసత్వంగా కృష్ణచైతన్య రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా.. వైసీపీ పెద్దలు ఆయన్ను పక్కన పెట్టి తండ్రికి టిక్కెట్ కేటాయించారు. అయితే గరటయ్య ఓటమి చెందడంతో ఆయన కుమారుడికి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గత రెండేళ్లుగా కృష్ణచైతన్య కనుసన్నల్లోనే అద్దంకి వైసీపీ రాజకీయాలు, అధికార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో కృష్ణచైతన్యకు వైసీపీలో అసమ్మతి తీవ్రమైందట. అద్దంకిలో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ఝలక్ ఇస్తున్నారట. పార్టీ బలోపేతానికి కృషి చేసే కార్యకర్తల కోసం అంటూ అద్దంకి నియోజకవర్గ వైసీపీ పరిరక్షణ సమితి పేరుతో ప్రత్యేక కూటమిని తయారు చేశారట. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ వ్యతిరేక వర్గాన్ని కూడగడుతున్నారట. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని.. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కృష్ణ చైతన్య ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్య నేతలకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారట.
ఇక వ్యతిరేక వర్గమంతా కలిసి పోటీగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహించడం.. కృష్ణ చైతన్యకు మింగుడు పడడం లేదట. అసమ్మతి వర్గాన్ని పార్టీ ముఖ్య నేతలతో బుజ్జగించాలని ప్రయత్నించినా చర్చలు ఫలించలేదట. దీంతో రాబోయే ఎన్నికల్లో అద్దంకి నుండి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న కృష్ణ చైతన్యకు తాజా పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. మొత్తంగా అద్దంకి వైసీపీలో నెలకొన్న అసమ్మతి సెగను తట్టుకుని కృష్ణ చైతన్య.. తన పొలిటికల్ ఫ్యూచర్‌ను ఎలా మలుకుంటారో వేచి చూడాల్సిందే.