Amara Raja: మహబూబ్‌నగర్‌కు అమరరాజా.. ఫలితంగా ఏం జరగనుందంటే..
ABN , First Publish Date - 2022-12-03T20:35:01+05:30 IST
మహబూబ్‌నగర్‌కు (Mahabubnagar) మణిపూసలాంటి మరోభారీ పరిశ్రమ రాబోతోంది. ప్రతిష్టాత్మక అమరరాజా గ్రూప్ (Amara Raja Group) మహబూబ్‌నగర్ పట్టణంలోని దివిటిపల్లిలో..
మహబూబ్‌నగర్ (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌కు (Mahabubnagar) మణిపూసలాంటి మరోభారీ పరిశ్రమ రాబోతోంది. ప్రతిష్టాత్మక అమరరాజా గ్రూప్ (Amara Raja Group) మహబూబ్‌నగర్ పట్టణంలోని దివిటిపల్లిలో లిథియం ఆయాన్‌గిగా ఫ్యాక్టరీని (Lithium ion battery gigafactory) ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రికల్ వాహనాల్లో వాడే బ్యాటరీలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. వచ్చే పదేళ్లలో ఈ సంస్థ ఇక్కడ రూ.9500 కోట్ల పెట్టుబడులతో కంపెనీ విస్తరించనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 7500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పరోక్షంగా ఎందరికో ఉపాధి కలుగుతుంది.
దివిటిపల్లిలో సుమారు 380 ఎకరాల్లో ఐటీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ జరిపిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇప్పటికే ఐటీ కారిడార్ ఏర్పాటుకు గాను ఐటీ టవర్ నిర్మాణం కొనసాగుతుండగా, తాజాగా భారీగా ఉద్యోగావకాశాలకు ఆస్కార ముండేలా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందడుగు పడింది. ఈనెల 4న సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు సరిగ్గా ఒక్కరోజు ముందే పాలమూరు యువతకు మంత్రి కేటీఆర్ తీపికబురునందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు
పాలమూరు ఐటీ ఇండస్ట్రీ కారిడార్‌లో అమర్‌రాజా బ్యాటరీస్ పరిశ్రమను తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌లకు మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. తొలిదశలో 5 వేల మందికి క్రమంగా 10 వేల మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అందించే ఈ పరిశ్రమను మహబూబ్ నగర్‌కు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేసేవిధంగా నిర్మించిన ఐటీ టవర్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని గుర్తచేశారు.
హన్వాడ వద్ద సుమారు 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌పార్క్ వల్ల ఐటీ కారిడార్‌గా ఈ ప్రాంతం మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ మీదుగా జాతీయ రహదారులు, డబ్లింగ్ రైల్వేలైన్ ద్వారా చక్కటి రవాణా వసతి ఉంటుందని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇక్కడి నుంచి గంట వ్యవధిలోనే వెళ్లే సౌకర్యం ఉన్నందున పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ ప్రాంతం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.