కోర్టు ఆదేశాలకు పోలీస్‌ వక్రభాష్యం

ABN , First Publish Date - 2022-10-28T03:18:07+05:30 IST

పాదయాత్ర నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతూ పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి...

కోర్టు ఆదేశాలకు పోలీస్‌ వక్రభాష్యం

మహిళలపై అసభ్య పదజాలంతో దూషణలు

ఐడీల సాకుతో పాదయాత్రికులను ఈడ్చేశారు

600 మందికీ అధికారులు ఐడీలు ఇవ్వలేదు

యాత్రలో వృద్ధులు, మహిళలు అత్యధికం

పోలీస్‌ దురుసు ప్రవర్తనతోనే యాత్రకు విరామం

సంఘీభావంపై ఇచ్చిన ఆదేశాలు సవరించండి

అమరావతి పరిరక్షణ సమితి వాదనలు

నేడు హైకోర్టులో తుది విచారణ

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పాదయాత్ర నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతూ పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి... హైకోర్టుకు ఫిర్యాదుచేసింది. మహిళలు అని కూడా చూడకుండా అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పాదయాత్రలో 600 మందినే అనుమతించాలని ఈ నెల 21న 12.30కు ఆదేశాలు ఇచ్చిన అరగంటలోనే ఐడీ కార్డులు చూపిస్తేనే పాదయాత్ర చేసేందుకు అనుమతిస్తామని పోలీసులు యాత్రను అడ్డుకున్నారని తెలిపింది. ఐడీ కార్డులు లేనివారిని ఈడ్చి బయట పడేశారని వాపోయింది. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తించారని, పాదయాత్ర చేస్తున్నవారికి మంచినీరు, ఆహారం, మెడికల్‌ సహాయం అందించేందుకు కూడా ఇతరులను పోలీసులు అనుమతించలేదని పేర్కొంది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనేవారిలో కేవలం 150మందికే అధికారులు ఐడీ కార్డులు అందజేశారని కోర్టుకు ఫిర్యాదు చేసింది. పాదయాత్రలో పాల్గొనేవారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారని తెలిపింది. పోలీసుల దురుసు ప్రవర్తనతో రామచంద్రాపురంలో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పేర్కొంది. ఏజీ స్పందిస్తూ...పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందనరావు స్పందిస్తూ... హైకోర్టు సింగి ల్‌ జడ్జి సెప్టెంబరు 9న ఇచ్చిన ఆదేశాలకు ఎలాంటి సవరణలు చేయలేదన్నారు. ‘‘పాదయాత్రకు మద్దతు తెలిపేవారు ఎలా సంఘీభావం తెలిపితే బాగుంటుందో చెప్పాలని పిటిషనర్‌, పోలీసులను సలహా కోరాం. ఇరువర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సంఘీభావం తెలపడానికి వచ్చేవారు రోడ్డుకు ఇరువైపుల నిలబడాలని చెప్పాం. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఆదేశాలు ఇవ్వలేం. ఆదేశాలు సవరించాలని కోరుతూ రివ్యూ పిటిషన్‌ వేసుకోండి’’ అని సలహా ఇచ్చారు.

సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ... సంఘీభావం తెలిపే విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని అభ్యర్ధించారు. ‘‘రైతులకు మద్దతుగా వచ్చేవారు పాదయాత్రకు ముందు లేదా వెనుక నడిచేలా అనుమతించాలి. పాదయాత్రలో పాల్గొనే 600 మంది రైతులకు రోప్‌పార్టీతో భద్రత కల్పించాలి. పాదయాత్రలో పాల్గొనేవారు అందరూ రైతులే. వారికి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ నేపఽథ్యంలో గతంలో హైకోర్టు ఆదేశాలను సవరించాలి’’ అని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ... గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని మాత్రమే తాను ఆదేశించగలనన్నారు. వ్యాజ్యాలపై తుదివిచారణ జరిపేందుకు విచారణ ను జస్టిస్‌ రఘునందనరావు శుక్రవారానికి వాయిదా వేశారు.

అమరావతి పరిరక్షణ సమితి అప్పీల్‌

అమరావతి రైతులు పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనాలని, యాత్రలో పాల్గొనే రైతుల వివరాలను డీజీపీకి అందజేయాలని, పాదయాత్రలో నాలుగువాహనాలు మించి వినియోగించడానికి వీల్లేదని సెప్టెంబరు 9న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి ధర్మాసనం ముందు అప్పీల్‌ వేసింది. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలన్న అభ్యర్థనను బెంచ్‌ తోసిపుచ్చింది. వ్యాజ్యం పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుందంటూ నవంబరు 1కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణల ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

Updated Date - 2022-10-28T03:18:09+05:30 IST